నేను సీబీఐ ఎస్పీకి చెప్పని వాటిని కూడా చెప్పినట్లుగా ఆంధ్రజ్యోతి కథనాలను ప్రచురించడం దిగజారుడు జర్నలిజానికి పరాకాష్ట. వైఎస్ వివేకానందరెడ్డి గుండెపోటుతో మృతి చెందారని వైఎస్ జగన్ నాతో అన్నారని నేను సీబీఐకి వెల్లడించినట్లు వెలువడ్డ కథనం పచ్చి అబద్ధం.
– అజేయ కల్లం
సాక్షి, అమరావతి: మేనిఫెస్టో కమిటీ సమావేశానికి, హత్య కేసుకు సంబంధం ముడిపెడుతూ కథనాలను ప్రచురించటాన్ని బట్టి ఆంధ్రజ్యోతి ఏ స్థాయికి దిగజారిందో అర్ధం అవుతోందని ముఖ్యమంత్రి ముఖ్య సలహాదారు అజేయ కల్లం వ్యాఖ్యానించారు. వైఎస్ వివేకా గుండెపోటుతో మృతి చెందినట్లు వైఎస్ జగన్ తనకు చెప్పారంటూ ఆంధ్రజ్యోతి ప్రచురించిన వార్త పచ్చి అబద్ధమని అజేయ కల్లం ఖండించారు. అంతకుముందే మేనిఫెస్టో కమిటీ సమావేశం జరిగిందని, అందులో పాల్గొన్న వారిని విచారించాలంటూ గతంలో ఓ కథనం వెలువరించిందని, అందులో భాగంగానే మళ్లీ పచ్చి అబద్ధాలను ప్రచురించిందన్నారు. ఏదో ఒకవిధంగా ముఖ్యమంత్రి జగన్ పేరును లాగాలనే ప్రయత్నం మినహా ఆంధ్రజ్యోతి కథనాల్లో వాస్తవాలు లేవని స్పష్టం చేశారు.
విశ్వసనీయ వర్గాలంటూ తప్పుడు సమాచారంతో ఆ పత్రిక విశ్వసనీయతను కోల్పోయిందని విమర్శించారు. సీబీఐ తనను విచారించిందంటూ ఆంధ్రజ్యోతిలో వచ్చిన వార్తను గురువారం సచివాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో అజేయ కల్లం తీవ్రంగా ఖండించారు. కొద్దిరోజుల క్రితం సీబీఐ ఎస్పీ తన ఇంటికి వచ్చి ఐదు నిమిషాలు మాట్లాడి సమాచారం తీసుకున్నారని, ఆ సమయంలో గుండెపోటు అంశం చర్చకే రాలేదని, దాని గురించి అడగలేదని అజేయ కల్లం వెల్లడించారు. వైఎస్ వివేకానందరెడ్డి మృతి చెందిన రోజు యాధృచ్ఛికంగా పార్టీ మేనిఫెస్టో కమిటీ సమావేశం జరుగుతోందన్నారు.
తమకు కాలేజీలో పాఠాలు బోధించిన గురువు, మేనిఫెస్టో కమిటీ చైర్మన్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు మేనిఫెస్టో రూపకల్పనలో సహాయం చేయాలని కోరడంతో సమాశానికి వెళ్లానని అజేయ కల్లం తెలిపారు. సమావేశం జరుగుతుండగా కొంతసేపటికి ‘వివేకానందరెడ్డి గారు నో మోర్..’ అని ఇంగ్లీషులో చెప్పడంతో ఇక లేచి వచ్చేశామన్నారు. అదే విషయాన్ని సీబీఐ ఎస్పీకి చెప్పానన్నారు. ‘మీరు స్వచ్ఛందంగా అంగీకరిస్తే రికార్డు చేసుకుంటామని సీబీఐ ఎస్పీ కోరారు. సెక్షన్ 161 కింద సమాచారాన్ని అడిగారు. అయితే ఆ సమాచారం, రికార్డుకు ఎటువంటి న్యాయపరమైన విలువ ఉండదు. సంతకాలు తీసుకోలేదు’ అని అజేయ కల్లం పేర్కొన్నారు. ‘సాంకేతికంగా ఎటువంటి విలువ ఉండదు. ఎవిడెన్స్‌గా పనికిరాదు. ఆ సెక్షన్ కింద కొన్ని అంశాలు యాడ్ చేసుకోవచ్చు, కొన్ని అంశాలు తొలగించవచ్చు’ అని కల్లం తెలిపారు.
గుండెపోటు మాటే చర్చకు రాలేదు..
అసలు గుండె పోటు అనే పదమే సీబీఐ ఎస్పీని కలుసుకున్న సందర్భంగా చర్చకు రాలేదని అజేయ కల్లం స్పష్టం చేశారు. కేసు దర్యాప్తులో ఉన్న సమయంలో రహస్యంగా ఉండాల్సిన తమ ఇద్దరి సంభాషణ సమాచారం లీకుల పేరుతో ఆంధ్రజ్యోతిలో రావడం అంటే సీబీఐ విశ్వసనీయత కూడా దెబ్బతిన్నట్లేనని పేర్కొన్నారు. ఇది సీబీఐ పేరును దుర్వినియోగం చేయడమే అవుతుందన్నారు. సీబీఐ ముందుకొచ్చి ఇలాంటి లీకు వార్తలను నిరోధించడంతో పాటు ఖండించాల్సి ఉందన్నారు.
‘మేనిఫెస్టో కమిటీ సమావేశంలో ఆ పనిమీద దృష్టి పెడతాం కానీ గడియారం చూసుకుంటూ కూర్చోం కదా! ఎవరు ఎప్పుడు బయటకు వెళ్లారో ఎలా తెలుస్తుంది? అయినా ఈ సమావేశాన్ని సీరియస్ మర్డర్ కేసుకు ముడిపెట్టి ఆంధ్రజ్యోతి తనకు కావాల్సినట్లు రాసుకోవడం కంటే అనైతికం మరొకటి ఉండదు..’ అని కల్లాం మండిపడ్డారు.
ఖండించాల్సిన బాధ్యత సీబీఐపై ఉంది
తన దగ్గర నుంచి తీసుకున్న సమాచారం చార్జిషీటు వేసేవరకు రహస్యంగా ఉండాలని, లీకుల పేరుతో తప్పుడు సమాచారం మీడియాలో ప్రచురితమైనందున ఆ వార్తను ఖండించాల్సిన బాధ్యత సీబీఐపై ఉందని కల్లాం పేర్కొన్నారు. తప్పుడు సమాచారంతో మీడియాలో సమాంతర దర్యాప్తు జరగకూడదని, ఇన్విస్టిగేషన్ ఏజెన్సీలు మీడియాకు వివరాలు వెల్లడించరాదని సుప్రీం కోర్టు తీర్పులున్నాయని కల్లాం ప్రస్తావించారు. నిందారోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తికి కూడా అందుబాటులో లేని సమాచారాన్ని మీడియాలో లీకుల పేరుతో ప్రచురించకూడదన్నారు.
నా భార్యకు కూడా తెలియదు..
‘దర్యాప్తు అంశాలను ఇష్టానుసారం ప్రచురించేందుకు, మీడియా తమ ఇష్టం అనేందుకు వీల్లేదని సుప్రీం కోర్టు తాజా తీర్పులున్నాయి. కనీస క్రమశిక్షణ, కోడ్ ఆఫ్ కాండక్ట్ మీడియాకు అవసరం. నేను సీబీఐ ఎస్పీకి చెప్పని అంశాలను చెప్పినట్లుగా నా ఫొటోతో పెద్ద శీర్షిక పెట్టి కథనాలు ప్రచురించటాన్ని బట్టి ఆ పత్రిక ఏ స్థాయికి దిగజారిందో తెలుస్తోంది. ఆ సమయంలో నేను, సీబీఐ ఎస్పీ మాత్రమే ఉన్నాం. మా ఇంటికి సీబీఐ ఎస్పీ వచ్చిన విషయం నా భార్యకు కూడా తెలియదు. ఆంధ్రజ్యోతిలో తప్పుడు వార్త ప్రచురించిన తరువాతే మిగతా వారికి తెలిసింది’ అని కల్లాం తెలిపారు. ‘సెక్షన్ 161 కింద ఇచ్చిన సమాచారానికి ఎటువంటి న్యాయపరమైన విలువ లేదు. అయినా సాక్షిగా కూడా కాదు. తప్పుడు వార్తపై తగిన సమయంలో న్యాయపరమైన చర్యలు తీసుకుంటా’ అని చెప్పారు.
సమాంతర విచారణ తగదు..
ఏదైనా క్రిమినల్ కేసు దర్యాప్తు జరుగుతున్నప్పుడు దానికి సమాంతరంగా విచారణను ప్రభావితం చేసేలా మీడియా కథనాలను రాయకూడదు, చర్చలు పెట్టకూడదు. దర్యాప్తు సమయంలో విచారణాధికారికి సాక్షులు వెల్లడించిన అంశాలను చార్జిషీట్ వేసేవరకు బహిర్గతం చేయకూడదు. విచారణలో వెల్లడైన అంశాలను బహిర్గతం చేస్తూ కథనాలను ప్రచురిస్తే వ్యక్తిగత స్వేచ్ఛను హరించినట్లేనని పలు కేసుల్లో సుప్రీంకోర్టు, హైకోర్టులు తీర్పులిచ్చాయి. దీన్ని ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కూడా స్వాగతించింది’ అని పేర్కొంటూ ఈ సందర్భంగా అజేయ కల్లం వాటిని ఉదహరించారు.
చదవండి: గేరు మార్చి.. స్పీడ్ పెంచి.. సీఎం జగన్ బలం అదే.. ఇదీ లెక్క..!
Comments
Please login to add a commentAdd a comment