![Andhra Pradesh Government Moved To Supreme Court For 3 Capitals Issue - Sakshi](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2022/09/17/P-GOVT.jpg.webp?itok=DhmkKBu1)
ఢిల్లీ: మూడు రాజధానుల అంశంపై సుప్రీంకోర్టును ఆశ్రయించింది ఏపీ ప్రభుత్వం. రాజధానిగా అమరావతి ఉండాలంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే ఇవ్వాలంటూ ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. అమరావతే రాజధానిగా ఉండాలని హైకోర్టు తన తీర్పులో పేర్కొనడం శాసనవ్యవస్థ అధికారాలను ఉల్లంఘించడమేనని తన పిటిషన్‌లో పేర్కొంది ఏపీ ప్రభుత్వం. అలాగే, అభివృద్ధి వికేంద్రీకరణ కోసమే 3 రాజధానులని ప్రభుత్వం పిటిషన్‌లో స్పష్టం చేసింది.
రాష్ట్ర ప్రభుత్వం చట్టాన్ని ఉపసంహరించుకున్న తర్వాత.. మళ్లీ ఆ చట్టంపై ఆలోచన చేస్తామని చెప్పిన తర్వాత.. వచ్చే చట్టం ఎలా ఉంటుందో తెలియకుండానే తీర్పు ఇవ్వడం సరైనదేనా అంటూ ప్రభుత్వం పిటిషన్‌లో ప్రశ్నించింది. ఏపీ రాజధాని నిర్ణయం ఒక కమిటీ సూచనకు అనుగుణంగా ఉంటుందన్నారు. అయితే, కమిటీ సూచనకు సంబంధం లేకుండా రాజధానిని నిర్ధారించారు. దానినే రాజధానిగా ఉంచాలని చెప్పే అధికారం హైకోర్టుకు ఉందా అని ప్రభుత్వం ప్రశ్నించింది.
కేంద్ర ప్రభుత్వానికి డెలిగేట్‌గా సర్వహక్కులతో అసెంబ్లీ చట్టం చేసింది. ఆ చట్టం కింద ఇచ్చిన నోటిఫికేషన్లను వెనక్కి తీసుకోవడానికి వీల్లేదు. ఒక చట్టం రాకుండానే ఆ చట్టం రూపురేఖలు ఎలా ఉంటాయో తెలియకుండానే ఆ చట్టం రాజ్యాంగ విరుద్ధం అని చెప్పడం ఎంత వరకు సబబు అంటూ ప్రభుత్వం ప్రశ్నించింది. ఇది అధికార విభజనకు విరుద్ధం కాదా? అని పిటిషన్‌లో పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment