
సాక్షి, విశాఖపట్నం: రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మంచి పనులు చేస్తున్నారని సినీ నటుడు ఆర్.నారాయణ మూర్తి అన్నారు. తనకు రాజకీయ పార్టీలతో ప్రమేయం లేదని, ప్రజల కోసం పని చేసే ముఖ్యమంత్రికి పూర్తి మద్దతు ప్రకటిస్తున్నానని తెలిపారు. ఆయన ఆదివారం విశాఖలో మీడియాతో మాట్లాడుతూ.. దేశంలోని ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్న వ్యక్తి సీఎం జగన్ అని కొనియాడారు. సీఎం జగన్ హయాంలో ఉత్తరాంధ్ర మరింత అభివృద్ధి చెందుతుందని తెలిపారు. ఇప్పటి వరకు విశాఖపట్నం, తూర్పుగోదావరి సరిహద్దులోని మెట్ట ప్రాంతాల్లో ఒక పంట పండటమే కష్టంగా ఉండేదన్నారు.
ఏలేరు, తాండవ రిజర్వాయర్లు ఉన్నా పరిస్థితిలో ఎటువంటి మార్పు రాలేదని గుర్తుచేశారు. కానీ, ఈ సమస్యలను గుర్తించిన ముఖ్యమంత్రి ఏలేరు నీటిని తాండవకు అనుసంధానం చేసి భవిష్యత్తులో సాగు నీటికి ఇబ్బంది లేకుండా చేశారని పేర్నొన్నారు. ప్రజల సమస్యలను గుర్తించి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టే సీఎం జగన్‌కు ఎల్లప్పుడూ తన సంపూర్ణ మద్దతు ఉంటుందని వ్యాఖ్యానించారు.