బీఏసీ సమావేశంలో మాట్లాడుతున్న సీఎం వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: అసెంబ్లీ సమావేశాలను ఈ నెల 26 వరకు నిర్వహించాలని బీఏసీలో నిర్ణయించినట్లు ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్‌రెడ్డి చెప్పారు. తొలుత ఒక్క రోజే సభ నిర్వహించాలని భావించామన్నారు. టీడీపీ శాసస సభాపక్ష ఉపనేత అచ్చెన్నాయుడు ఈ నెల 26 వరకు కొనసాగించాలని సమావేశంలో డిమాండ్ చేయటంతో సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వెంటనే అంగీకారం తెలిపారని చెప్పారు.
గురువారం అసెంబ్లీలో స్పీకర్ తమ్మినేని సీతారాం అధ్యక్షతన బీఏసీ సమావేశమైంది. సీఎం జగన్‌తో పాటు బీఏసీ సభ్యులు, మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్, అనిల్ కుమార్ యాదవ్, కురసాల కన్నబాబు పాల్గొన్నారు. టీడీపీ తరపున ఆ పార్టీ శాసన సభాపక్ష ఉపనేత అచ్చెన్నాయుడు హాజరయ్యారు. సమావేశం అనంతరం విలేకరుల సమావేశంలో శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు బీఏసీ సమావేశానికి హాజరు కాకుండా అచ్చెన్నాయుడును పంపించారని తెలిపారు.
బీఏసీలో తాము పూర్తి ప్రజాస్వామ్య విధానాన్ని అమలు చేస్తున్నామని చెప్పారు. టీడీపీ లేవనెత్తిన ప్రతి అంశాన్ని చర్చించడానికి సిద్ధంగా ఉన్నామని సీఎం జగన్ తెలియజేశారన్నారు. ఇప్పుడు టీడీపీ చర్చకు సిద్ధంగా ఉండాలని, పారిపోకూడదని అన్నారు. సభా సమయాన్ని వృథా చేయకుండా టీడీపీ సహకరించాలని కోరారు. టీడీపీ హయంలో బీఏసీలో ప్రతిపక్షాన్ని మాట్లాడనిచ్చేది కాదని తెలిపారు.
ఒక్కసారి కూడా టీడీపీ ప్రభుత్వం ప్రతిపక్షం అభిప్రాయాలు పరిగణనలోకి తీసుకోలేదన్నారు. ఇపుడు సీఎం జగన్ ప్రతిపక్షం మాటే వింటున్నారని తెలిపారు. కరోనా వల్ల ఒక్కరోజు మాత్రమే నిర్వహించాలని, అది కూడా ఎమ్మెల్సీల నామినేషన్ల తర్వాత సభను ఏర్పాటు చేయాలని భావించామని చెప్పారు. అయినా ప్రతిపక్షం కోరిక మేరకు నిర్ణయాన్ని మార్చుకున్నామన్నారు.
తాము సంస్కారయుతంగా, ఎదుటి వారిని గౌరవిస్తూ ముందుకు వెళ్తున్నామని తెలిపారు. 27 అంశాలపై చర్చించాలని టీడీపీ కోరిందని చెప్పారు. మహిళా సాధికారతతో పాటు బీసీల జనగణనకు సంబంధించిన తీర్మానంపై చర్చించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment