662 schools in AP selected for PM Schools for Rising India Scheme - Sakshi
Sakshi News home page

PM SHRI Schools: ఏపీలో పీఎంశ్రీ పాఠశాలలుగా 662 స్కూళ్లు.. కేంద్ర విద్యాశాఖ ఆమోదం 

Published Wed, Apr 19 2023 8:04 AM | Last Updated on Wed, Apr 19 2023 1:37 PM

662 Schools In Ap Selected For PM Schools For Rising India Scheme - Sakshi

సాక్షి, అమరావతి: ప్రధానమంత్రి స్కూల్స్‌ ఫర్‌ రైజింగ్‌ ఇండియా (పీఎంశ్రీ పాఠశాలల) పథకం అమలుకు రాష్ట్రంలోని 662 ప్రభుత్వ పాఠశాలలు ఎంపికయ్యాయి. ఆ స్కూళ్ల జాబితాకు కేంద్ర విద్యాశాఖ మంగళవారం ఆమోదముద్ర వేసింది. సమానత (ఈక్విటీ), అందుబాటు (యాక్సెస్‌), నాణ్యత (క్వాలిటీ), ఇన్‌క్లూజన్‌తో సహా అన్నిస్థాయిల్లో విద్యార్థులు సంపూర్ణమైన అభివృద్ధి సాధించేందుకు ఈ స్కూళ్లు తోడ్పాటునందించనున్నాయి.

ఈ పథకాన్ని కేంద్రప్రభుత్వం గత ఏడాది సెప్టెంబర్‌ 7న ఆమోదించింది. దేశవ్యాప్తంగా 14,500 స్కూళ్లను అభివృద్ధి చేసేందుకు కొన్ని మార్గదర్శకాలను నిర్దేశిస్తూ వాటి ప్రకారం దరఖాస్తు చేసుకోవాలని అన్ని రాష్ట్రాల పాఠశాలలకు అవకాశమిచ్చింది. కేంద్రప్రభుత్వం ఏర్పాటుచేసిన ఆన్‌లైన్‌ చాలెంజ్‌ పోర్టల్‌ ద్వారా స్కూళ్లు స్వయంగా వీటికి దరఖాస్తు చేసుకున్నాయి. ఈ దరఖాస్తులను మూడుదశల్లో పరిశీలించి తుది ఎంపికను ఖరారు చేశారు.

నిర్దేశిత బెంచ్‌మార్క్‌ ఆధారంగా పాఠశాలలను కేంద్రం గుర్తించింది. కేంద్ర విద్యాశాఖ నిబంధనల ప్రకారం అర్బన్‌ స్కూళ్లు 70 శాతానికిపైగా, గ్రామీణ ప్రాంత స్కూళ్లు 60 శాతానికిపైగా స్కోరు సాధించగలిగితేనే పీఎంశ్రీ పథకానికి అర్హమైనవిగా గుర్తించారు. పాఠశాలలను కేంద్ర విద్యాశాఖ బృందాలు భౌతికంగా కూడా సందర్శించి నిర్దేశిత ప్రమాణాలతో ఉన్నాయో లేదో పరిశీలించిన తరువాతే ఎంపిక చేశారు. మన రాష్ట్రం నుంచి అందిన దరఖాస్తుల్లో మొత్తం 662 స్కూళ్లను పీఎంశ్రీ పథకానికి ఎంపిక చేశారు. వీటిలో 33 ప్రాథమిక పాఠశాలలుండగా 629 సెకండరీ, సీనియర్‌ సెకండరీ స్కూళ్లు ఉన్నాయి.

విద్యార్థులకు గుణాత్మక విద్యే లక్ష్యం
ల్యాబ్‌లు వంటి ఆధునిక మౌలిక సదుపాయాలతో కూడిన పాఠశాలల్లో చేసే బోధనాభ్యసనాల ద్వారా విద్యార్థులకు గుణాత్మక విద్య అందించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ఐదేళ్లు అమలులో ఉండే పీఎంశ్రీ స్కూళ్ల పథకాన్ని ప్రారంభించింది. నూతన విద్యావిధానం సిద్ధాంతాలను అనుసరించి పాఠశాల విద్యను బలోపేతం చేయడం ఈ పథకం ప్రధానోద్దేశం. స్మార్ట్‌ క్లాస్‌ రూములు, లైబ్రరీలు, క్రీడా సదుపాయాలను ఈ స్కూళ్లలో ఏర్పాటుచేయనున్నారు.

పాత పాఠశాలలను ఆధునిక మౌలిక సదుపాయాలు, పరికరాలతో అప్‌గ్రేడ్‌ చేయడం ద్వారా మోడల్‌ పాఠశాలలుగా తీర్చిదిద్దాలన్నది కూడా ఈ పథకం మరో లక్ష్యం. దాదాపు 14,500 పాఠశాలలను ఈ రీతిలో అభివృద్ధి చేయనున్నారు. ఈ పాఠశాలలను దశలవారీగా స్మార్ట్‌ తరగతులతో తీర్చిదిద్దనున్నారు. ఈ పథకం కింద ప్రయోగశాలలు, స్మార్ట్‌ క్లాస్‌రూములు, గ్రంథాలయాలు, క్రీడా సదుపాయాలు, ఆర్ట్‌ రూములు కల్పిస్తారు.
చదవండి: ఏపీ వాసులకు అలర్ట్‌: ఆ ప్రాంతాల్లో తీవ్ర వడగాడ్పులు

వీటిద్వారా నూతన విద్యావిధానంలో నిర్దేశించుకున్న ప్రమాణాలకు అనుగుణంగా పాఠశాల విద్యను బలోపేతం చేయనున్నారు. విద్యార్థులు గుణాత్మక విద్యతో నిర్దేశిత సామర్థ్యాలను పెంపొందించుకోగలుగుతారు. చదువులను భారంగా కాకుండా ఇష్టంగా కొనసాగిస్తారు. కేంద్రం నిధులు అందించే ఈ పాఠశాలలన్నీ నూతన విద్యావిధానాన్ని అనుసరించి కొనసాగుతాయి. మొత్తం నిధుల్లో  కేంద్ర ప్రభుత్వం 60 శాతం ఇస్తే మిగతా నిధులను రాష్ట్ర ప్రభుత్వాలు భరించాలని కేంద్ర విద్యాశాఖ పేర్కొంది. ఎంపికైన స్కూళ్ల జాబితాను కేంద్రం ఏర్పాటుచేసిన పోర్టల్‌లో ఉంచడంతోపాటు ఆయా రాష్ట్రాల విద్యాశాఖ కార్యాలయాలకు పంపింది.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement