Andhra Pradesh Govt Extend SC, ST Sub Plan For 10 Years - Sakshi
Sakshi News home page

AP: ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌.. మరో పదేళ్లు పొడిగింపు

Published Sun, Jan 22 2023 6:23 PM | Last Updated on Mon, Jan 23 2023 2:29 PM

Andhra Pradesh Govt Extend SC ST Sub Plan For 10 years - Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీల అభివృద్ధికి నిర్దేశించిన సబ్‌ప్లాన్‌ (ఉప ప్రణాళిక)ను ప్రభుత్వం మరో పదేళ్లు పొడిగించింది. ఈ మేరకు ఆదివారం ఆర్డినెన్స్‌ను జారీచేసింది. దళిత, గిరిజన సంక్షేమం, అభివృద్ధి కోసం పదేళ్ల కాలపరిమితితో ప్రకటించిన ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ చట్టం ఈ నెల 23తో ముగియనుంది. అత్యంత ప్రాధాన్యత కలిగిన ఈ సబ్‌ప్లాన్‌ను కొనసాగించేందుకు సీఎం వైఎస్‌ జగన్‌ నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంతో ఆయా వర్గాల నుంచి హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.  

ఆర్డినెన్స్‌ తేవడం గొప్ప విషయం 
ఈ సందర్భంగా పలువురు మంత్రులు, వివిధ ప్రజా సంఘాల నేతలు స్పందించారు. ఉపముఖ్యమంత్రి, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి పీడిక రాజన్నదొర, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగు నాగార్జున స్పందిస్తూ.. సబ్‌ప్లాన్‌ చట్టం 2013 జనవరి 23 నుంచి అమలులోకి వచి్చందని.. చట్ట ప్రకారం పదేళ్ల తర్వాత ఇప్పుడు రద్దయ్యే పరిస్థితి ఏర్పడిందన్నారు. దీనిపై సకాలంలో సీఎం వైఎస్‌ జగన్‌ స్పందించి.. గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ ఆమోదంతో ముందుగానే ఆర్డినెన్స్‌ తేవడం గొప్ప విషయమన్నారు. దీంతో రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీలపట్ల సీఎం తనకున్న ప్రేమను మరోసారి చూపించారని కొనియాడారు. సబ్‌ప్లాన్‌ మరో పదేళ్లు కొనసాగేలా నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. అలాగే, దేశంలో మెరుగ్గా సబ్‌ప్లాన్‌ అమలుచేస్తున్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్‌ అగ్రగామిగా నిలవడం వెనుక సీఎం జగన్‌ చిత్తశుద్ధే కారణమని వైఎస్సార్‌సీపీ పార్లమెంటరీ పార్టీ నేత వి. విజయసాయిరెడ్డి.. వైఎస్సార్‌సీపీ ఎస్సీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్యే కైలే అనిల్‌కుమార్‌ అన్నారు. సబ్‌ప్లాన్‌ను మరో పదేళ్లు పొడిగించడం హర్షణీయమంటూ ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపారు. 
 
సీపీఎం, కేవీపీఎస్, సెంటర్‌ ఫర్‌ దళిత స్టడీస్‌ హర్షం 

ఇక ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ను కొనసాగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్సు తేవడం పట్ల సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి. శ్రీనివాసరావు, కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం (కేవీపీఎస్‌) రాష్ట్ర అధ్యక్షుడు ఒ.నల్లప్ప, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అండ్ర మాల్యాద్రి, సెంటర్‌ ఫర్‌ దళిత స్టడీస్‌ (హైదరాబాద్‌) చైర్‌పర్సన్‌ మల్లేపల్లి లక్ష్మయ్య, దళిత బహుజన ఫ్రంట్‌ జాతీయ అధ్యక్షుడు కొరివి వినయ్‌కుమార్, ఏపీ ఎస్టీ కమిషన్‌ సభ్యుడు వడిత్యా శంకర్‌నాయక్‌ వేర్వేరు ప్రకటనల్లో హర్షం వ్యక్తంచేశారు. అలాగే, జాతీయ దళిత హక్కుల చైర్మన్‌ పెరికె ప్రసాదరావు, గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మేరాజోత్‌ హనుమంతు నాయక్, మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు నత్తా యోనారాజు కూడా ముఖ్యమంత్రి నిర్ణయంపట్ల సంతోషం వ్యక్తంచేశారు. సీఎం వైఎస్‌ జగన్‌కు రుణపడి ఉంటామన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement