మంగళవారం భువనేశ్వర్‌లో ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్‌కు జ్ఞాపికను అందజేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
సత్ఫలితాలపై విశ్వాసం
ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్‌కు ధన్యవాదాలు. సాదరంగా ఆహ్వానించి సుహృద్భావ వాతావరణంలో చర్చలు జరిపినందుకు సంతోషంగా ఉంది. ఇవి త్వరలో సత్ఫలితాలనిస్తాయని విశ్వసిస్తున్నా.
– సీఎం వైఎస్ జగన్ ట్వీట్
ఫలవంతమైన చర్చలు..
ఏపీ సీఎం వైఎస్ జగన్‌తో సమావేశమవడం ఆనందంగా ఉంది. రెండు రాష్ట్రాల ఉమ్మడి ప్రయోజనాలే లక్ష్యంగా జలవనరులు, సరిహద్దు, విద్యుత్ తదితర అంశాలను పరిష్కరించుకోవడంపై చర్చించాం. ఫలవంతమైన చర్చలు జరిగాయి. మావోయిస్టు కార్యకలాపాల నియంత్రణకు కలిసికట్టుగా పని చేయాలని నిర్ణయించాం.
– ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ ట్వీట్
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్, ఒడిశా మధ్య దాదాపు ఆరు దశాబ్దాలుగా అపరిష్కృతంగా ఉన్న సమస్యల పరిష్కారంలో నిర్మాణాత్మకమైన ముందడుగు పడింది. ఇరు రాష్ట్రాల మధ్య దీర్ఘకాలికంగా నలుగుతున్న వంశధార, జంఝావతి జల వివాదాలు, సరిహద్దు సమస్య.. బలిమెల, అప్పర్ సీలేరులో జలవిద్యుత్ ప్రాజెక్టులకు సంబంధించిన ఎన్‌వోసీలు తదితర అంశాలపై రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య సుహృద్భావ వాతావరణంలో చర్చలు జరిగాయి. ఉభయ రాష్ట్రాల ప్రజల విశాల ప్రయోజనాలే లక్ష్యంగా సమస్యలను పరస్పర సహకారంతో పరిష్కరించుకోవాలని సీఎంలు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, నవీన్ పట్నాయక్ నిర్ణయించారు. మావోయిస్టు కార్యకలాపాలను నియంత్రించడంతోపాటు గంజాయి సాగు, అక్రమ రవాణాను నివారించేందుకు సమష్టిగా కృషి చేయాలని నిశ్చయించారు. దీర్ఘకాలంగా ఉన్న సమస్యల పరిష్కారానికి ఇరు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో జాయింట్ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు చర్చల అనంతరం ఇద్దరు సీఎంలు విడుదల చేసిన సంయుక్త ప్రకటనలో తెలిపారు.
పొరుగు రాష్ట్రాలతో స్నేహపూర్వక సంబంధాలను ఆకాంక్షిస్తున్న సీఎం జగన్ ఒడిశాతో దశాబ్దాలుగా నెలకొన్న సమస్యలకు పరిష్కార మార్గాలను అన్వేషిస్తున్నారు. ఈ క్రమంలోనే ఒడిశా పర్యటన తలపెట్టారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి మంగళవారం ఉదయం 11 గంటలకు గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న ముఖ్యమంత్రి జగన్ తొలుత శ్రీకాకుళం జిల్లా పాతపట్నం చేరుకుని ఎమ్మెల్యే రెడ్డి శాంతి కుమార్తె వివాహ రిసెప్షన్‌కు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. అనంతరం అక్కడి నుంచి విశాఖ వెళ్లి భువనేశ్వర్ చేరుకున్నారు.
ఒడిశాలో ఘన స్వాగతం..
భువనేశ్వర్ విమానాశ్రయం నుంచి నేరుగా ఒడిశా స్టేట్ గెస్ట్ హౌస్‌కు చేరుకున్న సీఎం వైఎస్ జగన్‌కు తెలుగు సంఘాల ప్రతినిధులు స్వాగతం పలికారు. ఒడిశాతో చర్చించాల్సిన అంశాలపై సీఎం జగన్ అధికారులతో మరోదఫా సమావేశమై సమీక్షించారు. అక్కడి నుంచి ఒడిశా సచివాలయమైన లోక్‌సేవా భవన్ కన్వెన్షన్ సెంటర్‌కు చేరుకున్న ముఖ్యమంత్రి జగన్‌కు ఒడిశా సీఎం నవీన్‌పట్నాయక్ ఎదురేగి పుష్ఫగుచ్చం అందించి ఆత్మీయంగా ఆహ్వానించారు. సీఎం జగన్‌కు శాలువ కప్పి సత్కరించి /ê్ఞపికను అందజేశారు. ఇందుకు కృతజ్ఞతలు తెలియచేస్తూ ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్‌కు శాలువా కప్పి సత్కరించిన సీఎం వైఎస్ జగన్ ఆయనకు వెంకటేశ్వరస్వామి చిత్రపటాన్ని బహూకరించారు. తిరుమల శ్రీవారి ప్రసాదాలను అందజేశారు. అనంతరం కాన్ఫరెన్స్ హాల్‌లో రెండు రాష్ట్రాల సీఎంలు, ఇరు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, డీజీపీలు, రెవెన్యూ, జలవనరులు, ఇంధన తదితర శాఖల కార్యదర్శులతో ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్‌తో జరిగిన సమావేశంలో మాట్లాడుతున్న సీఎం వైఎస్ జగన్
ఇరు రాష్ట్రాల ప్రజల ప్రయోజనాలే లక్ష్యంగా..
► వంశధారలో 75 శాతం నీటి లభ్యత ఆధారంగా ఉన్న 115 టీఎంసీలను చెరి సగం పంపిణీ చేసి వినియోగించుకుంటే రెండు రాష్ట్రాల్లో వెనుకబడిన ప్రాంతాలు సస్యశ్యామలమవుతాయని సీఎం వైఎస్ జగన్ తెలిపారు. ఇందుకు నేరడి బ్యారేజీ దోహదం చేస్తుందని, బ్యారేజీ నిర్మాణానికి సహకరించాలని ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్‌ను కోరారు.
► జంఝావతిలో లభ్యతగా ఉన్న 8 టీఎంసీల్లో చెరి సగం వాడుకునేలా రెండు రాష్ట్రాల మధ్య కుదిరిన ఒప్పందం మేరకు ప్రాజెక్టు నిర్మాణం చేపట్టామని సీఎం వైఎస్ జగన్ చెప్పారు. ఒడిశాలో ముంపునకు గురయ్యే భూమి, ఇళ్లు కోల్పోయే నిర్వాసితులకు నష్టపరిహారం చెల్లిస్తామన్నారు. ఒడిశా ప్రభుత్వం వాటిని సేకరించి ఇస్తే రబ్బర్ డ్యామ్ స్థానంలో కాంక్రీట్ డ్యామ్ నిర్మాణాన్ని చేపట్టి జంఝావతి ద్వారా పూర్తి స్థాయిలో 24,500 ఎకరాల ఆయకట్టుకు నీళ్లందించడానికి వీలవుతుందని వివరించారు.
► పోలవరం ప్రాజెక్టులో గరిష్ట స్థాయిలో అంటే 45.72 మీటర్లలో 194.6 టీఎంసీలను
నిల్వ చేసినా ఒడిశాలో ముంపు సమస్య తలెత్తకుండా సీలేరు, శబరిపై రక్షణ గోడలు(కరకట్టలు) నిర్మిస్తామని, ఇందుకు సహకరించాలని ఒడిశాను సీఎం వైఎస్ జగన్ కోరారు. బాహుదా రిజర్వాయర్ నుంచి ఇచ్చాపురానికి నీటి విడుదలపై నవీన్ పట్నాయక్‌తో చర్చించారు.
► బలిమెల, అప్పర్ సీలేరులో విద్యుత్ ప్రాజెక్టుల నిర్మాణంపై ఒడిశాతో సీఎం జగన్ చర్చించారు.
► రెండు రాష్ట్రాల సరిహద్దులో కొఠియా గ్రామాల సమస్యను సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవాలని ఇద్దరు సీఎంలు నిర్ణయించారు.
► సరిహద్దు జిల్లాల్లోని విద్యా సంస్థల్లో ఒడిశాలో తెలుగు, ఏపీలో ఒడియాకు సంబంధించి లాంగ్వేజ్ టీచర్ల నియామకం, పాఠ్యపుస్తకాల పంపిణీ చేపట్టాలని, రెండు రాష్ట్రాల ప్రజల మధ్య సోదరభావం పెంపొందించేలా కృషి చేయాలని నిర్ణయించారు. ఈ దిశగా శ్రీకాకుళం జిల్లాలోని డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్, ఒడిశాలోని బరంపురం విశ్వవిద్యాలయాల ద్వారా చర్యలు తీసుకోనున్నారు.
సమస్యల పరిష్కారానికి జాయింట్ కమిటీ
దీర్ఘకాలిక సమస్యల పరిష్కారానికి రెండు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో జాయింట్ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు సమీక్ష అనంతరం ఇద్దరు సీఎంలు సంయుక్త ప్రకటన జారీ చేశారు. జాయింట్ కమిటీ సమస్యల మూలాల్లోకి వెళ్లి పరిష్కార మార్గాలను అన్వేషిస్తుందని చెప్పారు. మావోయిస్టు కార్యకలాపాల నియంత్రణ, గంజాయి సాగు, రవాణా నివారణపై సహకారాన్ని కొనసాగిస్తూ కలసికట్టుగా ఎదుర్కొంటామని ఇద్దరు సీఎంలు తెలిపారు. సుదీర్ఘకాలంగా రెండు రాష్ట్రాల మధ్య నలుగుతున్న అంశాల పరిష్కారంలో అడుగు ముందుకేసినట్లు ప్రకటించారు. రెండు రాష్ట్రాల ప్రజల విశాల ప్రయోజనాలే ధ్యేయంగా సమస్యలను కలిసికట్టుగా, సహకార ధోరణిలో పరిష్కరించుకుంటామన్నారు. సమస్యల పరిష్కారం కోసం చర్చలు జరపడమే కాకుండా జాయింట్ కమిటీ ఏర్పాటుకు ముందుకు వచ్చినందుకు ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్, ఆ రాష్ట్ర ప్రభుత్వానికి, అధికారులకు సీఎం వైఎస్ జగన్ ధన్యవాదాలు తెలిపారు.
ఒడిశాలో తెలుగు అసోసియేషన్ సభ్యులతో సీఎం జగన్
లోక్‌సేవా భవన్ వద్ద సాదరంగా వీడ్కోలు..
ఉన్నత స్థాయి సమీక్ష ముగిసిన తర్వాత ఒడిశా సచివాలయం లోక్‌సేవా భవన్ పై అంతస్తులో ఉన్న కాన్ఫరెన్స్ హాల్ నుంచి లిఫ్ట్‌లో ఇద్దరు సీఎంలు నవీన్ పట్నాయక్, సీఎం వైఎస్ జగన్ కిందకు చేరుకున్నారు. ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ లోక్‌సేవా భవన్ నుంచి వెలుపలికి వచ్చి అభివాదం చేస్తూ ముఖ్యమంత్రి జగన్‌కు సాదరంగా వీడ్కోలు పలికారు. సీఎం జగన్ వెంట డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్, సీఎస్ సమీర్‌శర్మ, డీజీపీ గౌతమ్ సవాంగ్, రెవెన్యూ, జలవనరులు శాఖ కార్యదర్శులు ఉషారాణి, జె.శ్యామలరావు తదితరులున్నారు.
రెండు రాష్ట్రాల అధికారుల భేటీ..
సీఎం వైఎస్ జగన్ భువనేశ్వర్ పర్యటనకు ముందుగానే సీఎస్ సమీర్ శర్మ నేతృత్వంలోని రాష్ట్ర అధికారుల బృందం అక్కడకు చేరుకుంది. ఒడిశా సీఎస్ సురేష్‌చంద్ర మహాపాత్ర నేతృత్వంలోని అధికారుల బృందంతో సమావేశమై పలు అంశాలపై చర్చించింది.
చరిత్రాత్మక ఘట్టం: డిప్యూటీ సీఎం కృష్ణదాస్
శ్రీకాకుళం (పీఎన్‌కాలనీ): ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు నేరడి బ్యారేజీ నిర్మాణంతో పాటు పలు అంశాలపై చర్చించడం చరిత్రాత్మక ఘట్టమని డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ పేర్కొన్నారు. దశాబ్దాలుగా కొనసాగుతున్న జలవివాదానికి సానుకూల పరిష్కారం కుదిరిందన్నారు. వంశధారపై నేరడి బ్యారేజ్ నిర్మాణం, విజయనగరం జిల్లా జంఝావతి ప్రాజెక్టు, కొటియా గ్రామాల అంశాలపై చర్చించడం శుభ పరిణామన్నారు. నేరడి బ్యారేజ్ నిర్మాణం పూర్తయితే శ్రీకాకుళం జిల్లా ఉభయ గోదావరి జిల్లాల సరసన నిలుస్తుందన్నారు. 1962లో నదీ జలాల విషయంలో సమావేశం జరిగిందని గుర్తు చేశారు. అనంతరం దివంగత వైఎస్సార్ హయాంలో వంశధార 2వ దశ పనులకు ముందడుగు పడిందని తెలిపారు.
ఆరు దశాబ్దాల కల: స్పీకర్ తమ్మినేని
సిక్కోలు ప్రజల ఆరు దశాబ్దాల కలను నిజం చేసేందుకు సీఎం జగన్‌మోహన్‌రెడ్డి అడుగులు వేయడం హర్షణీయమని స్పీకర్ తమ్మినేని సీతారాం చెప్పారు. వెనుకబడిన శ్రీకాకుళం జిల్లాపై సీఎంకు ఏ స్థాయిలో అభిమానం ఉందో ఈ భేటీ స్పష్టం చేసిందని తెలిపారు. సిక్కోలు ప్రజలు జీవిత కాలం ఆయనకు రుణపడి ఉంటారన్నారు. ఒడిశా సీఎం సానుకూలంగా స్పందించి కమిటీ ద్వారా ఇరు రాష్ట్రాల అభివృద్ధికి సహకరించేందుకు ముందుకు రావడంపై ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment