ఎయిర్ బాయిలర్ పేలుడు సంభవించిన ప్రదేశం
తాడిపత్రి రూరల్: అనంతపురం జిల్లా తాడిపత్రి మండలం భోగసముద్రం వద్ద ఉన్న సుగ్న స్పాంజ్ అండ్ పవర్ పరిశ్రమలో బుధవారం తెల్లవారుజామున పెద్ద శబ్దంతో ఎయిర్ బాయిలర్ పేలిపోయింది. ఇద్దరు కార్మికులకు గాయాలయినట్లు అధికారులు తెలిపారు. వివరాల్లోకి వెళితే.. ముడి ఐరన్ తయారీలో భాగంగా పలు రకాల ముడి ఖనిజాలను ఎయిర్ బాయిలర్‌లో వేసి, కొన్ని రసాయనాలను కలుపుతారు. ఐరన్ ముద్దలు తయారై బయటకు వస్తాయి.
ఈ ప్రక్రియలో భాగంగా ఎయిర్ బాయిలర్‌లో ఎక్కువ మోతాదులో ఖనిజాలను వేయడంతో ఒత్తిడి ఎక్కువై అది పేలిపోయినట్లు తెలుస్తోంది. ప్రమాద సమయంలో బాయిలర్‌కు కొద్దిదూరంలో నలుగురు కార్మికులు విధుల్లో ఉన్నారు. పేలుడు ధాటికి అంకు, అభినవ్ అనే కార్మికులు స్వల్పంగా గాయపడగా తాడిపత్రి ప్రభుత్వాస్పత్రిలో చికిత్స చేయించామని ఇన్‌చార్జ్ తహసీల్దార్ రాజారాం తెలిపారు.
ప్రస్తుతం వారి పరిస్థితి నిలకడగా ఉన్నట్లు చెప్పారు. కాగా, సుగ్న స్పాంజ్ అండ్ పవర్ పరిశ్రమలో భారీ ప్రమాదం చోటుచేసుకున్నట్లు తెలియడంతో మీడియా ప్రతినిధులు పెద్దసంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. అయితే వారిని లోపలికి వెళ్లకుండా ఫ్యాక్టరీ సిబ్బంది అడ్డుకున్నారు. జనరల్ మేనేజర్ మహబూబ్ అలీకి ఫోన్ చేయగా.. ఆయన లిఫ్ట్ చేయలేదు. కాగా..ఈ ఘటనపై పోలీసులకు ఎలాంటి ఫిర్యాదూ అందలేదు.
Comments
Please login to add a commentAdd a comment