10 నిమిషాల్లో నిండిపోయిన 27 అడుగుల సెల్లార్
గోడ పగులగొట్టి బయటపడిన వైనం
గాంధీనగర్ (విజయవాడ సెంట్రల్) : భవానీపురం పోలీస్ స్టేషన్‌కు కూతవేటు దూరంలో హెచ్‌ఆర్‌టీ అపార్ట్‌మెంట్. ఐదు అంతస్తుల సౌధం. మొత్తం 66 ఫ్లాట్స్. 27 అడుగుల డబుల్ సెల్లారు. శనివారం అపార్ట్‌మెంట్ చుట్టుపక్కల వర్షపు నీరు చేరడంతో అడ్డుగా ఇసుక బస్తాలు వేశారు. ఆదివారం ఉదయానికి అమాంతం బుడమేరు వరద సెల్లార్‌లో చేరింది.
27 అడుగుల సెల్లార్ నిండిపోయింది. పార్కింగ్‌లో ఉన్న 42 కార్లు, 72 బైక్‌లు చూస్తుండగానే పూర్తిగా నీటమునిగిపోయాయి. విద్యుత్ సరఫరా లేదు. ఎవరూ బయటకు వచ్చే అవకాశం లేదు. మెట్ల మార్గం గుండా వచ్చి చూస్తే సెల్లారులో భయంకరమైన వరద. అపార్ట్‌మెంట్‌లో పిల్లలు, వృద్ధులు, దీర్ఘకాలిక వ్యా«దిగ్రస్తులు ఉన్నారు. చేసేది లేక అంతా అపార్ట్‌మెంట్ పైకి వెళ్లిపోయారు. లిఫ్ట్, మెట్ల గుండా సెల్లార్లోకి రావడానికి వీల్లేకుండాపోయింది.
అధికారులు ఎవరూ రాలేదు. ఎస్డీఆర్ఎఫ్ బృందాలకు ఫోన్ చేస్తే స్పందించలేదు. రాత్రి కొందరు అందుబాటులో ఉన్న వస్తువులతో కమర్షియల్ ప్లాట్ల వైపు ఫస్ట్ ఫ్లోర్ గోడను పగులగొట్టారు. గంటల సమయం పట్టింది. సోమవారం ఉదయానికి అపార్ట్‌మెంట్‌లో వాళ్లందరిని పగులగొట్టిన గోడ మార్గం గుండా బయటకు తీసుకెళ్లి లారీలు, ట్రాక్టర్లలో బంధువులు, స్నేహితుల ఇళ్లకు పంపించేశారు.
ఇంతటి నరకం ఎప్పుడూ చూడలేదు
నాకు భార్య, ఇద్దరు పిల్లలున్నారు. మా అత్తకూడా మా వద్దే ఉంటోంది. అపార్ట్‌మెంట్ సెల్లార్‌లో కేటాయించిన గదిలో ఉన్నాం. ఒక్కసారిగా వరద చుట్టుముట్టింది. నిమిషాల్లో మా గది మునిగిపోయింది. ఇంట్లో వస్తువులన్నీ వదిలేసి పిల్లలతో మూడో ఫ్లోర్‌లో తలదాచుకున్నాం. కరెంట్ లేదు. ఆహారం లేదు. మూడు రోజులుగా ఇదే పరిస్థితి. ఫ్లాట్స్ యజమానులంతా వెళ్లిపోయారు. మా కుటుంబమంతా బిక్కుబిక్కుమంటూ గడిపాం. ఇంతటి నరకం ఎప్పుడూ చూళ్లేదు. – గంగాధర్, భవానీపురంలో అపార్ట్‌మెంట్ వాచ్‌మెన్
గుండెలదిరిపోయాయి
వరద వస్తుందన్న సమాచారం లేదు. సెల్లార్లోకి వస్తున్న వరద చూసి కిందికి వెళ్లే ప్రయత్నం చేశాను. డబుల్ సెల్లార్ కావడంతో చుట్టుపక్కల వరద అంతా వేగంగా వచ్చి చేరింది. రాత్రంతా పాములు, పందికొక్కులు. రెండు రోజులు దుర్వాసన. తాగడానికి, వాడుకోవడానికి నీళ్లు లేవు. ఆహారం, పాలు కూడా లేవు. పరిస్థితి చూసి గుండెలదిరిపోయాయి. ఒక్క అధికారి కూడా రాలేదు. – ఆనంద్, భవానీపురంలో అపార్ట్‌మెంట్ నివాసి
కృష్ణా నది వరద ఓ వైపు.. బుడమేరు వరద మరోవైపు చూసి భయంతో వణికిపోయాం. పై ఫ్లోర్లలో ఉండే వారంతా లిఫ్ట్, మెట్ల నుంచి కిందకు దిగే పరిస్థితి లేక ఇళ్లలో వినియోగించే వస్తువులతో గంటల కొద్ది కష్టపడి గోడ పగులగొట్టాం. లారీ, ట్రాక్టర్ మాట్లాడుకుని పగులగొట్టిన గోడ మీదుగా గుండె జబ్బులు ఉన్నవారిని బయటకు తీసుకొచ్చాం. వారందరినీ బం«ధువులు, స్నేహితుల ఇళ్లకు పంపించేశాం. ప్రాణాలైతే కాపాడుకోగలిగాం గానీ భారీ ఆస్తినష్టం సంభవించింది.– శివ, ప్రెసిడెంట్, హెచ్‌ఆర్‌టీ అపార్ట్‌మెంట్
Comments
Please login to add a commentAdd a comment