
సాక్షి, అమరావతి: విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఏపీ అసెంబ్లీలో తీర్మానం జరిగింది. పరిశ్రమలశాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి ప్రవేశపెట్టిన ఈ తీర్మానం గురువారం శాసనసభ ఆమోదం పొందింది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఇప్పటికే ప్రధానమంత్రి నరేంద్రమోదీకి లేఖ రాసినట్లు తెలిపారు. ప్రైవేటీకరణ కాకుండా సీఎం తన లేఖలో అయిదు ప్రత్యామ్నాయాలు సూచించారని పేర్కొన్నారు. విశాఖ స్టీల్‌ప్లాంట్‌కు క్యాప్టివ్ మైన్స్ కేటాయించాలని, స్టీల్‌ప్లాంట్ నష్టాల నుంచి బయట పడేందుకు అన్ని అవకాశాలు ఉన్నాయని తెలిపారు. విశాఖ ఉక్కు తెలుగువారి ఆత్మగౌరవంతో ముడిపడి ఉందని మరోసారి గుర్తుచేశారు.
విశాఖ ఉక్కు.. ఆంధ్రుల హక్కు అని ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ అన్నారు. 32 మంది ప్రాణాల బలిదానంతో స్టీల్‌ప్లాంట్ ఏర్పాటు అయ్యిందని, స్టీల్‌ప్లాంట్‌కు క్యాప్టివ్ మైన్స్ కేంద్రం కేటాయించాలని డిమాండ్ చేశారు. స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణపై కేంద్రం పునరాలోచించాలని కోరారు. కాగా, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా గత కొన్ని రోజులుగా తీవ్ర ఆందోళనలు జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేస్తామని ఫిబ్రవరిలోనే ఉక్కు పరిరక్షణ సంఘం ప్రతినిధులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ హామీ ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment