1989లో గన్నవరంలో 21.2 సెంటీమీటర్ల నమోదు
ఇప్పుడు అమరావతిలో 26 సెంటీమీటర్ల వర్షం
31వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా 75 శాతం ఏరియాలో వర్షాలు
సాక్షి, అమరావతి: విజయవాడ పరిసరాల్లో రికార్డు స్థాయిలో అతి భారీ వర్షాలు నమోదయ్యాయి. శనివారం అమరావతిలో 26 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇంతటి భారీ వర్షం ఇంతకుముందెన్నడూ ఈ ప్రాంతంలో నమోదు కాలేదని వాతావరణ శాఖ చెబుతోంది. ఆ శాఖ రికార్డుల ప్రకారం 1989లో గన్నవరంలో 21.2 సెం.మీ. వర్షపాతం నమోదైంది. 20 సెం.మీ. దాటితే అతి భారీ వర్షం కింద లెక్క. సమీప కాలంలో ఈ స్థాయి వర్షం విజయవాడ, గుంటూరు పరిసర ప్రాంతాల్లో కురిసిన దాఖలాలు లేవు. శనివారం ఆ స్థాయిలో వర్షం కురిసింది. అమరావతి కంటే ఎక్కువగా ఎన్టీఆర్ జిల్లా వత్సవాయిలో 32.3 సెం.మీ. వర్షం కురిసింది.
తిరువూరులోనూ 26 సెం.మీ. వర్షం కురిసింది. 14 మండలాల్లో సగటున 24 గంటల వ్యవధిలో 20 సెం.మీ. వర్షపాతం నమోదైంది. 62 ప్రాంతాల్లో 11.2 నుంచి 20 సెం.మీ. వర్షపాతం నమోదైంది. 14 జిల్లాల పరిధిలోని 94 స్టేషన్లలో 7 నుంచి 12 సెం.మీ. వర్షం పడింది. మొత్తంగా రాష్ట్రమంతటా వర్షపాతాన్ని లెక్కించే యంత్రాలున్న ప్రాంతాల్లోని 75 శాతం ఏరియాల్లో వర్షపాతాలు నమోదయ్యాయి. ఒకేరోజు ఇంత ఏరియాలో వర్షం కురవడం చాలా అరుదుగా జరుగుతుంది. అందుకే చాలా ప్రాంతాలు నీట మునిగాయి. వర్షాల తీవ్రత ఉమ్మడి కృష్ణా జిల్లాల్లో ఎక్కువగా ఉంది. 12 నుంచి 24 గంటల వ్యవధిలోనే క్లౌడ్ బరస్ట్ (మేఘాలు బద్ధలైనట్టు) అయినట్టు కుండపోత వర్షం పడింది.
ఈ వాన నీరంతా సమీపంలోని వాగులు గుండా కృష్ణా నదిలోకి ప్రవహిస్తోంది. ఖమ్మం పరీవాహక ప్రాంతాల్లోనూ భారీ వర్షాలు కురవడంతో మున్నేరు, కట్టలేరు, రామిలేరు వాగులన్నీ పొంగి బుడమేరులో కలిశాయి. బుడమేరు కృష్ణా నదిలో కలిసే పరిస్థితి లేకపోవడంతో విజయవాడ పరిసర ప్రాంతాల్లోకి ఈ నీరంతా వచ్చి చేరుతోంది. సాధారణంగా ఈ వర్షమంతా 48 గంటల్లో కురిస్తే అది నెమ్మదిగా వచ్చి డ్రెయిన్ల ద్వారా కృష్ణా నదిలో కలవాలి. కానీ.. 12 నుంచి 24 గంటల్లోనే అతి భారీ వర్షాలు కురవడంతో బుడమేరు ఒక్కసారిగా పొంగింది.
కొండవీడు ఘాట్ రోడ్డులో కూలిన కొండచరియలు
సాక్షి, అమరావతి: కొండవీడు ఘాట్ రోడ్డులో ఆదివారం కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో కొండవీడు నగరవనాన్ని సోమ, మంగళవారాలు మూసివేస్తున్నట్లు పల్నాడు జిల్లా అటవీ అధికారి ఎన్.రామచంద్రరావు తెలిపారు. ఘాట్ రోడ్డుపై పడిన బండరాళ్లను ఆర్‌అండ్‌బీ శాఖ సహకారంతో తొలగిస్తామని వెల్లడించారు. ఈ విషయాన్ని సందర్శకులు గమనించాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment