కొలువుల చదువులు.. డిగ్రీ పూర్తయిన వెంటనే ఉద్యోగం పొందేలా | AP Government Mulls Internship Programme For UG, PG Students | Sakshi
Sakshi News home page

కొలువుల చదువులు.. డిగ్రీ పూర్తయిన వెంటనే ఉద్యోగం పొందేలా

Published Mon, Nov 22 2021 10:38 AM | Last Updated on Mon, Nov 22 2021 10:56 AM

AP Government Mulls Internship Programme For UG, PG Students - Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్ర విద్యారంగంలో ఉన్నత ప్రమాణాలు నెలకొల్పేందుకు అనేక సంస్కరణలు తీసుకువచ్చిన సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి.. వాటి ఫలాలు విద్యార్థులకు అందేలా కార్యాచరణ రూపొందించారు. డిగ్రీ  పూర్తి చేసి కాలేజీల నుంచి బయటకు వచ్చే విద్యార్థులు వెంటనే ఉద్యోగావకాశాలను అందుకొనేలా పూర్తిస్థాయి సామర్థ్యాలు, నైపుణ్యాలతో తీర్చిదిద్దేలా ప్రణాళికలను అమల్లోకి తెస్తున్నారు. డిగ్రీలో నాలుగేళ్ల ఆనర్స్‌ కోర్సులతో పాటు ఇంటర్న్‌షిప్‌ను తప్పనిసరి చేయించారు. మూడేళ్ల డిగ్రీలో చేరే విద్యార్థులు కూడా పదినెలలు ఇంటర్న్‌షిప్‌ చేసేలా కోర్సులను రూపొందించారు. విద్యార్థులకు పూర్తిస్థాయిలో నైపుణ్యం పొందేలా క్షేత్రస్థాయిలో శిక్షణ ఇప్పిస్తారు.
చదవండి: AP పటిష్టంగా ఫౌండేషన్‌.. మూడు దశల్లో స్కూళ్ల మ్యాపింగ్‌ ప్రక్రియ

ఇందుకు రాష్ట్రంలోని అన్ని కాలేజీలను వివిధ పరిశ్రమలు, ఐటీ సంస్థలు, ప్రముఖ వాణిజ్య సంస్థలతో సహా కోర్సులతో సంబంధమున్న 27,119 సంస్థలతో అనుసంధానిస్తున్నారు. విద్యార్థులు తమ కోర్సులతో సంబంధమున్న అంశాల్లో అందుబాటులో ఉన్న సంస్థలో ఇంటర్న్‌షిప్‌ చేయవచ్చు. ఇందుకు ఉన్నత విద్యామండలి పోర్టల్‌లోని లెర్నింగ్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్‌ (ఎల్‌ఎంఎస్‌)లో వీటిని పొందుపరుస్తారు. జిల్లాలవారీగా ఈ సంస్థలను ఎంపిక చేసి జాబితాను వెబ్‌సైట్లో పెడతారు. జిల్లాల్లో ఆయా సంస్థలతో సమన్వయం చేసేందుకు జిల్లా కలెక్టర్, జాయింట్‌ కలెక్టర్ల ఆధ్వర్యంలో ప్రత్యేక కమిటీలను ప్రభుత్వం ఏర్పాటుచేస్తోంది.

ఇందులో వర్సిటీల ఉపకులపతులు, కొన్ని కాలేజీల ప్రిన్సిపాళ్లు, ఇతర అధికారులు సభ్యులుగా ఉంటారు. ఈ కమిటీలు ముందుగానే జిల్లాలోని కంపెనీలను సంప్రదించి, ఇంటర్న్‌షిప్‌కు ఏర్పాట్లు చేస్తాయి. ఇంటర్న్‌షిప్‌ కోసం విద్యార్థులు కోఆర్డినేటర్ల సహకారంతో ఆయా సంస్థలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆ సంస్థలు వాటికి అవసరమైన సంఖ్యలో విద్యార్థులకు ఇంటర్న్‌షిప్‌లో అవకాశం కల్పిస్తాయి.
చదవండి: మన టాయిలెట్స్‌లాగే బడిలోనివీ శుభ్రంగా ఉండాలి.. సీఎం జగన్‌ ట్వీట్‌

మైక్రో నుంచి మెగా సంస్థల వరకు..
ఇంటర్న్‌షిప్‌కోసం రాష్ట్రంలోని మైక్రో స్థాయి నుంచి మెగా పరిశ్రమల వరకు ఉన్నత విద్యా మండలి గుర్తించింది. ఇందులో మాన్యుఫాక్చరింగ్, సర్వీసు విభాగాల్లో శిక్షణ ఇస్తారు. శిక్షణ సమయంలో మంచి పనితీరు కనబరిచే వారికి ఆ కంపెనీలే ఉద్యోగాలు ఇచ్చే అవకాశం ఉంటుంది. ఇంటర్న్‌షిప్‌ ద్వారా ఆయా సంస్థలకు కూడా మానవవనరులు అందుబాటులోకి వస్తాయి. ఉభయ ప్రయోజనకరంగా ఈ ప్రణాళికను ప్రభుత్వం రూపొందించింది. మరోపక్క విద్యార్థుల్లో సామాజిక చైతన్యాన్ని, బాధ్యతను పెంపొందించడానికి ఉన్నత విద్యా మండలి కమ్యూనిటీ ప్రాజెక్టులను సిద్ధం చేసింది. సమాజంపై విద్యార్థులకు అవగాహన పెరగడంతో పాటు అక్కడి సమస్యలకు తాము నేర్చుకున్న విజ్ఞానం ద్వారా పరిష్కారాలను అన్వేషించేలా చేస్తారు. వీటి ద్వారా విద్యార్థుల్లో ఆత్మస్థైర్యం పెరుగుతుంది. సమస్యలను అధిగమించే తత్వం ఏర్పడుతుంది.

ఇదో విప్లవాత్మక కార్యక్రమం
ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ఆదేశాలతో రాష్ట్రంలోని ప్రతి విద్యార్థి చదువు పూర్తిచేసి బయటకు వచ్చేనాటికి వారిని సమగ్ర నైపుణ్యాలతో తీర్చిదిద్దే లక్ష్యంతో ఈ కార్యక్రమాలను చేపట్టాం. పరిశ్రమల్లో ఇంటర్న్‌షిప్‌తో విద్యార్థులకు ఎంతో మేలు జరుగుతుంది. ప్రపంచంలో ఎక్కడైనా మన విద్యార్థులు అవకాశాలను అందిపుచ్చుకొనేలా రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రణాళికను అమలుచేస్తోంది. ఇందులో భాగంగానే వివిధ పరిశ్రమలతో కాలేజీలను అనుసంధానిస్తున్నాం. రాష్ట్రస్థాయి కమిటీతో పాటు జిల్లాల స్థాయిలో కమిటీలు ఏర్పాటుచేశారు. కాలేజీలు, పరిశ్రమలు, బిజినెస్‌ ఎంటర్‌ప్రైజర్లను అనుసంధానం చేసి విద్యార్థులకు శిక్షణ ఇప్పిస్తాం. చదువు పూర్తయ్యేసరికి విద్యార్థి పూర్తి నైపుణ్యం సాధించేలా చేస్తాం. ఇది దేశంలోనే ఒక విప్లవాత్మక కార్యక్రమం.
-రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్‌ ప్రొఫెసర్‌ కె.హేమచంద్రారెడ్డి

ఇంటర్న్‌షిప్‌ కోసం వివిధ జిల్లాల్లో గుర్తించిన కొన్ని ముఖ్యమైన సంస్థలు

► 400 ఎండబ్ల్యూ సోలార్‌ పవర్‌ ప్రాజెక్ట్‌ ఏపీ జెన్‌కో, తలారిచెరువు, అనంతపురం
►హ్యుందాయ్‌ ట్రాన్సిస్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్, కియా మోటార్స్‌ అనంతపురం
►విప్రో ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఇంజినీరింగ్‌ పిస్టన్‌ రాడ్‌ ప్లాంట్‌ అనంతపురం
►అమర రాజా బ్యాటరీస్‌ లిమిటెడ్, కరకంబాడి, చిత్తూరు
►కోల్గేట్‌ పామోలివ్‌ (ఇండియా) లిమిటెడ్‌
►ఎక్స్‌ట్రాన్‌ సర్వర్స్‌ మాన్యుఫాక్చరింగ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్, చిత్తూరు
►హీరో మోటోకార్ప్‌ లిమిటెడ్, చిత్తూరు
► గుంటూరు టెక్స్‌టైల్‌ పార్కు, గుంటూరు
►జిందాల్‌ అర్బన్‌ వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌ లిమిటెడ్, గుంటూరు
►మైహోమ్‌ ఇండస్ట్రీస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్, గుంటూరు
►సరస్వతి పవర్‌ ఇండస్ట్రీస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్, గుంటూరు
► ఏపీ పవర్‌ జనరేషన్‌ కార్పొరేషన్, ఇబ్రహీంపట్నం, కృష్ణా
► ది కేసీపీ లిమిటెడ్‌ సిమెంటు యూనిట్, కృష్ణా
►రాష్ట్రీయ ఇస్పాత్‌ నిగమ్‌ లిమిటెడ్, కృష్ణా
►ది రామ్‌కో సిమెంట్స్‌ లిమిటెడ్, కృష్ణా
►గ్రీన్‌కో ఎనర్జీస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్, కర్నూలు
►జైరాజ్‌ ఇస్పాత్‌ లిమిటెడ్, కర్నూలు
►ఎస్‌బీజీ క్లింటెక్‌ ప్రాజెక్టు కో ప్రైవేట్‌ లిమిటెడ్‌. కర్నూలు
►టీజీవీ స్రాక్‌ లిమిటెడ్, కర్నూలు
►అమ్మన్‌ ట్రై స్పాంజ్‌ పవర్‌ ప్రైవేట్‌ లిమిటెడ్, నెల్లూరు
►హిందుస్తాన్‌ నేషనల్‌ గ్లాస్‌ అండ్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్, నెల్లూరు
►ఎన్‌జీసీ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్, నెల్లూరు
►సెంబ్‌కార్ప్‌ ఎనర్జీ లిమిటెడ్, నెల్లూరు
►అరబిందో ఫార్మా లిమిటెడ్, శ్రీకాకుళం
►డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబొరేటరీస్‌ లిమిటెడ్, శ్రీకాకుళం
►శ్రేయాస్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్, శ్రీకాకుళం
►స్మార్ట్‌కెమ్‌ టెక్నాలజీస్‌ లిమిటెడ్, శ్రీకాకుళం
►  డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబొరేటరీస్‌ లిమిటెడ్, విశాఖపట్నం
►హెటిరో ల్యాబ్స్‌ లిమిటెడ్, విశాఖపట్నం
►ఫైజర్‌ హెల్త్‌కేర్‌ ఇండియా ప్రైవేటు లిమిటెడ్‌ విశాఖపట్నం
►విశాఖపట్నం స్టీల్‌ ప్లాంట్, విశాఖపట్నం
►  మైలాన్‌ ల్యాబొరేటరీస్‌ లిమిటెడ్, విజయనగరం
► శారదా మెటల్స్‌ అండ్‌ అల్లాయిస్‌ లిమిటెడ్, విజయనగరం
►ఎస్‌ఎంఎస్‌ ఫార్మాçస్యూటికల్స్‌ లిమిటెడ్, విజయనగరం
►నవభారత్‌ లిమిటెడ్, పశ్చిమగోదావరి
► పాండురంగ ఎనర్జీ సిస్టమ్‌ ప్రైవేటు లిమిటెడ్, పశ్చిమ గోదావరి
►వీఈఎం టెక్నాలజీస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్, పశ్చిమ గోదావరి
►ఏపీ పవర్‌ జనరేషన్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్, వైఎస్సార్‌
►ఏపీ హైగ్రేడ్‌ స్టీల్స్‌ లిమిటెడ్, వైఎస్సార్‌ కడప
► టాటా పవర్‌ రెన్యువబుల్‌ ఎనర్జీ లిమిటెడ్, వైఎస్సార్‌ కడప
►మిడ్‌వెస్ట్‌ నియోస్టోన్‌ ప్రైవేట్‌ లిమిటెడ్, ప్రకాశం
►జేసీ బయోటెక్‌ ప్రైవేట్‌ లిమిటెడ్, ప్రకాశం
►కల్లామ్‌ స్పిన్నింగ్‌ మిల్స్‌ లిమిటెడ్, ప్రకాశం
►పెరల్‌ డిస్టిలరీ లిమిటెడ్, ప్రకాశం

ఇంజనీరింగ్‌ విద్యార్థులకు కమ్యూనిటీ సర్వీస్‌ ప్రాజెక్ట్లులు

కంప్యూటర్‌ సైన్స్, ఇంజనీరింగ్‌
1.వ్యవసాయంలో నేల ఆరోగ్యం , పంట రీసైక్లింగ్‌ కోసం సిఫార్సు చేసే వ్యవస్థ అభివృద్ధి
2.వ్యవసాయం కోసం స్ప్రింక్లర్లలో అధునాతన సాంకేతికతను ఉపయోగించి స్మార్ట్‌ నీటిపారుదల వ్యవస్థ ఏర్పాటు
3.అంటువ్యాధులకు సంబంధించి కంప్యూటర్‌ సహాయక ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ రూపకల్పన

సివిల్‌ ఇంజనీరింగ్‌
1.ల్యాండ్‌ స్లైడ్‌ల కోసం ప్రత్యేకంగా జియోసింథటిక్స్‌ ఉపయోగించి నేల స్థిరీకరణ
2.జీఐఎస్‌ ఉపయోగించి భూగర్భ జలాల గుర్తింపు
3.పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించడానికి నివాస భవనంలో భూఉష్ణ శక్తి వినియోగం

మెకానికల్‌ ఇంజనీరింగ్‌
1.అగ్రికల్చరల్‌ పెస్టిసైడ్‌ స్ప్రేయర్‌ – కోవిడ్‌ శానిటైజేషన్‌ డ్రోన్‌
2.గ్రామీణ ప్రాంతాల్లో వంట కోసం బయోగ్యాస్‌ కంప్రెషన్‌ – స్టోరేజ్‌ సిస్టమ్‌
3.వ్యవసాయం కోసం స్కాచ్‌ యోక్‌ మెకానిజం ఉపయోగించి డ్యూయల్‌ సైడ్‌ వాటర్‌ పంపింగ్‌ సిస్టమ్‌

ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్స్‌ ఇంజనీరింగ్‌
1.ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌ (ఐఓటీ) ఆధారంగా స్మార్ట్‌ అగ్రికల్చర్‌ విధానం, మాయిశ్చర్‌ హ్యుమిడిటీని గుర్తించడం
2.ప్రకృతి వైపరీత్యాల సమయంలో స్మార్ట్‌ రెస్క్యూ సిస్టమ్‌
3.స్మార్ట్‌ మాస్క్‌ – సామాజిక దూర హెచ్చరిక

ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్‌ ఇంజనీరింగ్‌
1.వ్యవసాయ అవసరాల కోసం నేలలో నీటిశాతం, తేమను కనుగొనేందుకు సోలార్‌ పవర్‌తో నడిచే ఆటో ఇరిగేషన్‌ సిస్టమ్‌ వినియోగం
2.మెరుగైన ఆరోగ్య పర్యవేక్షణ కోసం ఇ హెల్త్‌ కేర్‌ కంప్యూటింగ్‌ విధానం అనుసరణ
3.జిగ్బీ ఆధారిత సోలార్‌ పవర్‌ ఫారెస్ట్‌ ఫైర్‌ డిటెక్షన్‌ కంట్రోల్‌ సిస్టమ్‌

డిగ్రీ నాన్‌ప్రొఫెషనల్‌ విద్యార్థుల కోసం
డిగ్రీ నాన్‌ ప్రొఫెషనల్‌ విద్యార్ధులకు కూడా వివిధ అంశాల్లో కమ్యూనిటీ సర్వీస్‌ ప్రాజెక్టులను ఉన్నత విద్యామండలి నిర్వహించనుంది. ఆర్ట్స్‌ విద్యార్థులకు 51, కామర్స్‌ విద్యార్థులకు 50, సైన్సు విద్యార్థులకు 38 ప్రాజెక్టులు ఉంటాయి. విద్యార్థుల్లో సామర్థ్యాలను పెంపొందించడం, ఉమెన్, యూత్‌ ఎంపవర్‌మెంటుతో పాటు వివిధ క్యాంపుల నిర్వహణ అంశాలతో ఈ ప్రాజెక్టులను రూపొందించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement