ఈఏపీ సెట్‌లో బాలురు భళా | AP EAPSET Results Released | Sakshi
Sakshi News home page

ఈఏపీ సెట్‌లో బాలురు భళా

Published Wed, Jun 12 2024 5:52 AM | Last Updated on Wed, Jun 12 2024 5:52 AM

AP EAPSET Results Released

ఇంజనీరింగ్‌ విభాగంలో టాప్‌–10 ర్యాంకులు కైవసం

ఉత్తీర్ణత శాతంలో అమ్మాయిలదే హవా

అగ్రికల్చర్‌ విభాగం టాప్‌ 

టెన్‌లో ఆరుగురు బాలురు, నలుగురు అమ్మాయిలు

ఇంజనీరింగ్‌లో మాకినేని జిష్ణు సాయికి ప్రథమ ర్యాంకు

అగ్రికల్చర్‌ విభాగంలో టాపర్‌గా తెలంగాణ కుర్రోడు శ్రీశాంత్‌రెడ్డి

అడ్వాన్స్‌డ్‌లో 3వ ర్యాంకు సాధించిన సందేశ్‌కు ఈఏపీసెట్‌లోనూ అదే ర్యాంకు

ఇంజనీరింగ్‌లో సీట్లకు మించి అర్హత సాధించిన విద్యార్థులు

ఏపీ ఈఏపీసెట్‌ ఫలితాలు విడుదల

సాక్షి, అమరావతి/గుంటూరు (ఎడ్యుకేషన్‌)/పుల్లలచెరువు/బలిజిపేట/ఆదోని సెంట్రల్‌: ఆంధ్రప్రదేశ్‌లో బీటెక్, బీఫార్మసీ, బీఎస్సీ అగ్రికల్చర్, బీఎస్సీ హార్టికల్చర్, ఫార్మ్‌ డీ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించిన ఏపీ ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కామన్‌ ఎంట్రెన్స్‌ టెస్ట్‌ (ఏపీ ఈఏపీసెట్‌) ఫలితాల్లో అబ్బాయిలు సత్తా చాటారు. ఇంజనీరింగ్‌ విభాగంలో టాప్‌ టెన్‌ ర్యాంకులను కొల్లగొట్టారు. అగ్రికల్చ­ర్‌ విభాగంలో టాప్‌ టెన్‌లో ఆరుగురు అ­బ్బా­యిలు, నలుగురు అమ్మాయిలు ర్యాంకులు సాధించారు. ఇంజనీరింగ్‌ విభాగంలో గుంటూరుకు చెందిన మాకి­నేని జిష్ణు సాయి 97 మార్కులతో ప్రథమ ర్యాంకు దక్కించుకున్నాడు. 

అగ్రికల్చర్‌ విభాగంలో హైదరాబాద్‌కు చెందిన ఎల్లు శ్రీశాంత్‌రెడ్డి 93.44 మార్కులతో మొదటి ర్యాంకు సా­ధించాడు. విజయవాడలో మంగళవారం ఉన్నత విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి శ్యా­మ­లరావు ఏపీ ఈఏపీసెట్‌ ఫలితాలను విడు­దల చేశారు. ఇంజనీరింగ్‌ విభాగంలో గతేడాదితో పోలిస్తే అత్యధికంగా 24వేల మందికిపైగా ఉత్తీర్ణత సాధించారు. టాప్‌ టెన్‌లో 8 మంది ఏపీ విద్యార్థులు కాగా ఇద్దరు తెలంగాణకు చెందినవారున్నారు. ఈఏపీసెట్‌కు 3,62,851 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇంజనీరింగ్‌ విభాగానికి 2,74,213 మంది రిజిస్టర్‌ చేసుకోగా 2,58,374 మంది పరీక్షకు హాజరయ్యారు. ఇందులో 1,95,092 (75.51 శాతం) మంది ఉత్తీర్ణులయ్యారు. 

అగ్రికల్చర్‌ విభాగంలో 88,638 మంది దరఖాస్తు చేసుకుంటే 80,766 మంది పరీక్ష రాశారు. వీరిలో 70,352 (87.11 శాతం) మంది అర్హత సాధించారు. తెలంగాణ ఈఏపీ సెట్‌లో రెండు విభాగాల్లోనూ టాప్‌–10లో నిలిచిన­­ వారిలో నలుగురు విద్యార్థులు చొప్పున ఏపీ ఈఏపీసెట్‌లోనూ ర్యాంకులు సాధించడం విశేషం. జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో జాతీయ స్థాయిలో 3వ ర్యాంకు సాధించిన నంద్యాల జిల్లా గోస్పాద మండలం నెహ్రూనగర్‌కు చెందిన భోగలపల్లి సందేశ్‌ తెలంగాణ ఈఏపీసెట్‌లో 4వ ర్యాంకు సాధించగా తాజాగా ఏపీ ఈఏపీసెట్‌లో 3వ ర్యాంకు దక్కించుకున్నాడు. 

గతేడాది మాదిరిగానే ఇంజనీరింగ్‌కు అత్యధికంగా బాలురు, అగ్రికల్చర్‌ వైపు బాలికలు మొగ్గు చూపారు. వెబ్‌సైట్‌లో ర్యాంకు కార్డులను అందుబాటులో ఉంచామని, త్వరలోనే కౌన్సెలింగ్‌ షెడ్యూ­ల్‌ను ప్రకటిస్తామని తెలిపారు. వీలైనంత వేగంగా ప్రవేశాలు కల్పించి.. తరగతులను నిర్వహించేలా చర్యలు చేపడతామన్నారు.   

25 శాతం వెయిటేజీతో ర్యాంకులు
మే 16 నుంచి 23 వరకు కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌ (సీబీటీ) విధానంలో ఈఏపీసెట్‌ పరీక్షలను నిర్వహించినట్టు సెట్‌ చైర్మన్, జేఎన్‌టీయూ–కాకినాడ వీసీ ప్రసాదరాజు చెప్పారు. ఈఏపీసెట్‌ పూర్తయిన అనంతరం ప్రాథమిక కీ విడుదల చేశామన్నారు. విద్యార్థుల నుంచి అభ్యంతరాలను స్వీకరించేందుకు కీ అబ్జర్వేషన్స్‌ వెరిఫికేషన్‌ కమిటీని నియమించామన్నారు. ఇందులో కేవలం మూడు ప్రశ్నలకు మాత్రమే పూర్తి మార్కులు కేటాయించామన్నారు. 

రాష్ట్రంలో రెగ్యులర్‌ ఇంటర్మీడి­యెట్‌లో ఉత్తీర్ణులై ఈఏపీసెట్‌లో అర్హత సా«­దిం­చిన వారందరికీ ఇంటర్‌ మార్కుల ఆధారంగా 25 శాతం వెయిటేజీ ఇచ్చి ర్యాంకులు ప్రకటించామని తెలిపారు. కార్యక్రమంలో ఉన్నత విద్యామండలి చైర్మన్‌ (ఇన్‌చార్జి) కె.రామ్మోహనరావు, వైస్‌ చైర్‌పర్సన్‌ ఉమామహేశ్వరిదేవి, సెట్స్‌ ప్రత్యేక అధికారి సు«దీర్‌రెడ్డి, సెట్‌ కనీ్వనర్‌ వెంకటరెడ్డి, సాంకేతిక విద్యాశాఖ జేడీ పద్మారావు పాల్గొన్నారు.   

సీట్లకు మించిన ఉత్తీర్ణత 
రాష్ట్రంలో ఇంజనీరింగ్‌ సీట్లు 1.60 లక్షలు ఉండగా ఈ ఏడాది అత్యధికంగా 1.95 లక్షల మందికిపైగా ఉత్తీర్ణత సాధించారు. బాలుర కంటే బాలికలే ఉత్తీర్ణతలో ముందు­న్నారు. 1,48,696 మంది బాలురు పరీక్ష రాస్తే 1,09,926 (73.93 శాతం) మంది, 1,09,678 మంది బాలికలు పరీక్ష రాస్తే 85,166 (77.65 శాతం) ఉత్తీర్ణులయ్యారు.

జిష్ణుసాయికి ప్రథమ ర్యాంకు 
ఏపీ ఈఏపీసెట్‌ ఇంజనీరింగ్‌ విభాగంలో గుంటూరు నగరానికి చెందిన మాకినేని జిష్ణుసాయి మొదటి ర్యాంకు సాధించి సత్తా చాటాడు. జేఈఈ అడ్వాన్స్‌డ్‌ ఫలితాల్లో అఖిల భారత స్థాయిలో 62వ ర్యాంకు సాధించాడు. గుంటూరు నగరానికి చెందిన మరో విద్యార్థి కోమటినేని మనీష్‌ చౌదరికి ఈఏపీసెట్‌లో 5వ ర్యాంకు లభించింది.

సాయి యశ్వంత్‌రెడ్డికి రెండో ర్యాంక్‌ 
6వ తరగతి నుంచి ఇంటర్‌ వరకు గుంటూరులోనే చదివిన కర్నూలుకు చెందిన మరో విద్యార్థి సాయి యశ్వంత్‌రెడ్డికి ఈఏపీసెట్‌ ఇంజనీరింగ్‌ విభాగంలో 2వ ర్యాంకు లభించింది. ఇటీవల జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో 50వ ర్యాంకు దక్కించుకున్నాడు. తనది చాలా పేద కుటుంబమని.. ఐఐటీ బాంబేలో ఇంజనీరింగ్‌ చదువుతానని యశ్వంత్‌ తెలిపాడు.

 జీవితంలో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా స్థిరపడడమే తన లక్ష్యమని వెల్లడించాడు.  సందేశ్‌కు మూడో ర్యాంక్‌ కర్నూలు జిల్లా ఆదోని పట్టణానికి చెందిన బి.రామసుబ్బారెడ్డి, వి.రాజేశ్వరిల కుమారుడు బి.సందేశ్‌ ఏపీఈసెట్‌ ఇంజనీరింగ్‌ విభాగంలో రాష్ట్రస్థాయిలో 3వ ర్యాంకు సాధించాడు. 

ఇటీవల విడుదలైన జేఈఈ అడ్వాన్స్‌డ్‌లోనూ అఖిల భారత స్థాయిలో 3వ ర్యాంకును సాధించడం విశేషం. సందేశ్‌ 8వ తరగతి నుంచి ఇంటర్‌ వరకు హైదరాబాద్‌ నారాయణ కళాశాలలో పూర్తి చేశాడు. ఐఐటీ బాంబేలో కంప్యూటర్‌ సైన్స్‌ చదువుతానని తెలిపాడు. ఆ తర్వాత సివిల్స్‌ రాసి ఐఏఎస్‌ కావాలన్నదే తన లక్ష్యమన్నాడు. 

ఇద్దరికి 10వ ర్యాంక్‌ 
ప్రకాశం జిల్లా పుల్లలచెరువు మండలం అక్కపాలెం గ్రామానికి చెందిన కొమిరిశెట్టి ప్రభాస్‌ 10వ ర్యాంకు కైవసం చేసుకున్నా­డు. అతడి తండ్రి కొమ్మరిశెట్టి పోలయ్య గుం­టూరు మిర్చి యార్డులో పనిచేస్తు­న్నారు. పార్వతీపురం మన్యం జిల్లా బలిజిపేట మండలం చిలకలపల్లికి చెందిన నగుదాసరి రాధాకృష్ణ ఈఏపీసెట్‌ అగ్రికల్చర్‌ విభాగంలో 10వ ర్యాంకు సాధించాడు. కుమారుడు మంచి ర్యాంకు సాధించడంతో వ్యవసాయ కుటుంబానికి చెందిన తల్లిదండ్రులు నారాయణరావు, కృష్ణవేణి సంతోషం వ్యక్తం చేశారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement