హైకోర్టు ఉత్తర్వులను రద్దు చేయండి | Cancel The AP High Court Orders | Sakshi
Sakshi News home page

హైకోర్టు ఉత్తర్వులను రద్దు చేయండి

Published Wed, Sep 23 2020 3:46 AM | Last Updated on Wed, Sep 23 2020 3:46 AM

Cancel The AP High Court Orders - Sakshi

సాక్షి, అమరావతి: గత ప్రభుత్వం తీసుకున్న విధానపరమైన నిర్ణయాలు, చేపట్టిన ప్రాజెక్టులు తదితరాలపై సమీక్ష జరిపేందుకు మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటుచేస్తూ జారీచేసిన జీఓ 1411, మంత్రివర్గ ఉప సంఘం ఇచ్చిన నివేదిక ఆధారంగా ఆ ఆక్రమాలపై దర్యాప్తు చేసేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్‌) ఏర్పాటుచేస్తూ జారీచేసిన జీఓ 344ల్లో తదుపరి చర్యలన్నింటినీ నిలిపేస్తూ హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాలు చేసింది. హైకోర్టు ఇచ్చిన ఈ మధ్యంతర ఉత్తర్వులను రద్దు చేయాలని కోరుతూ స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌ (ఎస్‌ఎల్‌పీ) దాఖలు చేసింది.

రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, జీఏడీ ముఖ్య కార్యదర్శి ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. ‘రాష్ట్ర ప్రభుత్వం తన కార్యనిర్వాహక అధికారాలను ఉపయోగించి జారీచేసిన జీఓలను తప్పుపట్టడం ద్వారా హైకోర్టు పొరపాటు చేసింది. గత ప్రభుత్వ హయాంలో జరిగిన భారీ అక్రమాలను వెలుగులోకి తెచ్చేందుకు మంత్రివర్గ ఉప సంఘం, సిట్‌ను ఏర్పాటుచేశారన్న విషయాన్ని హైకోర్టు విస్మరించింది. పిటిషన్లు వేసేందుకు అర్హతలేని వ్యక్తులు దాఖలు చేసిన వ్యాజ్యాలపై విచారణ జరపడమే కాకుండా, ప్రభుత్వం తన కార్యనిర్వాహక అధికారాలను ఉపయోగించడాన్ని తప్పుపట్టడం ద్వారా హైకోర్టు పొరపాటు చేసింది. అవినీతి ఆరోపణలను నిగ్గు తేల్చేందుకు ప్రభుత్వం తన అధికార పరిధిని ఉపయోగించి ఇచ్చిన ఉత్తర్వులను తప్పుపట్టడం సరికాదు’.. అని వారు పేర్కొన్నారు.

విచారణాధికారం ప్రభుత్వానికి లేదా?
అలాగే, ‘గత ప్రభుత్వాల అక్రమాలపై విచారణ చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదా? అలాంటి ప్రజాస్వామ్యబద్ధ అధికారాన్ని న్యాయస్థానం తిరస్కరించవచ్చా? అన్నదే ప్రధాన ప్రశ్న. గత ప్రభుత్వంపై విస్తృత అవినీతి ఆరోపణలున్నాయి. ఈ ఆరోపణలపై దర్యాప్తు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇందులో ఎలాంటి తప్పులేదు. ఈ ఒక్క కారణంతో హైకోర్టు ఉత్తర్వులను రద్దుచేయవచ్చు. గత ప్రభుత్వ నిర్ణయాలను పునః సమీక్షించే స్వతఃసిద్ధ అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని చెప్పడం ద్వారా హైకోర్టు తప్పుచేసింది. దర్యాప్తు చేయడాన్ని పునః సమీక్షగా హైకోర్టు భావించింది. ఇది ఎంత మాత్రం సబబు కాదు. దర్యాప్తు చేసే, దర్యాప్తు సంస్థలను ఏర్పాటుచేసే కార్యనిర్వాహక అధికారం ప్రభుత్వానికి ఎప్పుడూ ఉంటుంది. అయితే, ఈ విషయాన్ని న్యాయస్థానం పట్టించుకోలేదు’.. అని అందులో వివరించారు.

హైకోర్టు తప్పుగా అర్ధంచేసుకుంది
అంతేకాక.. ‘ప్రభుత్వ కార్యనిర్వాహక అధికారాలు చాలా విస్తృతమైనవి. ఈ విషయంలో హైకోర్టు అభిప్రాయం సరికాదు. దర్యాప్తుదారు, ఫిర్యాదుదారు ఒక్కరే కాబట్టి, పక్షపాతం ఉండే అవకాశం ఉందన్న హైకోర్టు వాదనను పరిగణనలోకి తీసుకుంటే.. ఏ ప్రభుత్వానికీ అలాంటి దర్యాప్తు చేయడానికి వీలుండదు. దర్యాప్తుదారు, ఫిర్యాదుదారు ప్రభుత్వంలో భాగం కాబట్టి, దానికి పక్షపాతాన్ని ఆపాదించడానికి ఏ మాత్రం వీల్లేదు’.. అని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, జీఏడీ ముఖ్య కార్యదర్శి అందులో ప్రస్తావించారు.

రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి ఆధారాలు లేకుండా, సుమోటోగా సీబీఐ దర్యాప్తును కోరలేదు. ఈ విషయాన్ని హైకోర్టు తప్పుగా అర్ధం చేసుకుంది. ప్రభుత్వ విధానపరమైన నిర్ణయాల్లో న్యాయస్థానం జోక్యం చేసుకోవడానికి వీల్లేదన్న న్యాయసూత్రాన్ని హైకోర్టు విస్మరించింది’.. అని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, జీఏడీ ముఖ్య కార్యదర్శి తమ పిటిషన్‌లో పేర్కొన్నారు. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకుని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులను రద్దుచేయాలని వారు అభ్యర్థించారు. మంత్రివర్గ ఉప సంఘం, సిట్‌ ఏర్పాటు జీఓలను సవాలు చేస్తూ టీడీపీ నేతలు వర్ల రామయ్య, రాజేంద్రప్రసాద్‌లు హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేసిన విషయం తెలిసిందే.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement