వ్యక్తిగత హత్యలకు రాజకీయ రంగు
ఎన్నికల వేళ మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి రాద్ధాంతం
నల్లమాడ మండలంలో అమర్‌నాథ్‌రెడ్డి అనే వ్యక్తి హత్య
టీడీపీలో ఏనాడూ కనిపించకపోయినా కార్యకర్తగా ప్రచారం
చంద్రబాబు సహా టీడీపీ పెద్దలంతా ఓవరాక్షన్
సాక్షి, పుట్టపర్తి: వైఎస్సార్‌సీపీని నేరుగా ఎదుర్కొనే సత్తా లేక టీడీపీ నేతలు శవాలను అడ్డం పెట్టుకుని రాజకీయం చేస్తున్నారు. వ్యక్తిగత కక్షలతో హత్యలు జరిగినా రాజకీయ రంగు పులుముతున్నారు. టీడీపీలో ఏనాడూ తిరగని వ్యక్తిని కూడా తమ కార్యకర్తగా చెప్పుకుంటూ శవ రాజకీయాలకు తెరతీశారు. వివరాల్లోకి వెళితే.. శ్రీసత్యసాయి జిల్లా పుట్టపర్తి నియోజకవర్గ పరిధిలోని నల్లమాడ మండలం కుటాలపల్లిలో అమరనాథ్‌రెడ్డి అనే వ్యక్తి సోమవారం వేకువజామున హత్యకు గురయ్యాడు.
గుర్తు తెలియని వ్యక్తులు మారణాయుధాలతో దాడిచేసి అతడిని చంపారు. ఎస్పీ ఎస్‌వీ మాధవరెడ్డి ఆదేశాల మేరకు హత్య కేసును ఛేదించేందుకు ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. ఎవరిపైనా అనుమానం లేదని అమర్‌నాథ్‌రెడ్డి భార్య సుధమ్మ చెబుతోంది. ఎవరితోనూ భూ సమస్యలు, ఆర్థిక లావాదేవీల్లో విభేదాలు లేవని, ఎందుకు చంపారో పోలీసులే తేల్చి చర్యలు తీసుకోవాలని ఆమె ఫిర్యాదులో పేర్కొంది. ఆదివారం రాత్రి పొలానికి వెళ్లిన తన భర్త ఉదయం ఇంటికి రాలేదని, ఆరా తీయగా హత్యకు గురైనట్టు తేలిందని ఆమె చెప్పారు.
‘పల్లె’ రాద్ధాంతం
హతుడు అమరనాథ్‌రెడ్డి ఏనాడూ టీడీపీ కార్యక్రమాల్లో కనిపించలేదు. అయినప్పటికీ ఈ హత్యకు రాజకీయ రంగు పులిమి లబ్ధి పొందాలని టీడీపీ నేత, మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి ప్రయత్నించారు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పాటు టీడీపీ అధిష్టానానికి సమాచారం ఇచ్చారు. పల్లె చెప్పిన వెంటనే నిజానిజాలు కూడా తెలుసుకోకుండా చంద్రబాబు, లోకేశ్, అచ్చెన్నాయుడు సామాజిక మాధ్యమాల వేదికగా రాజకీయ హత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. ఇందులో ఎలాంటి రాజకీయమూ లేదని పోలీసులు చెబుతున్నా.. వినకుండా అవాస్తవాలను ప్రజల్లోకి తీసుకెళ్లారు.
డీఎస్పీ ఏమంటున్నారంటే..
అమరనాథ్‌రెడ్డి కేవలం వ్యక్తిగత కారణాలతోనే హత్యకు గురైనట్టు ప్రాథమిక విచారణలో తేలిందని పుట్టపర్తి డీఎస్పీ వాసుదేవన్ తెలిపారు. గుర్తు తెలియని వ్యక్తులు ఈ హత్య చేసినట్టు తెలుస్తోందన్నారు. నిందితుల కోసం గాలిస్తున్నామని చెప్పారు. హత్య కేసును వీలైనంత త్వరగా ఛేదిస్తామన్నారు. హత్య వెనుక ఎవరు ఉన్నా.. చట్టం ముందు నిలబెడతామని తెలిపారు. అమరనాథ్‌రెడ్డి హత్య వెనుక ఎలాంటి రాజకీయ కోణమూ లేదని ఆయన స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment