పునరావాసానికి ‘దిక్కు’లేదు | Dismal failure of the government in rehabilitation | Sakshi
Sakshi News home page

పునరావాసానికి ‘దిక్కు’లేదు

Published Wed, Sep 4 2024 4:59 AM | Last Updated on Wed, Sep 4 2024 4:59 AM

Dismal failure of the government in rehabilitation

బాధితులకు పునరావాసం కల్పనలో ప్రభుత్వ ఘోర వైఫల్యం

కనీసం కేంద్రాల సమాచారం చెప్పేవారే లేరు

ఎక్కడకు వెళ్లాలో తెలియక ముంపు బాధితుల కష్టాలు

ఎక్కడ జాగా ఉంటే అక్కడే ఉండిపోతున్న వైనం 

రైల్వే ట్రాక్‌లు, ఫ్లయ్‌ఓవర్‌లపైకి భారీగా చేరిన ప్రజలు  

5 లక్షల బాధితులు ఉంటే.. ఒకే ఒక్క పునరావాస కేంద్రమా?

ముంపు ప్రభావిత ప్రాంతాల నుంచి సాక్షి ప్రతినిధి/లబ్బీపేట (విజయవాడ తూర్పు) :  బుడమేరు ముంపు బాధితులకు పునరావాసం కల్పించే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది. దీంతో పీకల్లోతు నీటిలో గంటల పాటు నడుచుకుంటూ బయటపడిన బాధితులు ఎక్కడికి వెళ్లాలో తెలియక దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. కనీసం ముంపు నుంచి బయటకు వచ్చిన వారికి పునరావాస కేంద్రాలు ఎక్కడ ఏర్పాటు చేశారో కూడా చెప్పే వారే లేరు.

 పునరావాస కేంద్రాల ఏర్పాటులో ప్రభుత్వం నిర్లక్ష్యం పట్ల బాధితులు మండిపడుతున్నారు. తరలింపు విషయంలో పట్టించుకోకపోయినా.. తమకు తాముగా వరద నుంచి బయట పడితే పునరావాసం కూడా కల్పించలేదని ఆరోపిస్తున్నారు. తమకు తెలిసిన వారి ఇళ్లకు కొందరు, బంధువుల ఇళ్లకు మరికొందరు వెళ్తున్నారు. తమకు విజయవాడలో ఎవరూ లేని వారు మాత్రం ఎక్కడకు వెళ్లాలో దిక్కుతోచక, ఏదొక చోట కాస్త జాగా చూసుకుని అక్కడే కూర్చుంటున్నారు. 

ఇలా నగరంలో ఎక్కడ చూసినా వరద బాధితులే కనిపిస్తున్నారు. ముత్యాలంపాడు వద్ద రైల్వే ట్రాక్, గుడులు, బీఆర్‌టీఎస్‌ రోడ్డు, సింగ్‌నగర్‌ బ్రిడ్జి, చిట్టినగర్‌ బ్రిడ్జిపైకి వేలాదిగా బాధితులు చేరారు. ఇలా ఎక్కడ చూసినా పిల్లలతో కలసి బిక్కుబిక్కు మంటూ గడుపుతున్న వారే కనిపిస్తున్నారు. దాతలు ఇచ్చే ఆహారం, నీళ్లు తీసుకుంటూ కాలం వెళ్లదీస్తున్నారు. 

నిస్సిగ్గుగా అబద్ధం
దాదాపు 167 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశామని నిస్సిగ్గుగా రాష్ట్ర ప్రభుత్వం అబద్దం చెబుతోంది. కాగితాల్లో మినహా వాస్తవంగా అలాంటివేవీ లేవని ‘సాక్షి’ బృందం పరిశీలనలో తేలింది. విజయవాడ వరద ముంపు ప్రభావం దాదాపు 5 లక్షల మందిపై పడిందని అధికారిక లెక్కలే చెబుతున్నాయి. నగరమంతా జల్లెడ­పడితే సత్యనారాయణపురంలోని ప్రశాంతి నగరపాలక సంస్థ ప్రత్యేక ప్రాథమిక పాఠశాలలో ఓ పునరావాసకేంద్రం మాత్రం కనిపించింది. అందులోకి సోమవారం 250 మందికి, మంగళవారం మరో 100 మందికి ఆశ్రయం కల్పించారు. 

అరకొర సౌకర్యాలతోనే బాధితులు కాలం గడుపుతున్నారు.  అపార్ట్‌మెంట్లు, డాబాలపైనే ప్రజలు ఆశ్రయం పొందుతుంటే.. వాటినే ప్రభుత్వం పునరావాస కేంద్రాలుగా చెప్పుకుంటోంది. డాబాలు, అపార్ట్‌మెంట్లలో ఉన్న వారు తాగునీరు, ఆహారం లేక ఇబ్బందులు పడుతున్నారు. కనీసం కాలకృత్యాలు కూడా తీర్చుకోలేక నరకయాతన అనుభవిస్తు­న్నారు. వరద ముంపు ప్రాంతాల్లో పలు స్వచ్ఛంద సంస్థలు ఆహారం, మంచినీరు వంటివి అందచేస్తున్నాయి. కానీ ఇవి నాలుగోవంతు మందికి కూడా అందడం లేదు.

రాణిగారితోటకు చెందిన పలువురు ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో మెట్లమీదే ఆశ్రయం పొందుతున్నారు. వీరికి కనీసం తిండి, తాగునీరు కూడా ప్రభుత్వం ఇవ్వడం లేదు. అక్కడున్న పోలీసులు ఇచ్చిన బ్రెడ్డు ముక్కలతో పిల్లలు కడుపునింపుకుంటున్నారు. దొరికిన ఒక బ్రెడ్డు నాదంటే.. నాదంటూ చిన్నారులు వాదులాడుకోవడం చూస్తే.. రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తోంది.

ఇలా రావడం.. అలా వెళ్లడమేనా! 
అధికారులు, ప్రజాప్రతినిధులు సురక్షిత ప్రాంతాల్లో తిరుగుతూ చేతులు ఊపుతూ.. అభివాదాలు చేస్తూ వెళ్తున్నారేతప్ప.. ముంపు ప్రాంతాల్లో చూద్దామంటే ఒక్క ప్రజాప్రతినిధి, అధికారులు కూడా కనిపించడం లేదు. ముఖ్యమంత్రి చంద్రబాబు సైతం కేవలం గొల్లపూడి బైపాస్‌ రోడ్డులో వచ్చి సురక్షిత ప్రాంతంలో హడావుడి చేశారు. కనీసం ఒక్క నిమిషం కూడా అక్కడి బాధితులతో మాట్లాడకుండా.. తమకు న్యాయం చేయాలని అడిగిన వారిని వేలు చూపి బెదిరిస్తూ వెళ్లిపోయాడని 
ఊరి్మళకాలనీ ప్రజలు వాపోయారు. – సాక్షి బృందం, విజయవాడ


చెత్త సీఎం.. నికృష్ట పాలన
సాక్షి, అమరావతి: రాష్ట్రానికి చెత్త సీఎం దాపురించారని, నికృష్టమైన పాలన సాగిస్తున్నారని వైఎస్సార్‌సీపీ నేత, మాజీ మంత్రి మేరుగు నాగార్జున దుయ్యబట్టారు. ఆయన మంగళవారం తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయం వద్ద మీడియాతో మాట్లాడుతూ.. వరద బాధితులను ఆదుకోవడంలో చంద్రబాబు ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని అన్నారు. కూటమి ప్రభుత్వం చేతకానితనాన్ని వైఎస్సార్‌సీపీపై మోపే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. 

రాజకీయాల్లో పాబ్లో ఎస్కోబార్‌ అంటే చంద్రబాబేనని చెప్పారు. వైఎస్‌ జగన్‌ కృష్ణా నదికి రిటైనింగ్‌ వాల్‌ నిర్మించి ఎంతోమంది ప్రజల ప్రాణాలను కాపాడారని విజయవాడ ప్రజలే చెబుతున్నారని తెలిపారు. ఈ విషయాన్ని చంద్రబాబు జీరి్ణంచుకోలేక పోతున్నారన్నారు. వరద బాధితుల నుంచి విమర్శలు రావటంతో జగన్‌ భక్త అధికారులంటూ మాట్లాడుతున్నారన్నారు.
 
హెచ్చరికలను పట్టించుకోని సర్కార్‌: మాజీ ఎమ్మెల్యే కైలే 
భారీ వర్షాలు, వరదలపై ఐఎండీ ముందే హెచ్చరించినా ప్రభుత్వం పట్టించుకోకపోవడం వల్లే ఇంతటి విపత్తు వచ్చిందని వైఎస్సార్‌సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్‌కుమార్‌ చెప్పారు.  ఇంతటి విపత్తుకు చంద్రబాబే కారణమని చెప్పారు. బంగాళాఖాతంలో అల్పపీడనంపై గత నెల 28నే ఐఎండీ నుంచి ప్రభుత్వానికి హెచ్చరిక వచ్చిp0దని, 20 సెం.మీ వరకు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పిందన్నారు. భారీ వర్షాలకు పలు ప్రాంతాలు జలమయమవుతాయని సమాచారమిచ్చి0దని చెప్పారు. వరద ప్రాంతాల్లో ప్రభుత్వం సహాయ కార్యక్రమాలు చేపట్టడం లేదని విమర్శించారు.  

కదిలిన యువతరం
సాక్షి, అమరావతి: ప్రకృతి విపత్తులో ప్రభుత్వం సాయం అందక బాధితులు విలపిస్తుంటే.. మేమున్నాంటూ యువత ఆపన్న హస్తం అందిస్తోంది. వరద ముంపులో యూనిఫాం లేని సైనికులు మాదిరిగా యుద్ధ ప్రాతిపదికన సాయం చేస్తోంది. ఎన్‌డీఆర్‌ఎఫ్, ఎస్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలకు దీటుగా.. ప్రజా సైనికులుగా మారి పీకల్లోతు నీళ్లలో ట్యూబులపై తిరుగుతూ మిద్దెలపై కాలం వెళ్లదీస్తున్న బాధితుల ఆకలి తీరుస్తోంది. 

నైరుబొమ్మ సెంటర్‌కు చెందిన 50 మంది యువత విజయవాడలోని వరద ముంపులో చిక్కుకున్న భవానీపురం, సాయిరాం కాలనీ, వైఎస్సార్‌ కాలనీ తదితర ప్రాంతాల్లో బాధితులకు సహాయం అందించేందుకు నడుం బిగించింది. ప్రభుత్వం పట్టించుకోని కంసాలిపేటలో మూడు రోజులుగా స్వచ్ఛందంగా సేవలందిస్తూ మానవత్వాన్ని చాటుకుంటోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement