సాక్షి, అమరావతి: రానున్న రోజుల్లో రాష్ట్రంలో మరింత విద్యుత్ అందుబాటులోకి వచ్చి వినియోగదారులకు పుష్కలంగా సరఫరా అవుతుందని, ఈ మేరకు కొత్త విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు ప్రారంభం కానున్నాయని ఆంధ్రప్రదేశ్ పవర్ జనరేషన్ కార్పొరేషన్ (ఏపీజెన్‌కో) లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ కె.వి.ఎన్.చక్రధర్‌బాబు తెలిపారు. ఆయన శుక్రవారం ఏపీజెన్‌కో ఎండీగా విద్యుత్ భవన్‌లో బాధ్యతలు స్వీకరించారు. సంస్థ డైరెక్టర్లు, విద్యుత్ ఉద్యోగసంఘాల నాయకులు, పలువురు ఉద్యోగులు ఆయన్ని అభినందించారు. అనంతరం ఆయన అధికారులతో సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెరుగుతున్న ఇంధన డిమాండ్‌ను తీర్చడానికిగాను థర్మల్ విద్యుత్ ఉత్పత్తిని వేగవంతం చేయడానికి ప్లాంట్ల ఆధునికీకరణకు ప్రాధాన్యతనిస్తామని చెప్పారు. వ్యవసాయానికి పగటిపూట 9 గంటల విద్యుత్ సరఫరా చేయాలనే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యాన్ని నెరవేర్చడానికి సిబ్బంది కలిసి పనిచేయాలని కోరారు. రానున్న నెలల్లో ఇంధన డిమాండ్ రోజుకి 250 మిలియన్ యూనిట్లను దాటుతుందని అంచనా వేస్తున్నట్లు చెప్పారు. దాన్ని అందుకోవడానికి ప్రణాళిక రూపొందించాలని సూచించారు. ఇంధన డిమాండ్ పెరగడం చాలా మంచి సంకేతమని, ఇది రాష్ట్ర ఆర్థిక కార్యకలాపాల పెరుగుదలను సూచిస్తుందని చెప్పారు.
విద్యుత్ ఉత్పత్తి, అత్యధిక ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్ నిర్వహణలో జాతీయస్థాయిలో అత్యుత్తమ సంస్థగా అవతరించేందుకు ఏపీజెన్‌కో అన్ని ప్రయత్నాలు చేస్తుందన్నారు. శ్రీదామోదరం సంజీవయ్య థర్మల్ పవర్ స్టేషన్ (ఎస్డీఎస్టీపీఎస్) స్టేజ్–2 (1,600 మెగావాట్లు) ప్రస్తుతం పనిచేస్తోందని, వేసవి డిమాండ్‌ను తీర్చేందుకు ఇది దోహదపడుతుందని పేర్కొన్నారు. డాక్టర్ నార్ల తాతారావు థర్మల్ పవర్ స్టేషన్ (ఎన్‌టీటీపీఎస్)లో మరో 800 మెగావాట్ల యూనిట్ ఈ ఏడాదిలోనే ప్రారంభమవుతుందని వెల్లడించారు.
ప్రస్తుతం గ్రిడ్ డిమాండ్‌లో 40 నుంచి 45 శాతం వరకు ఏపీజెన్‌కో ద్వారానే అందుతోందన్నారు. పోలవరం వద్ద ఒక్కొక్కటి 80 మెగావాట్ల సామర్థ్యమున్న 12 హైడ్రో ఎలక్ట్రిక్ యూనిట్లను (మొత్తం 960 మెగావాట్లు) కూడా జెన్‌కో ఏర్పాటు చేస్తోందని చెప్పారు. దశల వారీగా ప్రాజెక్టుతో పాటు ఇవి కూడా అందుబాటులోకి వస్తాయన్నారు. గ్రీన్ ఎనర్జీలో భాగంగా దిగువ సీలేరు వద్ద 115 మెగావాట్ల రెండు అదనపు యూనిట్ల నుంచి వచ్చే ఏడాది జూలైలో ఉత్పత్తి మొదలుపెట్టాలని ప్రయత్నిస్తున్నట్లు ఆయన తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment