సాక్షి, అమరావతి: ఆంధ్రజ్యోతి పత్రికకు రాష్ట్రంలోని 13 జిల్లాల కలెక్టర్లు లీగల్ నోటీసులు ఇచ్చారు. ఆ పత్రిక ఎండీ రాధాకృష్ణ సహా మరో ముగ్గురు బాధ్యులకు శనివారం ఈ నోటీసులను పంపారు. ఈ మేరకు స్టేట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ శ్రీనివాస్‌రెడ్డి లీగల్ నోటీసులు పంపారు. హనీ ట్రాప్‌ను ఆపాదిస్తూ ఇద్దరు కలెక్టర్ల కహానీ పేరుతో నిరాధార వార్తా కథనం పచురణపై జిల్లా కలెక్టర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కథనం కలెక్టర్ల వ్యవస్థపై ఉద్దేశపూర్వక దాడి అని కలెక్టర్లు మండిపడ్డారు. కలెక్టర్లు అందరూ కలిసి చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నామని తెలిపారు. కరోనా లాంటి విపత్కర సమయంలో సంక్షేమ పథకాల ద్వారా అనేక వర్గాలను ఆదుకున్నామని పేర్కొన్నారు. (‘హనీ ట్రాప్’ కథనంపై కలెక్టర్ల ఆగ్రహం)
అర్హులకు వాటిని అందించడంలో, అవినీతి లేకుండా పారదర్శకంగా పథకాలను అమలు చేయడంలో కలెక్టర్లు కీలక పాత్ర పోషిస్తున్నారని చెప్పారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలతో, వినూత్న నిర్ణయాలతో ప్రజలకు అత్యంత చేరువగా పాలన అందించడం ద్వారా దేశంలోనే ఏపీలో కలెక్టర్ల వ్యవస్థకు మంచి పేరు వచ్చిందని గుర్తు చేశారు. దేశానికి ఆదర్శంగా ఏపీ కలెక్టర్ల వ్యవస్థ తయారైందని పేర్కొన్నారు. అలాంటి కలెక్టర్ల వ్యవస్థపై కుట్రపూరిత ఆలోచనతోనే ఆంధ్రజ్యోతి తప్పుడు కథనాలతో దాడి చేస్తోందని మండిపడ్డారు. తమ ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేందుకే నిరాధార కథనాలని దురుద్దేశపూర్వకంగా వండి వారుస్తున్నారని కలెక్టర్లు తెలిపారు. తమ కుటుంబాల్లో కూడా ఈ కథనాలపై విస్తృతమైన చర్చ సాగుతోందని వివరించారు. తమ కుటుంబ సభ్యులు తీవ్రంగా బాధపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
కష్టపడి పని చేస్తున్న తమపై ఆధారాలు లేకుండా, అనైతిక ఆలోచనలతో మసాలా వార్తలు ప్రచురిస్తున్నారని అన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇలాంటి తీరు గర్హనీయం. పరిధులు దాటి, విశృంఖల కోణంలో ఈ కథనాలున్నాయని మండిపడ్డారు. కలెక్టర్లను మానసికంగా దెబ్బతీసి కొందరికి ఇతోధిక ప్రయోజనాలు కల్పించాలన్న కుట్రకోణం ఇందులో కనిపిస్తోందన్నారు. వీటిని చూస్తూ ఊరుకుంటే కలెక్టర్లు స్వేచ్ఛగా పని చేయలేరని అన్నారు. అందుకే చట్ట ప్రకారం ముందుకు వెళ్తామని కలెక్టర్లు తెలియజేశారు.
Comments
Please login to add a commentAdd a comment