వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తులో కొన్ని కీలక అంశాలు విస్మరిస్తున్నారని చాలా రోజులుగా ఆరోపణలున్నాయి. దీనికి సంబంధించి ఓ కేసు కూడా నమోదయింది. గత ఏడాది ఫిబ్రవరి 21న పులివెందుల న్యాయస్థానంలో దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి భార్య తులసమ్మ పిటిషన్ దాఖలు చేశారు. దానిపై స్పందించిన న్యాయస్థానం ఆమె వాంగ్మూలాన్ని కూడా నమోదు చేసింది. ఇన్నాళ్లూ సీబీఐ కప్పిపుచ్చేందుకు యత్నించిన కొన్ని కీలక వాస్తవాలు న్యాయస్థానంతో పాటు ప్రజల దృష్టికి వచ్చాయి. ఆ వివరాలు, సమాధానాలు లేని ప్రశ్నలు ఓ సారి చూద్దాం.
1. లేఖ విషయం ఎందుకు దాచి పెట్టారు?
మార్చి 15, 2019న వివేకానందరెడ్డి హత్యకేసు వెలుగులోకి వచ్చింది. వివేకానందరెడ్డి చనిపోయిన విషయాన్ని పీఏ కృష్ణారెడ్డి మొదట ఆయన కుటుంబ సభ్యులకే తెలిపారు. రక్తపు మడుగులో పడి ఉన్న మృతదేహం, ఆ ప్రదేశాన్ని వివేకా అనుచరుడు ఇనయతుల్లా తన సెల్‌ఫోన్ ద్వారా ఫొటోలు, వీడియోలు తీసి నర్రెడ్డి రాజశేఖరరెడ్డి, నర్రెడ్డి శివప్రకాశ్‌రెడ్డిలకు వాట్సాప్ చేశారు. వాటిని చూసిన తర్వాత కూడా శివప్రకాశ్‌రెడ్డి.. అప్పటి టీడీపీ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న ఆదినారాయణరెడ్డి తనకు ఫోన్ చేస్తే వివేకా గుండెపోటుతో చనిపోయారని చెప్పారు.
అదే విషయాన్ని ఆదినారాయణరెడ్డి మీడియాకు వెల్లడించారు కూడా. ఇక్కడ అత్యంత కీలకమైన అంశం వివేకా స్వదస్తూరితో రాసిన లేఖ, ఆయన వాడుతున్న సెల్‌ఫోన్. వీటి విషయంలో సొంత కుటుంబ సభ్యులు పాటించిన గోప్యత అనుమానస్పదంగా ఉంది. వివేకా రాసినట్లు చెబుతున్న లేఖ, సెల్‌ఫోన్‌ను తాము వచ్చే వరకు పోలీసులకు అప్పగించవద్దని పీఏ కృష్ణారెడ్డికి రాజశేఖరరెడ్డి ఆదేశించారు.
వారు పులివెందుల చేరుకున్న తర్వాత సెల్‌ఫోన్లోని మెసేజ్‌లు, ఇతర వివరాలను డిలీట్ చేసిన తర్వాతే వాటిని పోలీసులకు అప్పగించారని అనుకుంటున్నారు. ఇదే విషయాన్ని దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి భార్య తులసమ్మ కూడా కోర్టుకు ఇచ్చిన వాంగ్మూలంలో తెలిపారు. వివేకానందరెడ్డి రాజకీయ వారసత్వం ఆశిస్తున్న అల్లుడు నర్రెడ్డి రాజశేఖరరెడ్డి, బావమరిది శివ ప్రకాశ్‌రెడ్డి ఆయనపై కక్ష పెంచుకుని హత్యకు కుట్రపన్ని ఉండొచ్చు. వివేకా హత్య అనంతరం ఆయన కుటుంబ సభ్యుల పాత్ర సందేహాస్పదంగా ఉందని ఆమె కోర్టుకు ఇచ్చిన వాంగ్మూలంలో పేర్కొన్నారు.
2. హత్యకు, వివేకానందరెడ్డి రెండో పెళ్లి, కుటుంబానికి ఉన్న లింకేంటీ?
షమీమ్ అనే మహిళను కొన్నాళ్ల కింద వైఎస్ వివేకానందరెడ్డి రెండో వివాహం చేసుకున్నారు. ఇది కుటుంబ సభ్యులకు ఏ మాత్రం నచ్చలేదు. ముఖ్యంగా ఈ పెళ్లి కారణంగా వివేకానందరెడ్డికి, ఆయన కుమార్తె, అల్లుడు, పెద్దబావమరిదితో బాగా అంతరం పెరిగినట్టు పులివెందులలో చెబుతారు. ఇదే విషయాన్ని కోర్టుకు ఇచ్చిన వాంగ్మూలంలో శివశంకర్‌రెడ్డి భార్య తులసమ్మ పేర్కొన్నారు.
‘వైఎస్ వివేకానందరెడ్డి షమీమ్ అనే మహిళను రెండో వివాహం చేసుకోవడంతో ఆయన కుటుంబంలో తలెత్తిన విభేదాలే ఈ హత్యకు దారి తీశాయి. బెంగళూరులో భూ సెటిల్‌మెంట్ ద్వారా వచ్చే రూ.4 కోట్లను తన రెండో భార్య షమీమ్‌కు ఇస్తాననడంతోపాటు ఆమె ద్వారా తనకు కలిగిన కుమారుడిని తన వారసుడిగా ప్రకటిస్తానని వివేకానందరెడ్డి చెప్పారు. ఇది మొదటి భార్య, కుటుంబానికి నచ్చలేదు.‘ రెండు కుటుంబాల మధ్య తలెత్తిన ఆస్తి, రాజకీయ వారసత్వ విభేదాలే ఈ హత్యకు కారణమని ఈ కేసులో అరెస్టయిన దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి భార్య తులసమ్మ పులివెందుల మెజిస్ట్రేట్ కోర్టులో వాంగ్మూలం ఇచ్చారు.
3. వివేకాకు ఉన్న వివాదాలేంటీ?
వివేకానందరెడ్డికి ఆయన అనుచరుడిగా ఉన్న కొమ్మా పరమేశ్వరరెడ్డికి మధ్య ఆర్థిక విభేదాలు తలెత్తాయి. దాంతో కక్ష పెంచుకున్న పరమేశ్వరరెడ్డి... వివేకా రాజకీయ ప్రత్యర్థి బీటెక్ రవికి సన్నిహితుడిగా మారారు. ఈ విషయాన్ని దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి భార్య తులసమ్మ కూడా కోర్టుకు ఇచ్చిన వాంగ్మూలంలో తెలిపారు. ‘ వివేకా హత్యకు ముందు ఎలిబీ సృష్టించుకునేందుకు పరమేశ్వరరెడ్డి 2019 మార్చి 13న అనారోగ్యం నెపంతో కడపలోని సన్‌రైజ్ ఆస్పత్రి ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లో చేరారు. కానీ ఎవరికీ తెలియకుండా 2019 మార్చి 14 సాయంత్రం టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవితో హరిత హోటల్‌లో రెండుసార్లు సమావేశమయ్యాడు.
ఈ భేటీలో పాల్గొన్న శ్రీనివాసరెడ్డి అనే వ్యక్తి తర్వాత కొద్ది రోజులకే అనుమానాస్పద రీతిలో మృతి చెందడం గమనార్హం. సిట్ దర్యాప్తులో నార్కో పరీక్షకు అతను తిరస్కరించడం సందేహాలకు తావిస్తోందని‘ తులసమ్మ కోర్టుకు విన్నవించారు. అలాగే వైఎస్సార్ కడప జిల్లాకే చెందిన వైజీ రాజేశ్వరరెడ్డి అనంతపురం జిల్లా తాడిపత్రిలో స్థిరపడ్డాడు. ఆయన రాజకీయ ప్రత్యర్థి నారాయణరెడ్డిని వైఎస్సార్‌సీపీలోకి తీసుకురావాలని వివేకా భావించడంతో కక్ష పెంచుకున్నాడని, వైఎస్ వివేకాపై అప్పటికే కక్షగట్టిన నర్రెడ్డి రాజశేఖరరెడ్డి, శివప్రకాశ్‌రెడ్డి హైదరాబాద్‌లో వైజీ రాజేశ్వరరెడ్డితో పలుమార్లు భేటీ అయ్యారని కూడా తులసమ్మ తెలిపారు.
2019 మార్చి 14న పులివెందులకు చెందిన నీరుగుట్టు ప్రసాద్ ఉద్దేశ పూర్వకంగానే వివేకా ఇంటికి ఉత్తరం వైపు తలుపు గడియ పెట్టకుండా వెళ్లిపోయారని, హంతకులు ఆ రోజు వివేకా ఇంటిలోకి ప్రవేశించి హత్య చేసేందుకు వీలుగా ఈ పని జరిగిందని ఆరోపించారు.
సీబీఐ ఈ కేసు విషయంలో అనుసరిస్తున్న తీరుపట్ల అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. హత్యలో స్వయంగా పాల్గొన్న దస్తగిరిని అప్రూవర్‌గా మార్చడంతోపాటు అతని ముందస్తు బెయిల్‌ను వ్యతిరేకించక పోవడం సీబీఐ దురుద్దేశాలను వెల్లడిస్తోంది. ఈ హత్యలో అసలు కుట్రదారులుగా భావిస్తున్న నర్రెడ్డి రాజశేఖరరెడ్డి, శివప్రకాశ్‌రెడ్డి, కొమ్మా పరమేశ్వరరెడ్డి, బీటెక్ రవి, వైజీ రాజేశ్వరరెడ్డి, నీరుగుట్టు ప్రసాద్‌లను సీబీఐ విచారించనే లేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
చదవండి: వివేకా హత్య కేసులో తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు
Comments
Please login to add a commentAdd a comment