సాక్షి, అమరావతి: రాష్ట్రంలో రహదారులకు ఇక మహర్దశ పట్టనుంది. చంద్రబాబు ప్రభుత్వ హయాంలో గుంతలమయంగా, అస్తవ్యస్తంగా మారిన రోడ్ల రూపురేఖలను మార్చడానికి సర్కార్ నడుంబిగించింది. ఇందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాలతో రోడ్లు, భవనాల శాఖ మూడంచెల కార్యాచరణకు శ్రీకారం చుట్టింది. టీడీపీ ప్రభుత్వంలో కాంట్రాక్టర్లకు బకాయిపెట్టిన రూ.500 కోట్ల బిల్లుల చెల్లింపు.. రాష్ట్రంలో 45 వేల కి.మీ. మేర రోడ్లపై పడిన గుంతలను పూడ్చటంతోపాటు రూ.2,205 కోట్లతో 7,969 కి.మీ. మేర రాష్ట్ర, జిల్లా ప్రధాన రహదారులను పూర్తిగా ‘రెన్యువల్ లేయర్’ వేసి అద్భుతంగా తీర్చిదిద్దనుంది. ఈ ప్రణాళికకు ఆమోదం తెలిపిన సీఎం వైఎస్ జగన్ పనుల్లో నాణ్యతకు కాంట్రాక్టర్లను పూర్తి జవాబుదారీ చేయాలని, వారికి సకాలంలో బిల్లులు చెల్లించడానికి ప్రత్యేక అనుమతులు జారీ చేశారు.
ఈ స్థాయిలో ఇదే తొలిసారి..
రోడ్ల మరమ్మతుల కోసం చేసిన రూ.3 వేల కోట్ల రుణాన్ని గత టీడీపీ ప్రభుత్వం ఎన్నికల ముందు ‘పసుపు–కుంకుమ’ పథకానికి మళ్లించింది. దీంతో రాష్ట్రంలో రోడ్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఈ నేపథ్యంలో యుద్ధప్రాతిపదికన పనులు చేపట్టి వర్షాకాలం మొదలయ్యేనాటికి రోడ్ల మరమ్మతులు పూర్తి చేయాలని సీఎం జగన్ ఆదేశించారు. ఇందులో భాగంగా రాష్ట్రంలో 7,969 కి.మీ. మేర రహదారులకు రెన్యువల్ లేయర్ వేస్తారు. వాటిలో 2,726 కి.మీ. మేర రాష్ట్ర ప్రధాన రహదారులకు రూ.923 కోట్లు, 5,243 కి.మీ. మేర జిల్లా ప్రధాన రహదారులకు రూ.1,282 కోట్లు ఖర్చు చేస్తారు. ఇంధన వనరులపై రూ.1 చొప్పున వసూలు చేస్తున్న రోడ్ సెస్ నిధులను ఇందుకు వినియోగిస్తారు. ఈ నిధుల్లో 50 శాతాన్ని హామీగా చూపుతూ బ్యాంకులు/ఇతర ఆర్థిక సంస్థల నుంచి ఆంధ్రప్రదేశ్ రోడ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఏపీఆర్డీసీ) రూ.2 వేల కోట్ల రుణాన్ని సేకరిస్తుంది. అలాగే గుంతలు పూడ్చే 45 వేల కి.మీ.లలో 13 వేల కి.మీ. మేర రాష్ట్ర రహదారులకు రూ.160 కోట్లు, 32 వేల కి.మీ.మేర జిల్లా రహదారులకు రూ.220 కోట్లు కేటాయించారు.
సకాలంలో బిల్లుల చెల్లింపు
బ్యాంకులు/ఆర్థిక సంస్థల నుంచి రుణసేకరణకు ఏపీఆర్డీసీకి ఆర్‌అండ్‌బీ శాఖ సహకరిస్తుంది. క్షేత్రస్థాయిలో అధికారులు పనులు చేపట్టి కాంప్రహెన్సివ్ ఫైనాన్షియల్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ ద్వారా బిల్లులు మంజూరు చేస్తారు. ఆ బిల్లులను ఆడిట్ నిర్వహించి సక్రమంగా ఉన్నాయని నిర్ధారిస్తే వాటిని ఏపీఆర్డీసీ ఎండీకి పంపిస్తారు. ఆ బిల్లులను ప్రతి 15 రోజులకుగానీ, నెల రోజులకుగానీ చెల్లింపుల కోసం బ్యాంకుకు నివేదిస్తారు.
రాష్ట్ర చరిత్రలో ఇదే తొలిసారి
రాష్ట్ర, జిల్లా ప్రధాన రహదారుల మరమ్మతులపై సీఎం జగన్ ప్రత్యేకంగా దృష్టి సారించారు. రూ.2,205 కోట్లతో రోడ్ల మరమ్మతులు చేపట్టడం రాష్ట్రంలో ఇదే తొలిసారి. నాణ్యతతో పనులు చేస్తే కాంట్రాక్టర్లకు నేరుగా బ్యాంకుల నుంచే బిల్లులు చెల్లిస్తాం. వర్షాకాలం ప్రారంభమయ్యేనాటికి రోడ్ల మరమ్మతులు పూర్తి చేస్తాం.
– ఎం.టి.కృష్ణబాబు,ముఖ్య కార్యదర్శి, ఆర్ అండ్ బీ శాఖ
Comments
Please login to add a commentAdd a comment