జల వివాదంపై ప్రధాని మోదీ, జలశక్తి మంత్రికి సీఎం జగన్‌ లేఖలు | AP CM YS Jagan Letter To PM Modi And Water Energy Minister On Water Dispute | Sakshi
Sakshi News home page

జల వివాదంపై ప్రధాని మోదీ, జలశక్తి మంత్రికి సీఎం జగన్‌ లేఖలు

Published Thu, Jul 1 2021 9:00 PM | Last Updated on Thu, Jul 1 2021 9:28 PM

AP CM YS Jagan Letter To PM Modi And Water Energy Minister On Water Dispute - Sakshi

సాక్షి, అమరావతి: జల వివాదంపై ప్రధాని మోదీ, జలశక్తి మంత్రి షెకావత్‌కు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వేర్వేరుగా లేఖలు రాశారు. జల వివాదంపై తక్షణం కేంద్రం జోక్యం చేసుకోవాలని సీఎం జగన్ కోరారు. విద్యుత్ ఉత్పత్తి కోసం అక్రమంగా తెలంగాణ వాడుకుంటున్న నీటిని నిలుపుదల చేయాలంటూ లేఖలో సీఎం పేర్కొన్నారు. కృష్ణా నదిపై రెండు రాష్ట్రాల మధ్య ఉన్న అన్ని ప్రాజెక్టులకు కేంద్ర బలగాలతో రక్షణ కల్పించాలని కోరారు.

‘‘విద్యుత్ ఉత్పత్తికి నీటిని విడుదల చేయొద్దన్న ఆదేశాలున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా తెలంగాణ నీటిని విడుదల చేస్తోంది. ఈ చర్యలు అంతర్రాష్ట్ర సంబంధాలపై తీవ్ర ప్రభావం చూపేలా ఉన్నాయి. కింది ప్రాంతాల హక్కులను కాలరాసేలా తెలంగాణ చర్యలున్నాయి. తెలంగాణ చర్యల వల్ల రాయలసీమతో పాటు నెల్లూరు, ప్రకాశం జిల్లాల తాగునీరుకు కూడా సమస్యలు తలెత్తుతాయి. ఎలాంటి వ్యవసాయ అవసరాలు లేకున్నా నిబంధనలకు విరుద్ధంగా తెలంగాణ నీళ్లను వాడుకుంటోందని’’ సీఎం జగన్‌ లేఖలో పేర్కొన్నారు.

విద్యుత్‌ ఉత్పత్తి వద్దన్న కృష్ణా రివర్‌ బోర్దు ఆదేశాలను తెలంగాణ ప్రభుత్వం బేఖాతరు చేస్తోంది. తెలంగాణ అక్రమ వాడకంపై జూన్‌ 10న ఫిర్యాదు చేశాం. దీనిపై కృష్ణా రివర్‌ బోర్డు తెలంగాణకు లేఖ రాసింది. తక్షణం విద్యుదుత్పత్తి నిలిపివేయాలని బోర్డు తెలంగాణకు సూచించింది. బోర్డు ఆదేశాలను తెలంగాణ పూర్తిగా బేఖాతరు చేసింది. జూన్‌ 23న, 29న మరోసారి కృష్ణా బోర్డు ఆదేశాలిచ్చింది. అక్రమంగా చేస్తున్న నీళ్ల వాడకం ఆపాలని తెలంగాణకు సూచించింది. కృష్ణా రివర్‌ బోర్డు ఆదేశాలిచ్చినా తెలంగాణ పట్టించుకోవడం లేదని’’ సీఎం జగన్‌ లేఖలో పేర్కొన్నారు.

‘‘శ్రీశైలం ప్రాజెక్టులో 834 ఫీట్ల వరకు నీళ్లు ఉంటేనే విద్యుదుత్పత్తికి నీళ్లు వాడుకోవాలి. ప్రస్తుతం శ్రీశైలంలో కేవలం 808 ఫీట్ల వరకే నీళ్లున్నాయి. 33 టీఎంసీలు తక్కువగా ఉన్నా.. తెలంగాణ నీళ్లు వాడేస్తోంది. వాళ్ల ప్రాంతంలో పవర్‌ హౌజ్‌ ఉంది కాబట్టి ఇష్టానుసారంగా విద్యుదుత్పత్తి పేరిట నీళ్లు వాడుతున్నారు. ప్రతీ రోజు తెలంగాణ 2 టీఎంసీల నీటిని విడుదల చేస్తోంది. కేఆర్‌ఎంబీ పరిధిని స్పష్టంగా నిర్వహించాలి. కేఆర్‌ఎంబీ పరిధిని నోటిఫై చేయాలని’’ లేఖలో సీఎం జగన్‌ కోరారు.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement