బీఏసీ సమావేశంలో మాట్లాడుతున్న సీఎం వైఎస్ జగన్. చిత్రంలో స్పీకర్ తమ్మినేని సీతారాం, తదితరులు
సాక్షి, అమరావతి: ప్రజా ప్రాధాన్యం కలిగిన ఏ అంశంపై అయినా చర్చించేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. ఏ అంశంపైనైనా చర్చకు అధికారపక్షమే ముందు ఉండాలని బీఏసీ సమావేశంలో సూచించారు. సమస్యల పరిష్కారంపై తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని, ప్రతిపక్షాన్ని మాట్లాడనిస్తామని, గత ప్రభుత్వం మాదిరిగా వ్యవహరించబోమని పేర్కొన్నారు. ఈనెల 11వతేదీ నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో బుధవారం స్పీకర్ తమ్మినేని సీతారాం అధ్యక్షతన ఆయన చాంబర్‌లో బీఏసీ (శాసనసభా వ్యవహారాల సలహా మండలి) సమావేశం జరిగింది.
సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డితోపాటు శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్‌రెడ్డి, మంత్రులు పి.అనిల్‌కుమార్ యాదవ్, కురసాల కన్నబాబు, టీడీపీ తరపున ఉపనేత కె.అచ్చెన్నాయుడు దీనికి హాజరయ్యారు. ‘ఏ అంశంపై చర్చ జరగాలని కోరుకుంటున్నారో చెప్పండి. ఆ అవకాశం మీకే ఇస్తున్నాం... అసెంబ్లీ ఎన్ని రోజులు నిర్వహించుకుందామో కూడా చెప్పండి. 20 రోజులకు పెంచుకుందామా.. లేక ఇంకా కావాలా? మీరే చెప్పండి..’ అని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా ప్రతిపక్ష టీడీపీకి సూచించారు. నూతన ప్రభుత్వం ఏర్పడిన తరువాత జరుగుతున్న తొలి బడ్జెట్ సమావేశాలను ఈనెల 30వతేదీ వరకు నిర్వహించాలని బీఏసీలో నిర్ణయించారు. మొత్తం 14 పని రోజుల్లో 84 గంటల పాటు సమావేశాలు జరగనున్నాయి. రోజూ ఉదయం 9 గంటలకు సమావేశాలు ప్రారంభం కానున్నాయి.
పోనీ తరువాతే చెప్పండి..
బుధవారం బీఏసీ సమావేశం ప్రారంభం కాగానే స్పీకర్ సీతారామ్ తొలుత మాట్లాడారు. అనంతరం సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ అసెంబ్లీ సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహిద్దామో సూచించాలని ప్రతిపక్షాన్ని కోరారు. అయితే టీడీపీ నుంచి హాజరైన అచ్చెన్నాయుడు దీనిపై అప్పటికపుడు సమాధానం చెప్పకపోవడంతో ... ‘పోనీ ఇవాళ కాకపోయినా ఆ తరువాతైనా ఎన్ని రోజులు కావాలో చెప్పండి..’ అని పేర్కొంటూ జగన్ విపక్షానికే అవకాశాన్ని ఇచ్చారు. సమావేశాలు పొడిగించాలని చివరి రోజుల్లో కోరితే ఏర్పాట్లు చేయడంలో ఇబ్బందులు ఎదురవుతాయని సీఎం అన్నట్లు తెలిసింది. ప్రతిపక్షం నుంచి ఈ విషయంపై స్పందన లేకపోవడంతో బీఏసీలో ఇతర అంశాలపై చర్చ జరిగింది.
నూతన ఒరవడికి సీఎం శ్రీకారం: మంత్రులు
గతంలో మాదిరిగా కాకుండా బీఏసీలో పూర్తి అర్థవంతంగా చర్చ జరిగిందని, సమావేశంలో అధికారపక్షం కన్నా ప్రతిపక్షానికే ముఖ్యమంత్రి మాట్లాడే అవకాశం ఇచ్చారని మంత్రులు కన్నబాబు, అనిల్‌కుమార్ యాదవ్, చీఫ్‌విప్ శ్రీకాంత్‌రెడ్డి తెలిపారు. సమావేశం అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్ నూతన ఒరవడికి శ్రీకారం చుట్టారని, ప్రజా ప్రాధాన్యం కలిగిన ఏ సమస్య ఉన్నా ముందుకు రావాలని ప్రతిపక్షానికి సూచించారన్నారు. అసెంబ్లీ ఎన్ని రోజులైనా సరే నిర్వహిద్దామని కూడా ప్రతిపాదించారన్నారు. గత ప్రభుత్వంలో మాదిరిగా సభలో మైక్‌లు కట్ చేయడం, ప్రతిపక్షానికి సమయం ఇవ్వకపోవడం లాంటివి ఇప్పుడు ఉండవని, ప్రజా సమస్యల పరిష్కార వేదికగా సభను వినియోగించుకోవాలని సీఎం సూచించారని చెప్పారు.
అచ్చెన్న.. ఆశ్చర్యం!
ప్రతిపక్షాన్ని అణగదొక్కాలన్నది తమ అభిమతం కాదని మంత్రులు పేర్కొన్నారు. కరువుపై చర్చించాలని బీఏసీలో టీడీపీ కోరగానే ముఖ్యమంత్రి తొలి రోజునే చర్చకు అంగీకరించారన్నారు. తమ ప్రభుత్వం చర్చకు రెండడుగులు ముందుకు వేస్తుందే తప్ప వెనక్కి వెళ్లదని వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి జగన్ ఇలా ఉదార స్వభావంతో మాట్లాడటం టీడీపీ నేత అచ్చెన్నాయుడుకు కూడా ఆశ్చర్యం కలిగించి ఉంటుందన్నారు. పార్లమెంటరీ ప్రజాస్వామ్యం విలువలు, సంప్రదాయాలకు అనుగుణంగా ముఖ్యమంత్రి జగన్ చాలా ఉదారంగా వ్యవహరించడం పట్ల తమకు గర్వంగా ఉందని గడికోట పేర్కొన్నారు. తాము అధికారంలో ఉన్నపుడు ఇలా వ్యవహరించలేక పోయామే అని అచ్చెన్న పశ్చాత్తాపపడి ఉంటారని.
అయితే ఆ విషయాన్ని ఆయన బయటకు చెప్పలేకపోయి ఉంటారన్నారు. ఈ సమావేశాల్లోనే ఫీజుల నియంత్రణ, టెండర్లపై జ్యుడీషియల్ కమిషన్, అమ్మ ఒడి తదితర బిల్లులను ప్రవేశపెడుతున్నట్లు చెప్పారు. తాము ప్రతిపక్షంలో ఉండగా సభలో చర్చించాల్సిన అంశాలపై బీఏసీ సమావేశంలో లిఖితపూర్వకంగా ఇస్తే నాడు అధికార పక్షంగా ఉన్న టీడీపీ కనీసం పట్టించుకోలేదని గడికోట గుర్తు చేశారు. అయితే తాము మాత్రం ఏ అంశంపైనైనా చర్చ చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. 40 రోజుల వైఎస్ జగన్ పాలనలో ఏదో జరిగిపోయినట్లుగా శాంతి భద్రతల అంశంపై చర్చ జరగాలని టీడీపీ కోరుతోందని విమర్శించారు. శాంతి భద్రతల విషయంలో కఠినంగా వ్యవహరించాలని సీఎం పోలీసులను ఆదేశించారని మంత్రి అనిల్ కుమార్ చెప్పారు.
విపక్ష నేతకు ముందే సమాచారం ఇచ్చాం...
ప్రతిపక్ష నేత చంద్రబాబు బీఏసీ సమావేశానికి గైర్హాజరు కావటాన్ని బట్టి ప్రజలపై ఆయనకు ఎంత చిత్తశుద్ధి ఉందో తెలుస్తోందన్నారు. చివరి నిమిషంలో ఆయనకు ఆహ్వానం పంపారనడం సరికాదన్నారు. ఒకరోజు ముందుగానే ఉదయమే తెలియజేశామన్నారు. బీఏసీ సమావేశానికి తక్కువ మంది టీడీపీ సభ్యులకు అవకాశం కల్పించారని కొందరు విలేకరులు ప్రశ్నించగా నిబంధనల మేరకే వ్యవహరించామని గడికోట తెలిపారు. అసెంబ్లీలో సంఖ్యాపరంగా చూస్తే టీడీపీ నుంచి 0.5 మందికే బీఏసీకి అవకాశం ఉంటుందన్నారు. అచ్చెన్నాయుడు లాంటి భారీ మనిషికి అర అవకాశం ఇవ్వలేం కనుక ఒకరికి సభ్యత్వం కల్పించామని వ్యాఖ్యానించారు. ఈ సమావేశంలో అసెంబ్లీ కార్యదర్శి పి.బాలకృష్ణమాచార్యులు కూడా పాల్గొన్నారు.
23 అంశాలపై సభలో చర్చిద్దాం
సాక్షి, అమరావతి: శాసనసభ బడ్జెట్ సమావేశాలు నేటి నుంచి ప్రారంభమవుతున్న నేపథ్యంలో ప్రజా ప్రాధాన్యం కలిగిన 23 అంశాలపై సభలో చర్చించాలని వైఎస్సార్ కాంగ్రెస్ శాసన సభాపక్షం ప్రతిపాదించింది. మంత్రి కురసాల కన్నబాబు వీటిని మీడియాకు విడుదల చేశారు. ఆ వివరాలు ఇవీ.
- రాష్ట్రంలో వ్యవసాయరంగం– రైతు భరోసా– 40 రోజుల్లో ప్రభుత్వం తీసుకున్న చర్యలు
- విద్యారంగం–పాఠశాలలు, కాలేజీల పరిస్థితి, అమ్మ ఒడి, అధిక ఫీజుల నియంత్రణ, పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు మెరుగుపర్చడం
- పారదర్శకమైన పాలన – అవినీతి నిర్మూలన
- ప్రభుత్వ నామినేటెడ్ పదవులు, పనుల్లో బడుగు బలహీన వర్గాలు, మైనారిటీలకు 50% రిజర్వేషన్లు
- వైద్య ఆరోగ్య రంగం – స్థితిగతులు, ఆరోగ్యశ్రీ, 108, 104 నిర్వహణ
- నీటి పారుదల రంగం – పోలవరం, ఇతర ప్రాజెక్టులు
- గృహ నిర్మాణం– 25 లక్షల ఇళ్ల స్థలాలు
- ఆర్థిక పరిస్థితులు, గత ఐదేళ్ల అప్పులు, బకాయిలు
- ప్రత్యేక హోదా, విభజన హామీలు – కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి మొండిచెయ్యి
- విద్యుత్ రంగం – వాస్తవాలు
- రాజధాని అంశం – సీఆర్డీఏ పరిధిలో
భూ కేటాయింపులు
- పొదుపు సంఘాల రుణాలు
- బెల్టు షాపులు – ఎక్సయిజ్ పాలసీ
- గ్రీవెన్సెస్, స్పందన కార్యక్రమం
- ఇసుక అక్రమ రవాణా
- డ్వాక్రా రుణాలు –వాస్తవాలు
- గత ఐదేళ్లలో రాష్ట్రంలో భూ కేటాయింపులు
- అగ్రిగోల్డ్ అంశం
- జన్మభూమి కమిటీలు – రాజ్యాంగేతర శక్తులుగా పని చేసిన తీరు, అవినీతి, ‘కే ట్యాక్స్’
- నదుల ఆక్రమణలు, అక్రమ కట్టడాలు – భవిష్యత్తుపై ప్రభావం
- కాంట్రాక్టులు, అవకతవకలు – అవినీతి
- ఉద్యోగాలు, నిరుద్యోగం, గ్రామ సచివాలయం, గ్రామ వాలంటీర్లు
- ప్రభుత్వోద్యోగులు – సంక్షేమం.
బడ్జెట్ సమావేశాలకు గట్టి భద్రత
సాక్షి, అమరావతి బ్యూరో/గుంటూరు: నూతన ప్రభుత్వం ఏర్పడిన అనంతరం తొలిసారి నిర్వహిస్తున్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు పోలీసులు గట్టి భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. వెలగపూడిలోని తాత్కాలిక సచివాలయంలో గురువారం నుంచి ఈనెల 30వ తేదీ వరకు బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. 1,450 మంది పోలీసులతో భద్రతా ఏర్పాట్లు కల్పిస్తున్నారు. మొత్తం 14 రోజుల పాటు సమావేశాలు జరగనుండగా ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ శుక్రవారం శాసనసభలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. అదేరోజు వ్యవసాయ బడ్జెట్‌ను ఆ శాఖ మంత్రి కన్నబాబు ప్రత్యేకంగా సమర్పిస్తారు.
మూడంచెల భద్రత
అసెంబ్లీ వద్ద మూడంచెల విధానంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. 2 రోజుల ముందు నుంచే పరిసర ప్రాంతాలను బాంబు స్క్వాడ్ బృందాలతో జల్లెడ పట్టారు. తుళ్లూరు మండలం పరిధిలో పోలీస్ యాక్ట్–30 అమలు చేస్తున్నారు. అసెంబ్లీ పరిధిలో 10 కిలో మీటర్ల వరకు సెక్షన్ 144 అమల్లోకి తెచ్చారు. వెలగపూడి వైపు వెళ్లే వాహనాలను చెక్‌పోస్టుల వద్ద క్షుణ్నంగా తనిఖీలు చేస్తున్నారు. గరుడ కమాండ్ కంట్రోల్ కేంద్రం నుంచి డ్రోన్ కెమెరాల ద్వారా సచివాలయం, అసెంబ్లీ పరిసర ప్రాంతాలను సిబ్బంది పర్యవేక్షించనున్నారు.
ప్రధాన గేటు నుంచి వీవీఐపీ, వీఐపీలు..
వీవీఐపీ, వీఐపీలను ప్రధాన గేటు నుంచి అసెంబ్లీలోకి అనుమతిస్తారు. పాసులు కలిగిన మీడియా ప్రతినిధులను 4 లేదా 5వ గేటు నుంచి అనుమతిస్తారు. అసెంబ్లీకి వచ్చే వారందరికీ వేర్వేరుగా వాహనాల పార్కింగ్ ప్రాంతాలను కేటాయించారు. డ్రైవర్లు, వ్యక్తిగత భద్రతా సిబ్బంది, ఎమ్మెల్యేల అనుచరులను లోపలకు అనుమతించరు.
ఆ దారిలో సీఎం, మంత్రులకే అనుమతి..
స్క్రూ బ్రిడ్జి– కరకట్ట – ఎమ్‌ఎస్‌ఆర్ ఆశ్రమం మార్గంలో సీఎం, మంత్రులను మాత్రమే అసెంబ్లీకి వెళ్లేందుకు అనుమతిస్తారు. ప్రజాప్రతినిధులు, కార్యదర్శి స్థాయి అధికారులు ఉండవల్లి సెంటర్ – ఉండవల్లి గుహలు –పెనుమాక––కృష్ణాయపాలెం–వెలగపూడి మీదుగా అసెంబ్లీకి చేరుకోవాలి. అధికారులు, ఉద్యోగులు ఇతర వీఐపీలు మంగళగిరి డాన్ బాస్కో స్కూల్ – ఎరబ్రాలెం – కృష్ణాయపాలెం – వెలగపూడి మీదుగా అసెంబ్లీకి చేరుకోనున్నారు.
నాలుగు మొబైల్ పార్టీలు
కాజా టోల్ ప్లాజా, మంగళగిరిలోని నిడమర్రు రైల్వే గేట్, నిడమర్రు సెంటర్, తాడికొండ అడ్డరోడ్డు వద్ద ట్రాఫిక్ నియంత్రణ, తనిఖీల కోసం సిబ్బందిని నియమించారు. నాలుగు మొబైల్ పార్టీలను ఏర్పాటు చేశారు. మంగళగిరి, తాడేపల్లిలో ఎస్టీఎఫ్, ఏపీఎస్పీ బృందాలను సిద్ధంగా ఉంచారు. కనకదుర్గ వారధి, ప్రకాశం బ్యారేజ్, ఉండవల్లి సెంటర్, డాన్ బాస్కో స్కూల్, కురగల్లు జంక్షన్, తాడికొండ క్రాస్ రోడ్స్ వద్ద మొత్తం ఆరు చెక్ పోస్ట్‌లను ఏర్పాటు చేశారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో అనుమతులు లేకుండా ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహించడాన్ని నిషేధించారు.
Comments
Please login to add a commentAdd a comment