విశాఖపట్నం జిల్లా చింతపల్లి మండలం లో నాలుగు గ్రామాలకు కొత్తగా రోడ్డు సదుపాయం కల్పించేందుకు రూ. 2.12 కోట్ల రూపాయలుతో వేసిన తారు రోడ్డు
విశాఖపట్నం జిల్లా చింతపల్లి మండలంలో 220 మంది జనాభా నివాసం ఉండే పశువులబండ గ్రామానికి వెళ్లడానికి నిన్నటి వరకు సరైన రోడ్డు సౌకర్యం లేదు. అదే దారిలో మరో మూడు గ్రామాలదీ ఇదే పరిస్థితి. రెండు నెలల కిత్రమే ప్రభుత్వం రూ.2.12 కోట్లు ఖర్చు చేసి 5.67 కిలోమీటర్ల పొడువున అదే మండంలోని చెరుకుంపాకాల రోడ్డు నుంచి నాలుగు ఊర్లకు కొత్తగా తారు రోడ్డును నిర్మించింది. 857 మంది జనాభా ఉండే బైలుకింజంగి, 259 మంది జనాభా ఉండే సత్యవరం, 44 మంది నివాసం ఉండే గుర్రగూడెం గ్రామాలకు వర్షాకాలంలో ఎటువంటి ఆటంకం లేకుండా వెళ్లేందుకు కొత్తగా రోడ్డు సదుపాయం అందుబాటులోకి వచ్చింది. కొండలు, పచ్చని చెట్లు, పొలాల మధ్య కొత్తగా నిర్మించిన ఆ తారు రోడ్డే ఇది.
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో సంక్షేమంతో పాటే అభివృద్ధీ సమాంతరంగా పరుగులు పెడుతోంది. ఇప్పటి వరకు మంచి రోడ్డు వసతి కూడా లేని వందల గ్రామాలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం ఇప్పుడు కొత్తగా రహదారులను అందుబాటులోకి తీసుకొచ్చింది. గత ఆర్థిక సంవత్సరం 616 గ్రామాలకు కొత్తగా రోడ్డు సదుపాయం కల్పిస్తే.. ఈ ఆర్థిక ఏడాది ఏప్రిల్, మే నెలల్లోనే మరో 52 గ్రామాలకు కొత్తగా రోడ్డు అందుబాటులోకి వచ్చింది. గత ఆర్థిక ఏడాదిలో దాదాపు సగం రోజులు లాక్‌డౌన్, తీవ్ర కరోనా భయందోళనలే నెలకొని ఉన్నప్పటికీ.. పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగం ఆధ్వర్యంలో రూ.648.97 కోట్లతో 1,550.81 కిలోమీటర్ల పొడవున కొత్తగా గ్రామీణ తారు రోడ్ల నిర్మాణాన్ని ప్రభుత్వం పూర్తి చేసింది. ప్రస్తుత ఆర్థిక ఏడాదిలోనూ ఏప్రిల్, మే నెలల్లో కరోనా సెకండ్ వేవ్ ప్రభావమే ఉంది. అయినా ఈ రెండు నెలల్లోనూ 127.28 కోట్ల ఖర్చుతో 266.91 కిలోమీటర్ల పొడవున కొత్తగా గ్రామీణ తారు రోడ్ల నిర్మాణం పూర్తి చేసింది. గ్రామానికి, మరో గ్రామానికి మధ్య చిన్నపాటి గ్రామీణ లింకు రోడ్లను పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో నిర్మాణం చేపడుతుండగా, పెద్ద పెద్ద రహదారులను రోడ్లు, భవనాల శాఖ నిర్మిస్తోంది. ప్రస్తుతం పేర్కొన్నవన్నీ కేవలం పంచాయతీరాజ్ శాఖ ఇంజనీరింగ్ ఆధ్వర్యంలో నిర్మాణం జరిగినవి మాత్రమే.
పనుల్లోనూ వేగం.. కేవలం 2 నెలల్లోనే పూర్తి చేసినవి..
గ్రామీణ తారు రోడ్ల నిర్మాణ పనులు మునుపెన్నడూ లేనంత వేగంగా కొనసాగుతున్నాయి. విశాఖపట్నం జిల్లా హుకుంపేట మండల కేంద్రం నుంచి పామురాయి గ్రామానికి నాలుగున్నర కిలోమీటర్ల పొడవున ప్రభుత్వం కొత్తగా రోడ్డును మంజూరు చేసింది. ఈ రోడ్డు నిర్మాణానికి ఈ ఏడాది మార్చిలో అధికారులు సంబంధిత కాంట్రాక్టర్‌తో ఒప్పందం చేసుకోగా, కేవలం రెండు నెలల వ్యవధిలో ఆ రోడ్డు నిర్మాణాన్ని పూర్తి చేశారు. 2012, 2013 సంవత్సరాల్లో మంజూరు చేసిన పలు రోడ్లను అప్పటి ప్రభుత్వాలు నిర్మాణం పూర్తి చేయలేని పరిస్థితి ఉండగా, అలాంటి రోడ్లను సైతం అన్ని రకాల అడ్డంకులను అధిగమించి పూర్తి చేసిన ఉదంతాలు ఉన్నాయని అధికారులు తెలిపారు.
నిర్మాణంలో ఉన్నవి పూర్తయితే మరో 1,376 గ్రామాలకు కూడా..
రాష్ట్ర వ్యాప్తంగా 500 లోపు జనాభా నివాసం ఉండే చిన్న గ్రామాలు వర్షాకాలంలో ఉపయోగపడే స్థాయిలో రోడ్డు సదుపాయానికి నోచుకోలేదు. చిన్నవి పెద్దవి కలిపి రాష్ట్రంలో 18 వేలకు పైగా గ్రామాలుండగా, అందులో రెండు వేల వరకు గ్రామాలకు ఇలాంటి పరిస్థితి నెలకొని ఉన్నట్టు అధికార వర్గాలు చెప్పాయి. శ్రీకాకుళం, చిత్తూరు, విశాఖపట్నం జిల్లాల్లో ఇలాంటి గ్రామాల సంఖ్య ఎక్కువగా ఉన్నట్టు అధికార వర్గాలు వెల్లడించాయి. గత ఆర్థిక ఏడాది, ఈ ఏడాదిలో కేవలం రెండు నెలల కాలంలో మొత్తం 668 గ్రామాలకు కొత్తగా రోడ్ల వసతి కల్పించగా.. మిగిలిన గ్రామాలకు రోడ్లు వేసేందుకు మరో 5,042 కిలో మీటర్ల పొడవున తారు రోడ్డు నిర్మాణ పనులు పురోగతిలో ఉన్నట్టు పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ శాఖ అధికారులు వెల్లడించారు. ఆయా రోడ్ల నిర్మాణం పూర్తయితే కొత్తగా మరో 1,376 మారుమూల గ్రామాలకు రోడ్డు సదుపాయం ఏర్పడుతుందని అధికారులు వివరించారు.
లక్ష్యాలు పెట్టుకొని పనిచేస్తున్నాం..
ఇప్పటిదాకా రోడ్డు సదుపాయం లేని గ్రామాలకు ప్రభుత్వం కొత్తగా రోడ్లను మంజూరు చేసింది. వాటిని పూర్తి చేయడానికి ఎప్పటికప్పుడు లక్ష్యాలను నిర్దేశించుకొని పనులు చేపడుతున్నాం. కరోనా ఇబ్బందులు ఉన్నప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో రోడ్డు నిర్మాణ పనులను యధావిధిగానే కొనసాగిస్తున్నాం. రోడ్డు నిర్మాణాలతో గ్రామీణ ప్రాంతాల్లో పలువురు పేదలకు పనులు దొరుకుతున్నాయి.
– సుబ్బారెడ్డి, ఈఎన్‌సీ, పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగం
Comments
Please login to add a commentAdd a comment