సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ‘ఆడుదాం ఆంధ్రా’ క్రీడాపోటీలు కీలక ఘట్టంలోకి ప్రవేశించాయి. గ్రామ/వార్డు సచివాలయం, మండలస్థాయి పోటీలను దిగ్విజయంగా ముగించుకుని నియోజకవర్గ స్థాయిలో సత్తా చాటేందుకు జట్లు ఉరకలేస్తున్నాయి. బుధవారం నుంచి 175 నియోజకవర్గ కేంద్రాల్లో పూర్తిస్థాయి ప్రొఫెషనల్ రీతిలో పోటీలు నిర్వహించేందుకు ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ (శాప్) ఏర్పాట్లు చేసింది. క్రిక్‌క్లబ్ యాప్, ‘ఆడుదాం ఆంధ్రా’ వెబ్‌సైట్ ద్వారా యూట్యూబ్ చానల్‌లో ప్రత్యక్ష వీక్షణం, ప్రత్యక్ష స్కోరును తిలకించేలా సాంకేతిక వ్యవస్థను అందుబాటులోకి తెచ్చింది.
క్రీడాకారుల్లో ఉత్సాహాన్ని నింపేందుకు కామెంట్రీలను నిర్వహించనుంది. గ్రామీణ ప్రాంతాల్లో క్రీడా ప్రతిభను వెలిసితీసే ఉద్దేశంతో ప్రభుత్వం 15 ఏళ్లకు పైబడిన మహిళలు, పురుషులకు 5 క్రీడాంశాల్లో మెగా టోరీ్నకి శ్రీకారం చుట్టింది. కబడ్డీ, ఖోఖో, క్రికెట్, వాలీబాల్, బ్యాడ్మింటన్ (డబుల్స్)లో నియోజకవర్గ స్థాయి నుంచి నగదు బహుమతులను ప్రకటించింది.
పోటీలను పక్కా ప్రొఫెషనల్ విధానంలో ఆయా క్రీడా ఫెడరేషన్ల నిబంధనల ప్రకారం నిర్వహించనుంది. టీ10 విధానంలో పూర్తిస్థాయి మ్యాచ్ బాల్‌తో క్రికెట్ పోటీలు, వాలీబాల్‌లో (25–25–15), బ్యాడ్మింటన్‌లో (21–21–21) బెస్ట్ ఆఫ్ త్రీ పాయింట్ల విధానాన్ని అమలు చేయనుంది. ఖోఖోలో 2 ఇన్నింగ్స్‌కు 9 నిమిషాలు, కబడ్డీ పురుషుల సెషన్‌కు 20 నిమిషాలు, మహిళలకు 15 నిమిషాలు చొప్పున సమయాన్ని కేటాయించింది.
భోజన, వసతి సౌకర్యాలతో..
మండలస్థాయి పోటీల్లో విజేతలకు ప్రొఫెషనల్ స్పోర్ట్స్ కిట్లను పంపిణీ చేసింది. వీరిని నియోజకవర్గ స్థాయి పోటీలకు పంపేందుకు అవసరమైన చోట రవాణా, భోజన, వసతులను పర్యవేక్షిస్తోంది. ఈ నెలాఖరులోగా షెడ్యూల్ ప్రకారం పోటీలను పూర్తిచేసే లక్ష్యంతో సిబ్బందిని సమాయత్తం చేస్తోంది. 27 నుంచి పూర్తిస్థాయిలో క్రికెట్ పోటీలు ఊపందుకునేలా కార్యాచరణ రూపొందించింది. మండలాలు, మునిసిపాలిటీలు కలిపి 753 యూనిట్ల నుంచి 75,000 మందికిపైగా క్రీడాకారులు నియోజకవర్గ పోటీల్లో సత్తా చాటేందుకు సిద్ధమవుతున్నారు.
ప్రతిభ వేట ప్రారంభం..
నియోజకవర్గ స్థాయి నుంచే ప్రతిభ ఉన్న క్రీడాకారులను గుర్తించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ఐపీఎల్ ఫ్రాంచైజీలు చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్, ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్(ఏసీఏ)లకు చెందిన ప్రతినిధులు నియోజకవర్గాల్లోని పోటీలను పరిశీలించి ‘టాలెంట్ హంట్’ చేపట్టనున్నారు. ప్రో కబడ్డీ సంస్థ, ప్రైమ్ వాలీబాల్, ఏపీ ఖోఖో క్రీడా సంఘం, బ్యాడ్మింటన్ సంఘ ప్రతినిధులు, అంతర్జాతీయ క్రీడాకారుల బృందాలు యువతలోని ప్రతిభను గుర్తించి నివేదిక రూపొందించనున్నాయి.
అసలు ఆట ఇప్పుడే మొదలైంది
ఆంధ్రాను స్పోర్ట్స్ హబ్‌గా తీర్చిదిద్దడంలో భాగంగా ఆడుదాం ఆంధ్రా నిర్వహిస్తున్నాం. ఇది ఏటా కొనసాగిస్తాం. ప్రతిభ ఎక్కడ ఉన్నా వెతికిపట్టుకుని ప్రపంచ వేదికలపై నిలబెట్టడమే సీఎం జగన్ లక్ష్యం. ఇకపై అన్నీ కీలక ఘట్టాలే. ఇప్పుడే అసలు ఆట మొదలైంది. క్రీడాకారులు ప్రతి దశలోనూ అద్భుత ప్రతిభ కనబర్చాలి. – ఆర్కే రోజా, క్రీడా శాఖ మంత్రి
ప్రొఫెషనల్ స్పోర్ట్స్ కిట్లు అందజేశాం
నియోజకవర్గ స్థాయి పోటీలకు సర్వం సిద్ధమైంది. ఎప్పటికప్పుడు జేసీలు, శాప్ అధికారులు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. క్రీడాకారులకు భోజన వసతి సౌకర్యాలపై క్షేత్ర స్థాయిలో సిబ్బంది తగిన ఆదేశాలిచ్చాం. మండలస్థాయి విజేతలకు ప్రొఫెషనల్ స్పోర్ట్స్ కిట్లు అందించాం. పూర్తిగా ప్రొఫెషనల్స్ తరహాలో టోర్నీ జరగనుంది. – ధ్యాన్‌చంద్ర, శాప్ ఎండీ
Comments
Please login to add a commentAdd a comment