సాక్షి, అమరావతి: గత సర్కారు హయాంలో తీసుకున్న నిర్ణయాలు, చేపట్టిన ప్రాజెక్టులు తదితరాలపై సమీక్షించేందుకు మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమిస్తూ జారీ చేసిన జీవో 1411, అక్రమాలపై దర్యాప్తు జరిపేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఏర్పాటు చేస్తూ జారీ చేసిన జీవో 344లను సవాలు చేస్తూ దాఖలైన వ్యాజ్యాలపై విచారణను హైకోర్టు ఈ నెల 7వ తేదీకి వాయిదా వేసింది. ఈ కేసులో మరిన్ని వివరాలను కోర్టు ముందుంచుతామని ప్రభుత్వ న్యాయవాది చింతల సుమన్ మంగళవారం హైకోర్టుకు నివేదించడంతో తదుపరి విచారణను ఈనెల 7వ తేదీకి వాయిదా వేస్తూ న్యాయమూర్తి జస్టిస్ తేలప్రోలు రజనీ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ జీవోలను సవాలు చేస్తూ టీడీపీ నేతలు వర్ల రామయ్య, ఆలపాటి రాజేంద్రప్రసాద్ వేర్వేరుగా హైకోర్టులో రిట్ పిటిషన్లు దాఖలు చేయడం తెలిసిందే. రాష్ట్ర ప్రభుత్వం తరఫున సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్ వీటిపై కౌంటర్ దాఖలు చేశారు.
కౌంటర్‌లో ముఖ్యాంశాలివీ...
► నిర్ణయాలను సమీక్షించే కార్యనిర్వాహక అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. పాత నిర్ణయాలను సమీక్షించడం ద్వారా తప్పులను గుర్తించి సరిదిద్దవచ్చు. గత సర్కారు హయాంలో పాలన మొత్తం అవినీతి, సహజ వనరుల దోపిడీ, గనుల అక్రమ తవ్వకాలు, భూముల ఆక్రమణ, పర్యావరణ హననం, రైతుల పట్ల నిర్లక్ష్యం, అక్రమాలతో కూడుకున్నది.
► రాజధాని భూముల విషయంలో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగినట్లు మంత్రివర్గ ఉప సంఘం తేల్చింది. అందులో ఎవరెవరి పాత్ర ఉందో ఆధారాలతో సహా వెల్లడించింది. నివేదికపై అసెంబ్లీలో పూర్తి స్థాయిలో చర్చ జరిగింది. మంత్రి వర్గ ఉప సంఘం సిఫారసుల మేరకే రాజధాని భూ అక్రమాలపై సిట్ ఏర్పాటైంది.
► సిట్ ఏర్పాటు వల్ల వర్ల రామయ్యకు, రాజేంద్ర ప్రసాద్‌కు నష్టం ఏమిటి? గత సర్కారు కొందరు వ్యక్తుల వ్యక్తిగత, ఆర్థిక ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టింది.
► ప్రభుత్వ పాలనలో ఏం జరిగిందో, జరుగుతోందో తెలుసుకునే ప్రాథమిక హక్కు ప్రజలందరికీ ఉంది. విస్తృత ప్రజా ప్రయోజనాల దృష్ట్యా మంత్రివర్గ ఉపసంఘం, సిట్‌ను ఏర్పాటు చేసినందున వీటిని పరిగణనలోకి తీసుకుని ఈ వ్యాజ్యాలను కొట్టివేయాలని న్యాయస్థానాన్ని అభ్యర్థిస్తున్నాం.
గత సర్కార్ పాలనంతా అవినీతి, అక్రమాలే..
Published Wed, Sep 2 2020 4:52 AM | Last Updated on Wed, Sep 2 2020 7:51 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment