సాక్షి, అమరావతి: ప్రముఖ సోషల్ మీడియా సంస్థ ట్విట్టర్‌పై ఏపీ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టు ఆదేశాలిచ్చిన తరువాత కూడా జడ్జిలపై ట్విట్టర్‌లో అనుచిత పోస్టులను తొలగించనందుకు మండిపడింది. భారతదేశం నుంచి కార్యకలాపాలు కొనసాగిస్తున్నప్పుడు ఆ దేశ చట్టాలను, న్యాయస్థానాల ఆదేశాలను గౌరవించరా అంటూ నిలదీసింది. అనుచిత పోస్టులను తొలగించకపోవడం కోర్టు ధిక్కారమే అవుతుందని స్పష్టం చేసింది. కోర్టు ధిక్కార చర్యలు ఎందుకు తీసుకోకూడదో చెప్పాలంటూ ట్విట్టర్‌ను ఆదేశించింది. న్యాయమూర్తులపై అనుచిత పోస్టుల వ్యవహారానికి సంబంధించి దర్యాప్తు పురోగతి ఏమిటో తెలియచేయాలని సీబీఐని ఆదేశించింది.
తదుపరి విచారణను ఫిబ్రవరి 7వ తేదీకి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్రా, న్యాయమూర్తి జస్టిస్ మల్లవోలు సత్యనారాయణమూర్తి ధర్మాసనం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. న్యాయవ్యవస్థను, న్యాయమూర్తులను దూషిస్తూ, కించపరుస్తూ పోస్టులు పెడుతున్నా పోలీసులు సరిగా స్పందించడం లేదంటూ హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ హైకోర్టులో గత ఏడాది పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యంపై ఇప్పటికే పలుమార్లు విచారణ జరిపిన సీజే ధర్మాసనం సోమవారం మరోసారి విచారించింది.
ఆ పోస్టులను ఇంకా తొలగించలేదు
సీబీఐ తరఫున అదనపు సొలిసిటర్ జనరల్ (ఏఎస్‌జీ) ఎస్వీ రాజు వాదనలు వినిపిస్తూ.. న్యాయమూర్తులపై అనుచిత పోస్టులను ట్విట్టర్ ఇంకా తొలగించలేదన్నారు. భారత జాతీయతతో లాగిన్ అయితే అనుచిత పోస్టులు కనిపించవని, జాతీయతను మారిస్తే ఆ పోస్టులు కనిపిస్తున్నాయని వివరించారు. ఇలా చేయడం కోర్టు ఆదేశాలను పూర్తిగా అమలు చేయకపోవడమేనన్నారు. ట్విట్టర్ తరఫు న్యాయవాది స్పందిస్తూ.. సీబీఐ ఇచ్చిన యూఆర్‌ఎల్స్ అన్నింటినీ తొలగించామన్నారు. ట్విట్టర్ ప్రోగ్రామ్ రూపకల్పనే అలా ఉంటుందని తెలిపారు. ఈ సమయంలో ధర్మాసనం ట్విట్టర్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. దేశంలోనే ఉంటూ జాతీయతను మార్చి లాగిన్ అయ్యే వారికి జడ్జిలపై అనుచిత పోస్టులు కనిపిస్తున్నాయంటే ఇంతకన్నా దారుణం లేదంది. ఇది కోర్టు ధిక్కారమే అవుతుందని, చర్యలకు సిద్ధంగా ఉండాలని స్పష్టం చేసింది. ట్విట్టర్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదుకు కూడా ఆదేశిస్తామంది.
ట్విట్టర్‌పై హైకోర్టు ఆగ్రహం
Published Tue, Feb 1 2022 5:07 AM | Last Updated on Tue, Feb 1 2022 9:28 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment