కార్పొరేట్‌ కొలువు.. మనశ్శాంతి కరువు | Aditya Birla Education Trust Survey on Corporate Employees | Sakshi
Sakshi News home page

కార్పొరేట్‌ కొలువు.. మనశ్శాంతి కరువు

Published Mon, May 15 2023 4:55 AM | Last Updated on Mon, May 15 2023 4:55 AM

Aditya Birla Education Trust Survey on Corporate Employees - Sakshi

సాక్షి, అమరావతి: ‘ఐదంకెల జీతం.. ఆఫీస్‌ కారు.. దేశ, విదేశాల్లో క్యాంప్‌లు.. నీకేంట్రా లైఫ్‌ మొత్తం దిల్‌కుష్‌గా ఎంజాయ్‌ చేస్తున్నావ్‌’ అని స్నేహి తులెవరైనా అంటే.. ‘చూసేవాళ్లకు బాగానే కనిపి స్తుంది. జీవితంలో బొత్తిగా మానసిక ప్రశాంతత లేకుండా పోతోంది.

రోజు రోజుకూ యాజమాన్యం నుంచి ఒత్తిళ్లు పెరిగిపోతున్నాయి. రాత్రిళ్లు కంటినిండా నిద్ర ఉండటం లేదు. ముద్ద మింగుడు పడటం లేదు’ అని నిట్టూరుస్తున్నారు కార్పొరేట్‌ ఉద్యోగులు. దేశంలో కార్పొరేట్‌ కంపెనీల్లో పనిచేసే సగం మంది ఉద్యోగులు తమ మానసిక ఆరోగ్యం క్షీణిస్తోందని ఆందోళన చెందుతున్నారు. 

సైలెంట్‌ స్ట్రగుల్‌ సర్వే ఏం తేల్చిందంటే..
కార్పొరేట్‌ ఉద్యోగుల మానసిక పరిస్థితులపై ‘ది సైలెంట్‌ స్ట్రగుల్‌’ పేరిట ఆదిత్య బిర్లా ఎడ్యుకేషన్‌ ట్రస్ట్‌ ఎంపవర్‌ చేపట్టిన సర్వేలో ఉద్యోగులు మానసిక ఆరోగ్యం క్షీణిస్తోందని రూఢీ అయ్యింది. కార్పొరేట్‌ ఉద్యోగుల మానసిక ఆరోగ్యాన్ని అంచనా చేయడంతోపాటు మెరుగైన మానసిక ఆరోగ్య కార్యక్రమాల నిర్వహణకు అవసరమైన అంతరాలను గుర్తించడం కోసం ఈ అధ్యయనం చేశారు.

ఇందులో భాగంగా దేశంలోని ముంబై, కోల్‌కతా, ఢిల్లీ, చెన్నై, హైదరాబాద్, బెంగళూరు, అహ్మదాబాద్, పూణె నగరాల్లో 3,000 మంది ఉద్యోగులపై అధ్యయనం చేశారు. అధ్యయనానికి ఎంపిక చేసిన వారిలో 1,627 మంది పురుషులు, 1,373 మంది మహిళలు ఉన్నారు. వీరిలో 2,640 మంది 30–45 ఏళ్లు, 291 మంది 46–60 ఏళ్లు, 69 మంది 60 ఏళ్లు పైబడిన వారున్నారు.

రిస్క్‌లో 48 శాతం మంది ఉద్యోగులు
అధ్యయనంలో భాగంగా 48 శాతం మంది ఉద్యోగుల మానసిక ఆరోగ్యం రిస్క్‌లో ఉన్నట్టు తేలింది. సమూహాల వారీగా మెంటల్‌ హెల్త్‌ రిస్క్‌ ప్రొఫైల్‌ను పరిశీలించగా.. 56 శాతం మంది మహిళలు, 41 శాతం మంది పురుషులు రిస్క్‌లో ఉన్నారు. అత్యధికంగా 60 ఏళ్లు పైబడిన వారిలో అత్యధికంగా 71 శాతం మంది రిస్క్‌లో ఉండగా.. 46–60 ఏళ్ల వారిలో 48 శాతం, 30–45 ఏళ్ల వారిలో 47 శాతం మంది రిస్క్‌ను ఎదుర్కొంటున్నారు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement