ప్రతీకాత్మక చిత్రం
వరంగల్ ఎంజీఎం: ‘కరోనా వైరస్ కొద్ది రోజులుగా విస్తరిస్తోంది. కేసులు పెరుగుతూ వస్తున్నాయి. ఈ క్రమంలో పాజిటివ్ నిర్ధారణ అయిన కుటుంబంలో చిన్న పిల్లలు ఉంటే మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రస్తుతానికి చిన్నారులెవరూ కరోనాతో అస్వస్థతకు గురికాకపోవడం మంచి పరిణామమే’ అని ఎంజీఎం పిడియాట్రిక్ ప్రొఫెసర్ డాక్టర్ ఎ.సుధాకర్ శుక్రవారం ‘సాక్షి ఫోన్ ఇన్’లో పేర్కొన్నారు.
పలువురు చిన్న పిల్లల తల్లులు తమకు పాజిటివ్ వస్తే.. పిల్లలకు పాలు పట్టించొచ్చా అని డాక్టర్‌ను ప్రశ్నించగా.. పిల్లలకు పాలు ఇవ్వొచ్చని, పాల ద్వారా కరోనా వ్యాప్తి జరగదని స్పష్టం చేశారు. గర్భిణులు 12 వారాల తర్వాత కచ్చితంగా వ్యాక్సినేషన్ చేసుకోవాలని సూచించారు. లేదంటే పుట్టిన పిల్లలకు కరోనా సోకే అవకాశం ఉందన్నారు.
ఫోన్ ఇన్ కార్యక్రమంలో మాట్లాడుతున్న డాక్టర్ సుధాకర్
నాకు రెండేళ్ల చిన్నారి ఉంది. కరోనా లక్షణాలుంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
– ప్రియ, హన్మకొండ
డాక్టర్ : ఇంట్లో ఎవరికైనా పాజిటివ్ వచ్చినప్పుడు చిన్నపిల్లల పట్ల జాగ్రత్తగా ఉండాలి. పిల్లల్లో జలుబు, జ్వరం, దగ్గును కరోనా లక్షణాలుగా పరిగణిస్తాం. ఇలాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే కరోనా పరీక్షలు చేయించాలి. నిర్ధారణ అయితే వైద్యుల సలహా మేరకు మందులు వాడాలి. సాధారణ జ్వరం వస్తే పారాసిటమాల్ సిరఫ్ వాడుకోవచ్చు.
(చదవండి: కరోనా పాజిటివ్ ఉన్నా.. లేనట్లుగా..)
నాకు ఈనెల 13న పాజిటివ్ వచ్చింది. ఐదు రోజుల తర్వాత జ్వరం తగ్గింది. మళ్లీ టెస్టు చేయించుకోమంటారా?
– నసీరొద్దీన్, హన్మకొండ
డాక్టర్ ::ప్రస్తుతానికి మీకు కరోనా లక్షణాలేమీ లేకపోతే పది రోజుల తర్వాత హోం ఐసోలేషన్ పూర్తి చేసుకుని బయటకు వెళ్లొచ్చు. 14 రోజుల వరకు మాస్క్ తప్పనిసరిగా ధరించి మీ కార్యక్రమాలు చేసుకోవచ్చు. నెగెటివ్ కోసం మళ్లీ పరీక్ష చేసుకోవాల్సిన అవసరం లేదు.
పాజిటివ్ నిర్ధారణ అయి ఆరు రోజులైంది. ప్రస్తుతానికి నీరసంగా ఉంది. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోమంటారు?
– ఈశ్వర్, భీమారం
డాక్టర్ : కరోనా తగ్గిన తర్వాత కొద్దిగా నీరసంగా ఉన్నా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. నడుస్తున్నప్పుడు ఇబ్బందిగా ఉన్నా.. శ్వాసకోశ ఇబ్బందులు ఉన్నా వైద్యుడిని సంప్రదించి ఆ మేరకు చికిత్స పొందాలి. కరోనా తగ్గిన తర్వాత కూడా మల్టీ మిటమిన్ మాత్రలు వేసుకోవడం మంచిది.
ఒకే గదిలో ఇద్దరు మిత్రులం ఉంటాం. నా మిత్రుడికి పాజిటివ్ వచ్చింది? నాకు కొద్దిగా తలనొప్పిగా ఉంది. పరీక్ష చేసుకోవడం తప్పనిసరా?
– లక్ష్మణ్, రాయపర్తి
డాక్టర్ : కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ జరిగిన వ్యక్తికి అతి దగ్గరగా ఉన్న ప్రతి ఒక్కరూ పరీక్ష చేసుకోవాల్సిందే. తలనొప్పి.. కొద్ది నీరసంగా ఉందని చెబుతున్నారు కదా.. కరోనా పరీక్ష చేసుకున్న తర్వాత చికిత్స పొందాలి.
కోవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ జరిగిన తర్వాత వ్యాక్సిన్ ఎప్పుడు తీసుకోమంటారు?
– భూక్య రామ్, వరంగల్
డాక్టర్ : కరోనా వ్యాధికి గురైన సమయంలో మన శరీరంలో యాంటీబాడీస్ వృద్ధి చెందుతాయి. అందుకే మూడు నెలల తర్వాత వ్యాక్సిన్ తీసుకుంటే మంచిది.
మా ఇంట్లో నా భర్తకు పాజిటివ్ వచ్చింది. నాకు ఏడాది పాప ఉంది. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోమంటారు?
– భీమారం, అనూష
డాక్టర్ : ఇంట్లో ఎవరికైనా పాజిటివ్ నిర్ధారణ జరిగినప్పుడు వారికి దూరంగా పిల్లలను ఉంచాలి. వారికి ఎలాంటి లక్షణాలు లేకపోతే ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. జ్వరం, జలుబు, దగ్గు వంటి లక్షణాలు కనిపిస్తే వైద్యుడి సలహా మేరకు మాత్రమే మందులు వాడాలి.
పాజిటివ్‌గా నిర్ధారణ జరిగిన తర్వాత చిన్నారులకు పాలు ఇవ్వొచ్చా?
– భానుప్రియ, పోచమ్మమైదాన్
డాక్టర్ : కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ జరిగిన తర్వాత కూడా మాస్క్, చేతులకు గ్లౌజ్‌లు ధరించి జాగ్రత్తలు పాటిస్తూ చిన్నారులకు పాలు ఇవ్వొచ్చు. తల్లిపాల ద్వారా చిన్నారులకు కరోనా వ్యాప్తి జరగదు.
మా ఇంట్లో అందరికి పాజిటివ్ వచ్చింది. ప్రభుత్వం ద్వారా అందిస్తున్న కిట్టు మందులు వాడితే సరిపోతుందా?
– సిద్ధార్థ, పలివేల్పుల
డాక్టర్ : ప్రభుత్వం అందిస్తున్న కిట్టు మందులు వాడుతున్న సందర్భంలో శ్వాసకోశ ఇబ్బందులు లేకుండా చూసుకోవాలి. ఆక్సిజన్ లెవల్స్‌ను ఎప్పటికప్పుడు చేక్ చేసుకోవాలి. శ్వాసకోశ ఇబ్బందులు ఏర్పడితే వెంటనే వైద్యుడిని సంప్రదించి ఆస్పత్రిలో చేరాలి.
(చదవండి: కరోనా ఎఫెక్ట్.. 55 రైళ్లు రద్దు..)
Comments
Please login to add a commentAdd a comment