డోనాల్డ్ హెప్లిన్‌తో మాట్లాడుతున్న బెండపూడి హైస్కూల్ విద్యార్థులు
తొండంగి: కాకినాడ జిల్లా బెండపూడి జెడ్పీ హైస్కూల్ విద్యార్థులు ఆంగ్ల భాషలో కనబరుస్తున్న ప్రతిభను గుర్తించిన అమెరికన్ కాన్సులేట్ జనరల్ డోనాల్డ్ హెప్లిన్ వారితో శుక్రవారం వెబ్ ఎక్స్ కాన్ఫరెన్స్ ద్వారా ముచ్చటించారు. అమెరికా యాసలో విద్యార్థులు ఇంగ్లిష్ మాట్లాడడంపై ఆయన అభినందనలు తెలిపారు. బెండపూడి జెడ్పీ హైస్కూల్ విద్యార్థులు అమెరికా యాసలో ఇంగ్లిష్‌ను అనర్గళంగా మాట్లాడడంతో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రత్యేకంగా విద్యార్థులను పిలిపించుకుని ముచ్చటించారు.
ఇది కాస్తా జాతీయ మీడియాలో ప్రసారం కావడంతో అమెరికన్ కాన్సులేట్ అధికారుల దృష్టికి వెళ్లింది. దీంతో బెండపూడి జెడ్పీ హైస్కూల్ విద్యార్థులతో మాట్లాడేందుకు ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి కార్యాలయాన్ని అమెరికన్ కాన్సులేట్ అధికారులు కోరారు. ఈ మేరకు విద్యాశాఖ ఆధ్వర్యంలో వెబ్ ఎక్స్ ద్వారా విద్యార్థులతో యూఎస్ కాన్సులేట్ జనరల్ డోనాల్డ్ హెప్లిన్ మాట్లాడేందుకు బెండపూడి హైస్కూల్‌లో ఏర్పాట్లు చేశారు.
డోనాల్డ్ హెప్లిన్‌తో విద్యార్థులు మేఘన, రీష్మ, తేజస్విని, వెంకన్నబాబు మాట్లాడారు. సుమారు 20 నిమిషాలు విద్యార్థులు, ఉపాధ్యాయులతో ఆయన ముచ్చటించారు. ఎంత మందికి అమెరికాలో చదువుకోవాలని ఆసక్తి ఉందని ప్రశ్నించారు. విద్యార్థులంతా అమెరికాలో చదువుకునేందుకు ఆసక్తిగా ఉన్నామని బదులిచ్చారు. ఆంధ్రప్రదేశ్, అమెరికా సత్సంబంధాల అభివృద్ధికి ఆంగ్లభాష వారధిగా నిలుస్తుందని హెప్లిన్ పేర్కొన్నారు. విద్యార్థులను తీర్చిదిద్దిన ఉపాధ్యాయుడు ప్రసాద్‌ను కూడా హెప్లిన్ ప్రత్యేకంగా అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment