CBI Not Provide Any Evidence on YS Vivekananda Reddy Assassination - Sakshi
Sakshi News home page

Viveka Case: దారి తప్పిన 'సీబీఐ దర్యాప్తు'

Published Sun, Jul 23 2023 3:38 AM | Last Updated on Sun, Jul 23 2023 12:11 PM

CBI not provide any evidence on YS Vivekananda Reddy Assassination - Sakshi

సాక్షి, అమరావతి: ‘మాజీ ఎంపీ వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసు.. రాజకీయంగా అత్యంత సంచలనమైన కేసు.. దర్యాప్తు చేస్తోంది దేశంలోని అత్యున్నత దర్యాప్తు సంస్థ సీబీఐ. దర్యాప్తు చేపట్టిన 1,226 రోజుల తర్వాత కూడా సీబీఐ సాధించింది ఇదీ అని చెప్పడానికి ఏమీ లేదన్నది నిర్వివా దాంశం. హత్య వెనుక విస్తృత కుట్ర ఉందనే మాట చెప్పడం తప్ప.. అందుకు సంబంధించి సీబీఐ నమోదు చేసిన అభియోగాలకు ఒక్కటంటే ఒక్క­దానికి కూడా ఆధారాలు చూపించలేకపోయింది’ అని ప్రముఖ జాతీయ వార్త వెబ్‌సైట్‌ ‘ద వైర్‌’ పేర్కొంది.

నిష్పాక్షికమైన థర్డ్‌ పార్టీగా ‘ద వైర్‌’ వెబ్‌సైట్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ ఇటీవల దాఖలు చేసిన తుది చార్జ్‌షీట్‌లోని అంశాలను విశ్లేషించింది. రాజకీయ, నేర, న్యాయ సంబంధమైన వార్తా విశ్లేషకురాలిగా సుదీర్ఘ అనుభవం ఉన్న సరిత రాణి ‘ద వైర్‌’ వెబ్‌సైట్‌లో రాసిన విశ్లేషాత్మక వ్యాసం ఇలా.. 

సాధించింది శూన్యం
2020 మార్చి 11న వివేకానందరెడ్డి హత్య కేసును సీబీఐకి బదిలీ చేశారు. ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయడానికే  120 రోజుల సమయం తీసుకుంది. మరో 474 రోజుల తర్వాత 2021 అక్టోబర్‌లో మొదటి చార్జ్‌షీట్‌ దాఖలు చేసింది. వివేకా హత్యలో పాలుపంచుకున్నారని చెబుతూ ఎర్ర గంగిరెడ్డి(ఏ–1), సునీల్‌ యాదవ్‌(ఏ–2), గజ్జల ఉమాశంకర్‌ రెడ్డి(ఏ–3), దస్తగిరి(ఏ–4)లను నిందితులుగా పేర్కొంది. ఈ హత్య వెనుక విస్తృత కుట్రను వెలికి తీయాల్సి ఉందని చెప్పింది.

సీబీఐ తుది చార్జ్‌షీట్‌ 2023 జూలై 20న బయటకు వచ్చింది. కడప ఎంపీ అవినాశ్‌రెడ్డి, ఆయన తండ్రి వైఎస్‌ భాస్కర్‌రెడ్డి, వారి సన్నిహితుడు డి.శివశంకర్‌రెడ్డిలను కూడా నిందితులుగా పేర్కొంది. కానీ సీబీఐ మొదటి నుంచీ పేర్కొంటూ వచ్చిన విస్తృత కుట్ర గురించి మాత్రం ఏమీ చెప్పలేకపోయింది. హత్య వెనుక ఉద్దేశం అంటూ 14 పేరాల సుదీర్ఘ వ్యాసాన్ని చార్జ్‌షీట్‌లో పొందుపరిచింది.

అందులో ఏముంది అంటే అందరికీ తెలిసిన వైఎస్‌ రాజశేఖరరెడ్డి కుటుంబ నేపథ్యం, వంశ చరిత్ర మాత్రమే. ఇది తప్ప వాస్తవానికి హత్య వెనుక విస్తృత కుట్ర గురించి సీబీఐ స్పష్టంగా ఏమీ చెప్పలేకపోయింది. ఇంతకీ ఇంతటి హైప్రొఫైల్‌ కేసుకు సంబంధించిన తుది చార్జ్‌షీట్‌లో పేర్కొన్న అంశాలు, వాటిలోని వాస్తవాలను పరిశీలిస్తే సీబీఐ దర్యాప్తులో డొల్లతనం బట్టబయలు అవుతోంది.

సీబీఐ తాను పేర్కొన్న అభియోగాలకు సంబంధించి ఒక్కటంటే ఒక్క దానికి కూడా ఆధారం చూపించలేకపోయింది. అంతకు మించి వివేకా హత్య వెనుక ఆయన సొంత కుటుంబంలో విభేదాలు, బయట శక్తుల ప్రమేయాన్ని సీబీఐ పట్టించుకోకపోవడం విస్మయ పరుస్తోంది. చార్జ్‌షీట్‌లో సీబీఐ ఏం చెప్పింది.. అందులోని వాస్తవం ఏమిటన్నది అంశాల వారీగా పరిశీలిస్తే ఈ కేసులో సీబీఐ ఇప్పటి వరకు సాధించింది శూన్యమన్నది స్పష్టమవుతోంది. సీబీఐ చెప్పిందేమిటి? వాస్తవం ఏమిటి? అన్నది చూద్దాం. 

1.వివేకా క్రియాశీలకమైన నేతా?
సీబీఐ : 2019 నాటికి వివేకా రాజకీయంగా ప్రభావవంతమైన నేత. రాజకీయంగా క్రియాశీలకంగా ఉన్నారు.
వాస్తవం : 2019 నాటికి వివేకా రాజకీయంగా ప్రభావవంతమైన నేత కాదు. హత్యకు గురయ్యే 15 ఏళ్ల ముందు 2004లో చివరిసారిగా ఎన్నికల్లో గెలిచారు. దశాబ్ద కాలంగా రాజకీయంగా క్రియాశీలకంగా లేరు. 2008లో స్వదేశానికి తిరిగి వచ్చిన వివేకా అల్లుడు నర్రెడ్డి రాజశేఖరరెడ్డి 2009 ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ టికెట్‌ కోసం సోనియా గాంధీని కలిశారు. కానీ ఆయనకు టికెట్‌ ఇచ్చేందుకు కాంగ్రెస్‌ అధిష్టానం తిరస్కరించింది.

వివేకా రాజకీయాల నుంచి రిటైర్‌ అయ్యారని ఆయన కుమార్తె సునీతనే సీబీఐకి రెండుసార్లు చెప్పారు. 2011లో పులివెందుల ఉప ఎన్నికల్లో వైఎస్‌ విజయమ్మపై పోటీ చేసి ఓడిపోయిన తర్వాత నుంచి ఆయన రాజకీయాల నుంచి రిటైరై పోయినట్టేనని ఆమె చెప్పారు. 2011లో అప్పటి కాంగ్రెస్‌ ప్రభుత్వంలో మంత్రిగా రాజీనామా చేసిన తర్వాత నుంచి ఆయన ఎలాంటి పదవిలో లేరు. పులివెందుల ఉప ఎన్నికల్లో విజయమ్మ చేతిలో భారీ తేడాతో ఓడిపోయాక కాంగ్రెస్‌ పార్టీ కూడా ఆయన్ను పట్టించుకోలేదు. ఎమ్మెల్సీగా కూడా నామినేట్‌ చేయలేదు. ఆయన అసెంబ్లీలో ఓ ఎమ్మెల్యేపై దాడికి యత్నించడం కూడా ఇందుకు కారణం అయిఉండొచ్చు. 

2.అవినాశ్‌ బలమైన అభ్యర్థి కాదా?
సీబీఐ : 2019 ఎన్నికల్లో కడప లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు వైఎస్‌ అవినాశ్‌ రెడ్డి బలహీనమైన అభ్యర్థి అని వివేకానందరెడ్డి భావించారని షర్మిల సీబీఐకి ఇచ్చిన వాంగ్మూలంలో పేర్కొన్నారు. 

వాస్తవం : అవినాశ్‌రెడ్డి బలహీనమైన అభ్యర్థి అన్నది పూర్తిగా అవాస్తవం. ఆయన అప్పటికే సిట్టింగ్‌ ఎంపీగా ఉన్నారు. 2014 ఎన్నికల్లో 1,90,323 ఓట్ల భారీ మెజార్టీతో ఎంపీగా గెలిచారు. ఆయన ఎంత బలమైన అభ్యర్థో ఆ మెజార్టీనే చెబుతుంది. ప్రత్యేక హోదా సాధన డిమాండ్‌తో పార్టీ నిర్ణయం మేరకు తన ఎంపీ పదవికి 2018లో రాజీనామా చేశారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో అవినాశ్‌రెడ్డి మరింత భారీ మెజార్టీతో అంటే 3,80,976 ఓట్ల మెజార్టీతో ఘన విజయం సాధించారు. అప్పటి టీడీపీ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న ఆదినారాయణరెడ్డిపై అంత మెజార్టీ సాధించడం విశేషం.

ఏ రకంగా చూసినా అవినాశ్‌రెడ్డి బలమైన అభ్యర్థి అన్నదాంట్లో సందేహం లేదు. వివేకానందరెడ్డి తాను హత్యకు గురికావడానికి ముందు వరకు కూడా అవినాశ్‌రెడ్డి గెలుపు కోసం ప్రచారం చేశారని ఆయన అల్లుడు నర్రెడ్డి రాజశేఖరరెడ్డి సీబీఐకి ఇచ్చిన వాంగ్మూలంలో చెప్పారు. వివేక హత్యకు గురైన ముందు రోజు రాత్రి కూడా అవినాశ్‌రెడ్డి గెలుపు కోసం జమ్మలమడుగులో ప్రచారం చేశారని ఎర్ర గంగిరెడ్డి తనతో చెప్పినట్టు వెల్లడించారు.

అవినాశ్‌రెడ్డే ఎంపీ అభ్యర్థి అన్న విషయంలో మరో మాటే లేదని వివేకానందరెడ్డి సోదరి వైఎస్‌ విమల కూడా స్పష్టం చేశారు. ఎంపీగా అవినాశ్‌ గెలుపు కోసం వివేకా చివరి వరకు ప్రచారం చేశారని కూడా ఆమె చెప్పారు. ప్రస్తుతం కొందరు రాజకీయ దురుద్దేశంతో అవినాశ్‌రెడ్డికి వ్యతిరేకంగా దుష్ప్రచారం చేస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. 

3. షర్మిల వాంగ్మూలంలో చెప్పినదానికి ఆధారం ఎక్కడ?
సీబీఐ : 2019 ఎన్నికల్లో కడప ఎంపీ అభ్యర్థిగా షర్మిల కానీ, విజయమ్మ కానీ పోటీ చేయాలని వివేకా భావించారనే విషయాన్ని షర్మిల వెల్లడించారు. 
వాస్తవం : కడప ఎంపీ అభ్యర్థిత్వం విషయంపై వివేకానందరెడ్డి తనతో చెప్పినట్టుగా షర్మిల వెల్లడించిన సమాచారానికి ఎలాంటి ఆధారం లేదు. ఎంపీగా తానుగానీ తన తల్లి విజయమ్మగానీ పోటీ చేయాలని వివేకా చెప్పినట్టు వాంగ్మూలం ఇచ్చిన షర్మిల.. అందుకు ఎలాంటి ఆధారం చూపించలేకపోయారు. ఎంపీ టికెట్‌ అంశంపై వారిద్దరు మాట్లాడుకున్నట్టు కూడా గతంలో ఎప్పుడూ మీడియాలోగానీ పార్టీ వర్గాలుగానీ చెప్పలేదు.

సీబీఐ ఎలాంటి ఆధారం గురించి పేర్కొన లేదు. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి అయిన రెండేళ్ల తర్వాత షర్మిల తన సోదరుడితో రాజకీయంగా విడిపోయి తెలంగాణాలో సొంతంగా వైఎస్సార్‌ తెలంగాణ పార్టీ పేరుతో రాజకీయ పార్టీని స్థాపించారు. ఆ విషయం కూడా ప్రస్తుతం ప్రాధాన్యం సంతరించుకున్నదే. ఒక వేళ కడప ఎంపీ అభ్యర్థి విషయంపై వివేకానందరెడ్డికి వేరే అభిప్రాయం ఉన్నా సరే రాజకీయంగా ఎలాంటి ప్రభావం చూపించదు.

2011లో పులివెందుల ఉప ఎన్నికల్లో విజయమ్మపై పోటీ చేసినప్పటి నుంచి వైఎస్సార్‌ కుటుంబ వ్యవహారాల్లో ఆయన పాత్ర పెద్దగా లేకుండా పోయింది. వైఎస్సార్‌సీపీ రాజకీయ నిర్ణయాల్లో కూడా ఆయన పాత్ర పెద్దగా ఏమీ లేదన్నది ఆంధ్రప్రదేశ్‌లో అందరికీ తెలిసిన విషయమే. వివేకానందరెడ్డిపై సానుకూల దృక్పథంతో వైఎస్‌ జగన్‌ ఆయన్ను వైఎస్సార్‌ జిల్లా పార్టీ ఇన్‌చార్జ్‌ చేశారు. కానీ వివేకా ఏనాడూ కూడా పార్టీ ముఖ్య నేతగా ఉండలేదు. 

4. ఎమ్మెల్సీ ఎన్నికలపై సీబీఐ చెప్పింది కట్టుకథే
సీబీఐ : 2017 ఎమ్మెల్సీ ఎన్నికల్లో వివేకా ఓటమికి అవినాశ్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డి, డి.శివశంకర్‌రెడ్డి కారణం. అవినాశ్‌రెడ్డి అనుచరుడు డి.శివశంకర్‌రెడ్డి ఎమ్మెల్సీగా పోటీ చేయాలని భావించినప్పటికీ వైఎస్‌ జగన్‌ తన చిన్నాన్న వివేకానందరెడ్డిని అభ్యర్థిగా ఎంపిక చేశారు. దాంతో అవినాశ్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డి, శివశంకర్‌రెడ్డి ఆ ఎన్నికల్లో వివేకా ఓటమికి పని చేశారు. దాంతో వివేకా ఆగ్రహంతో డి.శివశంకర్‌రెడ్డిని దూషించారు. 

వాస్తవం : స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో వివేకా ఓటమికి అవినాశ్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డి, శివ శంకర్‌రెడ్డి కారణమనడానికి సీబీఐ ఒక్క ఆధారాన్ని కూడా చూపించలేకపోయింది. ఆ ఎన్నికల్లో ఆ జిల్లాలోని 10 నియోజకవర్గాల పరిధిలోని 800 మందికిపైగా ఓటర్లలో ఎవర్ని ప్రలోభాలకు గురిచేశారో కూడా చెప్పలేకపోయింది. ఆ ఎన్నికల్లో గెలిచిన టీడీపీ అభ్యర్థి బీటెక్‌ రవితో సీబీఐ కనీసం మాట్లాడనే లేదు. ఆ ఎన్నికల్లో వివేకా ఓటమికి, ఆయన హత్యకు సంబంధం ఉన్నట్టుగా కూడా సీబీఐ ఎలాంటి ఆధారాన్ని చూపించనే లేదు.

రెండేళ్ల క్రితం నాటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో విషయంపై తలెత్తిన వివాదం వల్ల తమను దూషించారనే ఉద్దేశంతో 2019 ఎన్నికల ముందు హత్యకు ఎవరైనా ప్రయత్నిస్తారా? అందులోనూ 2014 ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిచిన అభ్యర్థి కుటుంబం 2019 ఎన్నికల ముందు హత్య వంటి దుందుడుకు పనులకు ఎందుకు ఒడిగడుతుంది? పైగా 2019 ఎన్నికల్లో 3.80 లక్షల ఓట్ల మెజార్టీతో గెలిచిన అవినాశ్‌ రెడ్డికి వివేకాతో రాజకీయంగా ఎలాంటి ఇబ్బంది ఉంటుంది? ఏమాత్రం ఉండదు. సీబీఐ తమ ఆరోపణకు ఒక్క ఆధారాన్ని కూడా చూపించలేకపోయింది.

వివేకా రెండో వివాహంతో ఆ కుటుంబంలో విభేదాలు 
షమీమ్‌ అనే మహిళను వివేకానందరెడ్డి రెండో వివాహం చేసుకోవడంతో ఆ కుటుంబంలో విభేదాలు తలెత్తాయి. వివేకా గుండెకు ఆపరేషన్‌ చేసుకున్నప్పటికీ ఆయన మొదటి భార్య సౌభాగ్యమ్మ పులివెందులలో ఉండటం లేదు. హైదరాబాద్‌లో తన కుమార్తె సునీత నివాసంలో ఉంటున్నారు. నెలకు ఒకట్రెండుసార్లు పులివెందుల వచ్చి వెళుతున్నారు. కుమార్తె సునీత ఏడాదికి ఒకట్రెండుసార్లు మాత్రమే వస్తున్నారు.

‘షమీమ్‌తో మా నాన్న సహజీవనం చేస్తున్నారని 2011లో బయటపటినప్పటి నుంచి ఆయనతో నేను సఖ్యతగా లేను. పులివెందులకు ఎప్పుడోగాని వెళ్లడం లేదు. 2018లో క్రిస్మస్‌ తర్వాత మళ్లీ నేను పులివెందుల వెళ్లనే లేదు. నా భర్త ఎన్‌.రాజశేఖర్‌రెడ్డి మాత్రం అప్పుడప్పుడు వెళుతుండేవారు’ అని సునీత చెప్పారు. వివేకానందరెడ్డి తన పేరును అక్బర్‌ఖాన్‌గా మార్చుకుని షమీమ్‌ను వివాహం చేసుకున్నారు. వారికి ఓ కుమారుడు ఉన్నారు. షమీమ్‌ కుటుంబం నిర్వహణ బాధ్యత చూస్తుండటంతోపాటు ఆమె చెల్లెళ్లకు పెళ్లిళ్లు చేశారు.

బలపనూరులో ఆమె ఇంటి పై అంతస్తును నిర్మించడంతోపాటు 8 సెంట్ల స్థలం కొనుగోలు చేశారు. ఇక వివేకానందరెడ్డి మొదటి భార్య సోదరులు తనను బెదిరించేవారని షమీమ్‌ సీబీఐకి చెప్పారు. పెద్ద భార్య పెద్ద సోదరుడు శివప్రకాశ్‌రెడ్డి తన ఇంటికి వచ్చి బెదిరించారని తెలిపారు. తన కుమారుడికి హైదరాబాద్‌ ఢిల్లీ పబ్లిక్‌ స్కూల్‌లో సీటు ఇప్పించడంతోపాటు అక్కడే ఓ ఇల్లు కొని ఇచ్చి.. ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ చేస్తానని వివేకా షమీమ్‌కు మాట ఇచ్చారు. కానీ అంతలోనే వివేకా హత్యకు గురయ్యారు.

అప్పటికే తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో వివేకా 
వివేకానందరెడ్డి షమీమ్‌ను రెండో వివాహం చేసుకోవడంతోపాటు ఆస్తి ఇస్తానని చెప్పడంతో మొదటి భార్య కుటుంబం ఆగ్రహించింది. కుటుంబానికి చెందిన కంపెనీల్లో ఆయనకు చెక్‌ పవర్‌ రద్దు చేసింది.చెక్‌పవర్‌ రద్దు కావడంతో వివేకా ఆర్థికంగా ఇబ్బందులు పడ్డారు. మద్యం, ఇతర అవసరాలకు కూడా చేతిలో డబ్బులు లేక అల్లాడిపోయారని వివేకా ఇంట్లో పనివానిగా ఉన్న పెందింటి రాజశేఖర్‌ చెప్పారు. ఆర్థిక ఇబ్బందులతోనే ఆయన సునీల్‌ యాదవ్, దస్తగిరిలతో సన్నిహితమయ్యారు. వారు చెప్పినట్టు చేస్తే వారిద్దరు డబ్బులు తెస్తారని ఎర్ర గంగిరెడ్డి వివేకాతో చెప్పేవారు.

ఎనిమిది మంది నుంచి రూ.5 కోట్లు అప్పు తీసుకున్నారు. ఓసారి పెందింటి రాజశేఖర్‌ వివేకానందరెడ్డి అల్లుడు నర్రెడ్డి రాజశేఖరరెడ్డికి ఫోన్‌ చేసి విషయం చెప్పారు. తమ ఇంట్లో డబ్బు కోసం ఏదో గొడవ జరుగుతోంది.. వివేకానందరెడ్డి బాగా తాగేసి గొడవ చేస్తున్నారని చెప్పారు. ‘మా నాన్న వివేకా ఇష్టానుసారంగా అప్పులు చేసి, తీర్చకపోవడంతో కంపెనీలు ఇబ్బందులు ఎదుర్కొన్నాయి.  ట్రాక్‌ రికార్డ్‌ సరిగా లేకపోవడంతో కంపెనీలకు బ్యాంకులు అప్పులు ఇచ్చేందుకు సుముఖత చూపలేదు.

కంపెనీల నిర్వహణకు బ్యాంకుల నుంచి రుణం తీసుకునేందుకు అడ్డంకిగా ఉండకూడదనే మా నాన్న చెక్‌ పవర్‌ను రద్దు చేశాం’ అని సునీత చెప్పారు. వాస్తవం ఏమిటంటే.. వివేకానందరెడ్డి హత్య తర్వాత ఆయన స్థానంలో సునీత ఆ కంపెనీల్లో డైరెక్టర్‌ అయ్యారు. జీవించి ఉండగా రోజువారి ఖర్చుల కోసం వివేకా ఇబ్బందులు పడ్డారు. కానీ ఆయన మరణించిన తర్వాత కొన్ని నెలలకే నర్రెడ్డి రాజశేఖర్‌రెడ్డి ఆ కంపెనీ అప్పులన్నీ చాలా వరకు తీర్చేశారు. కంపెనీలన్నీ గాడిలో పడ్డాయి. ఈ ఏడాది జనవరిలో 93 ఎకరాల భూమిని సౌభ్యాగమ్మ, సునీత పేరిట బదిలీ చేశారు. 

బయటి శక్తుల పాత్ర పట్టించుకోని సీబీఐ 
వివేకా హత్య కేసు విషయంలో సీబీఐ దర్యాప్తు ఇప్పటికీ ఎలాంటి స్పష్టత ఇవ్వనే లేదు. కుటుంబ విభేదాలు, రాజకీయంగా అడ్డుకునేందుకు యత్నించారంటూ సీబీఐ చెబుతున్న కారణాలేవీ కూడా నమ్మదగ్గవిగా లేవు. వాటికి ఎలాంటి ఆధారాలూ లేవు. అదే సమయంలో వివేకా కుటుంబంలో విభేదాలు, ఇతర అంశాలను కూడా లోతుగా దర్యాప్తు చేయాల్సి ఉంది.

మొత్తం ఉమ్మడి కుటుంబంలో విభేదాలు అనే అంశాన్నే సీబీఐ ప్రధానంగా ప్రస్తావిస్తుండటం కేవలం కేసును తప్పుదారి పట్టించేందుకేనని స్పష్టమవుతోంది. వివేకా హత్య వెనుక బయటి శక్తుల ప్రమేయంపై సీబీఐ ఇప్పటి వరకు దృష్టి సారించనే లేదు. ఇప్పటి వరకు కేవలం సీబీఐ అప్రూవర్‌గా మార్చిన నిందితుడు దస్తగిరి, వాచ్‌మేన్‌ రంగయ్య వాంగ్మూలాలనే ఆధారంగా చేసుకుని దర్యాప్తు చేస్తోంది. కానీ వారు నిజాలే చెబుతున్నారడానికి ఆధారం ఏమిటి?   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement