
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో దేవాలయాలపై దాడులకు సంబంధించి సిట్ దర్యాప్తు సాగుతున్నందున ప్రస్తుతం సీబీఐ దర్యాప్తు అవసరంలేదని హైకోర్టు పేర్కొంది. ఈ దాడులపై సీబీఐ లేదా జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ)లతో దర్యాప్తునకు ఆదేశించాలని కోరుతూ కృష్ణాజిల్లా కొత్తూరు తాడేపల్లి గ్రామానికి చెందిన లెక్చరర్ కె.రామకృష్ణ దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని (పిల్‌ను) పరిష్కరించింది. ఈ వ్యాజ్యంపై సోమవారం ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ అరూప్‌కుమార్‌గోస్వామి, న్యాయమూర్తి జస్టిస్ చాగరి ప్రవీణ్‌కుమార్‌లతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది.
దేవాలయాలపై జరుగుతున్న దాడుల ఘటనలపై దర్యాప్తు చేసేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్‌ను) ఏర్పాటు చేశామన్న ప్రభుత్వ వాదనను పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం సిట్ దర్యాప్తును కొనసాగనిద్దామని తెలిపింది. సిట్ దర్యాప్తు ముగియకముందే సీబీఐ దర్యాప్తు కోరుతూ పిటిషన్ దాఖలు చేయడం అపరిపక్వమే అవుతుందని స్పష్టం చేసింది. ప్రస్తుత దశలో సీబీఐ దర్యాప్తు అవసరం లేదని, ఈ దశలో న్యాయస్థాన జోక్యం కూడా అవసరం లేదని తేల్చిచెప్పింది. ఒకవేళ సిట్.. దేవాలయాలపై దాడులకు పాల్పడిన నిందితులను పట్టుకోవడంలో విఫలమైతే అప్పుడు కోర్టుకు రావచ్చని పిటిషనర్‌కు మౌఖికంగా తెలిపింది.
ఈ దాడుల కేసు దర్యాప్తును సిట్ ఓ తార్కిక ముగింపునకు తీసుకురావాలని స్పష్టం చేసింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీచేస్తూ పిల్‌ను పరిష్కరించింది. అంతకుముందు పిటిషనర్ తరఫు న్యాయవాది పీఎస్‌పీ సురేశ్‌కుమార్ వాదనలు వినిపిస్తూ ఆలయాలపై తరచు దాడులు జరుగుతున్నాయని, విగ్రహాల ధ్వంసం జరుగుతోందని చెప్పారు. అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి రథం తగులబెట్టిన ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి సీబీఐ దర్యాప్తునకు ఆదేశించిందన్నారు.
విజయనగరం జిల్లా రామతీర్థంలో దేవతామూర్తి విగ్రహం నుంచి తలను వేరుచేశారని, దీనిపై ప్రభుత్వం సిట్‌ను ఏర్పాటు చేసిందని చెప్పారు. రథం దగ్ధం కన్నా రామతీర్థం ఘటన తీవ్రమైనదని, అందువల్ల సీబీఐ దర్యాప్తునకు ఆదేశాలివ్వాలని కోరారు. ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) శ్రీరామ్ వాదనలు వినిపిస్తూ ప్రభుత్వం ఆలయాలపై దాడులను తీవ్రంగా పరిగణిస్తోందని, అందుకే ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసిందని చెప్పారు. ఈ వాదనలు పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం పిల్‌ను పరిష్కరిస్తూ ఉత్తర్వులు జారీచేసింది.
Comments
Please login to add a commentAdd a comment