సాక్షి, అమరావతి: రాష్ట్రంలో అత్యధికమందికి ఉపాధి కల్పించే సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలను (ఎంఎస్‌ఎంఈలను) ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తుండటంతో బ్యాంకులు కూడా విరివిగా రుణాలివ్వడానికి ముందుకొస్తున్నాయి. ఎంఎస్‌ఎంఈ రంగానికి 2022–23 ఆర్థిక సంవత్సరంలో నిర్దేశించుకున్న రుణ లక్ష్యాన్ని మూడునెలలు ముందుగా డిసెంబర్ నాటికే చేరుకున్నట్లు రాష్ట్ర బ్యాంకర్ల కమిటీ (ఎస్‌ఎల్‌బీసీ) తాజా నివేదిక స్పష్టం చేసింది. గడిచిన ఆర్థిక సంవత్సరం మొత్తం మీద ఎంఎస్‌ఎంఈ రంగానికి రూ.50,100 కోట్ల రుణాలు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకుంటే.. తొమ్మిది నెలల కాలంలోనే 6 శాతం అధికంగా రూ.53,419 కోట్ల రుణాలను బ్యాంకులు మంజూరు చేశాయి.
ఈ మొత్తం మార్చి చివరి నాటికి మరింత పెరిగే అవకాశం ఉందని బ్యాంకింగ్ వర్గాలు పేర్కొంటున్నాయి. ప్రధానమంత్రి ఎంప్లాయ్‌మెంట్ జనరేషన్ ప్రోగ్రాం (పీఎంఈజీపీ) కింద వ్యాపార విస్తరణకు విరివిగా రుణాలను ఇప్పించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించడం రుణాలు పెరగడానికి ప్రధాన కారణంగా బ్యాంకు అధికారులు చెబుతున్నారు. ఎంఎస్‌ఎంఈ రంగంలో సూక్ష్మసంస్థలకు 2022–23లో రూ.23,300 కోట్ల రుణాలను ఇవ్వాలని లక్ష్యంగా నిర్దేశించుకుంటే.. 14 శాతానికిపైగా అధికంగా మొత్తం రూ.26,658 కోట్ల రుణాలను మంజూరు చేశాయి. అదే చిన్నతరహా యూనిట్లకు రూ.18,000 కోట్లకు, రూ.17,052 కోట్ల రుణాలను, మధ్యతరహా యూనిట్లకు రూ.8,800 కోట్ల లక్ష్యానికి అదనంగా రూ.9,439 కోట్ల రుణాలను మంజూరు చేశాయి.
నాలుగేళ్లల్లో 46 శాతానికిపైగా పెరిగిన రుణాలు గడిచిన నాలుగేళ్లల్లో ఎంఎస్‌ఎంఈ రుణాలు 46 శాతానికిపైగా పెరిగాయి. 2019 మార్చి 31 నాటికి ఎంఎస్‌ఎంఈ రంగానికి చెందిన ఔట్‌స్టాండింగ్ రుణ విలువ రూ.58,025 కోట్లుగా ఉంటే... అది 2022 డిసెంబర్ 31 నాటికి రూ.84,922 కోట్లకు చేరింది. గత ప్రభుత్వ హయాంతో పోలిస్తే రుణాలు భారీగా పెరిగాయని, రెండేళ్ల కోవిడ్ సమయంలో కూడా విరివిగా బ్యాంకు రుణాలు మంజూరయ్యాయని గణాంకాల ద్వారా తెలుస్తోంది.
ప్రోత్సాహకాలను సకాలంలో విడుదల చేయడంతోపాటు రుణాలను అందించే విధంగా ప్రభుత్వం చేయూతనందిస్తుండటంతో రాష్ట్రంలో ఎంఎస్‌ఎంఈల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. గత ప్రభుత్వం దిగిపోయే నాటికి రాష్ట్రంలో 1,05,620 ఎంఎస్‌ఎంఈలు ఉండగా ఇప్పుడు రెట్టింపు సంఖ్యలో 2,13,826కి పెరిగాయి. మూడున్నరేళ్లల్లో కొత్తగా 1,08,206 ఎంఎస్‌ఎంఈలు ఏర్పాటు కావడం ద్వారా రూ.20,537.28 కోట్ల పెట్టుబడులు రావడంతోపాటు 10,04,555 మందికి ఉపాధి లభించినట్లు కేంద్ర ప్రభుత్వ ఉద్యమ్ గణాంకాలు వెల్లడిస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment