సాక్షి, అమరావతి: కోవిడ్ టీకా ప్రక్రియలో ఆంధ్రప్రదేశ్ మరో మైలురాయిని అధిగమించింది. ఆదివారం సాయంత్రం 6 గంటల సమయానికి రాష్ట్రంలో 5.01 కోట్ల డోసుల టీకాలను ఇచ్చారు. ఇప్పటికే దేశంలో ఎక్కువ మంది ప్రజలకు రెండు డోసులు టీకాలు ఇచ్చిన రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ టాప్ 5లో ఉన్న విషయం తెలిసిందే. తాజాగా ఐదు కోట్ల డోసులు పూర్తయ్యాయి. జనాభా ప్రాతిపదికన చూస్తే మిగతా పెద్ద రాష్ట్రాలకంటే ఏపీలోనే ఎక్కువ శాతం మందికి టీకాలిచ్చారు.
పట్టణాలకు దీటుగా ఏజెన్సీలోనూ..
వ్యాక్సినేషన్ ఆరంభంలో దేశంలో తొలి మూడు నెలలు టీకాలు తీసుకునేందుకు ప్రజలు పెద్దగా ముందుకు రాలేదు. ఏప్రిల్ నుంచి కేసులు పెరగడంతో ఒక్కసారిగా టీకాకు డిమాండ్ పెరిగింది. ఆంధ్రప్రదేశ్‌లో వార్డు/గ్రామ సచివాలయాల వ్యవస్థ ఉండటం, వలంటీర్లు చురుకుగా పనిచేయడం, ఎక్కువ మంది ఏఎన్‌ఎంలు, ఆశా వర్కర్లు ఉండటం వల్ల క్షేత్రస్థాయిలో టీకాలు వేగంగా అందరికీ ఇవ్వగలిగారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాలకు దీటుగా ఏజెన్సీ ప్రాంతాల్లోనూ టీకాల ప్రక్రియ నమోదు కావడం గమనార్హం. దీన్నిబట్టి రాష్ట్రంలో మారుమూల ప్రాంతాల్లో సైతం టీకాలిచ్చినట్లు స్పష్టమవుతోంది.
తొలిడోసు 3.17 కోట్లు ఆదివారం సాయంత్రానికి 3,17,02,897
తొలి డోసు టీకాలిచ్చారు. 1,84,26,366 రెండో డోసులు వేశారు. దీంతో మొత్తం డోసులు 5.01 కోట్లు దాటాయి. ఇప్పటికే హెల్త్‌కేర్ వర్కర్లు.. ఫ్రంట్‌లైన్ వర్కర్లు, 45 ఏళ్ల వయసు పైన ఉన్నవారు, ఐదేళ్లలోపు చిన్నారులు తల్లులకు టీకాల ప్రక్రియ పూర్తైన విషయం తెలిసిందే.
ప్రస్తుతం 18–44 ఏళ్ల వారికి వ్యాక్సినేషన్ ముమ్మరంగా జరుగుతోంది. ఆదివారం సాయంత్రానికి వీరికి 2.61 లక్షల డోసులు ఇచ్చారు. ఆశా వర్కర్లు, ఏఎన్‌ఎంలు రవాణా సదుపాయం సరిగా లేని గ్రామాలకు కూడా వెళ్లి టీకాలు ఇస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment