హైకోర్టు తీర్పును రద్దు చేయండి | AP Govt filed SLP in Supreme Court On High Court judgment Chandrababu Bail | Sakshi
Sakshi News home page

హైకోర్టు తీర్పును రద్దు చేయండి

Published Wed, Nov 22 2023 4:07 AM | Last Updated on Wed, Nov 22 2023 12:50 PM

AP Govt filed SLP in Supreme Court On High Court judgment Chandrababu Bail - Sakshi

సాక్షి, అమరావతి: స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కుంభకోణంలో నిందితుడైన మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు పూర్తి స్థాయి బెయిల్‌ మంజూరు చేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం­కోర్టును ఆశ్రయించింది. హైకోర్టు తీర్పును రద్దు చేయాలని కోరుతూ మంగళ­వా­రం స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌ (ఎస్‌ఎల్‌పీ) దాఖలు చేసింది. ఇందులో నారా చంద్రబాబు నాయు­డిని ప్రతివాదిగా చేర్చింది. ఈ ఎస్‌ఎల్‌పీ తేలేంత వరకు హైకోర్టు తీర్పుపై స్టే ఇవ్వాలని కోరింది. హైకోర్టు స్కిల్‌ కుంభకోణంలో సీఐడీ చేసిన ఆరోపణల పూర్వాపరాల్లోకి వెళ్లి చంద్రబాబుకు క్లీన్‌చీట్‌ ఇచ్చిందని సుప్రీంకోర్టు దృష్టికి తీసుకొచ్చింది.

ఒకవైపు కేసు లోతుల్లోకి వెళ్లడం లేదని చెబుతూ, మరో వైపు సీఐడీ ఆరోపణలు, అందుకు సమర్పించిన ఆధారాలు, ఇతర అంశాల పూర్వాపరాల్లోకి వెళ్లి హైకోర్టు తీర్పు వెలువరించిందని వివరించింది. బెయిల్‌ పిటిషన్‌ విచారణ సందర్భంగా కేసు లోతుల్లోకి వెళ్లకూడదన్న సుప్రీంకోర్టు ఆదేశాలకు విరుద్దంగా హైకోర్టు వ్యవహరించిందని స్పష్టం చేసింది. హైకోర్టు చంద్రబాబు బెయిల్‌ పిటిషన్‌ను డిశ్చార్జ్‌ పిటిషన్‌ను విచారించినట్లు విచారించిందని రాష్ట్ర ప్రభుత్వం ఆక్షేపించింది. ‘హైకోర్టు స్కిల్‌ కుంభకోణం కేసు లోతుల్లోకి వెళ్లి మరీ చంద్రబాబుకు బెయిల్‌ మంజూరు చేసింది.

ఈ సందర్భంగా పలు వ్యాఖ్యలు చేసింది. బెయిల్‌ మంజూరు సందర్భంగా హైకోర్టు తేల్చిన పలు అంశాలు వాస్తవ విరుద్దం. ట్రయల్‌ సందర్భంగా కింది కోర్టును ప్రభావితం చేసేలా హైకోర్టు తీర్పు ఉంది. బెయిల్‌ పిటిషన్‌పై హైకోర్టు ఏకంగా 39 పేజీల తీర్పు వెలువరించింది. బెయిల్‌ మంజూరు సందర్భంగా హైకోర్టు మినీ ట్రయల్‌ నిర్వహించింది. రికార్డుల్లో ఉన్న అంశాలకు విరుద్దంగా హైకోర్టు తన నిర్ణయాన్ని వెలువరించింది. ఈ కేసులో హైకోర్టు తన పరిధిని అతిక్రమించింది’ అని రాష్ట్ర ప్రభుత్వం తన పిటిషన్‌లో పేర్కొంది.  

సుప్రీంకోర్టు నిర్ధేశించిన పరిధుల అతిక్రమణ
‘ప్రాథమిక ఆధారాలను బట్టి చూస్తే హైకోర్టు తీర్పు చెల్లుబాటు కాదు. దానిని రద్దు చేయాలి. బెయిల్‌ పిటిషన్‌ విచారణ సందర్భంగా ఎలా వ్యవహరించాలన్న దానిపై ఇప్పటికే స్పష్టంగా తేల్చిన న్యాయపరమైన కొలమాలన్నింటినీ హైకోర్టు తన తీర్పు ద్వారా అతిక్రమించింది. బెయిల్‌ పిటిషన్ల విచారణ సందర్భంగా సాక్ష్యాలను పూర్తి స్థాయిలో పరిశీలించడం, కేసు లోతుల్లోకి వెళ్లడాన్ని సుప్రీంకోర్టు పలు సందర్భాల్లో తీవ్రంగా తప్పుపట్టింది. మినీ ట్రయల్‌ కూడా నిర్వహించకూడదని చెప్పింది, అయితే హైకోర్టు ఏకంగా ట్రయల్‌ నిర్వహించింది.

బెయిల్‌ మంజూరు సందర్భంగా సీఐడీ ఆరోపణలను, వారి తీవ్రతను, డాక్యుమెంట్ల విశ్వసనీయతను, సాక్ష్యాల విలువను హైకోర్టు తన తీర్పులో తేల్చేసింది. హైకోర్టు బెయిల్‌ మంజూరు సమయంలో అనుసరించాల్సిన ప్రాథమిక కొలమానాలన్నింటికి విరుద్దంగా వ్యవహరించింది. చంద్రబాబుకు వ్యతిరేకంగా ప్రాసిక్యూషన్‌ నమోదు చేసిన కేసు ప్రభావితం అయ్యేలా హైకోర్టు వ్యవహరించింది. దుర్వినియోగం చేసిన నిధులు తెలుగుదేశం పార్టీ ఖాతాలకు మళ్లించారని తేల్చేందుకు నిర్ధిష్ట ఆధారాలు లేవని హైకోర్టు తేల్చింది. బెయిల్‌ పిటిషన్‌ విచారణ సందర్భంగా ఈ అంశాల జోలికి వెళ్లరాదు.

హైకోర్టులో పెండింగ్‌లో ఉన్న బెయిల్‌ పిటిషన్‌ను అడ్డంపెట్టుకుని తెలుగుదేశం పార్టీ వర్గాలు సీఐడీ దర్యాప్తునకు అడ్డుగోడలా నిలబడ్డాయి. సీఐడీ సమన్లకు ఏ మాత్రం సహకరించలేదు. సీఐడీ సమన్లకు టీడీపీ వర్గాలు స్పందించలేదన్న వాస్తవాన్ని హైకోర్టు పరిగణనలోకి తీసుకోలేదు. మనీ లాండరింగ్‌ అంశంపై ఈడీ దర్యాప్తు చేస్తోంది. నిధులు ఎక్కడకు వెళ్లాయన్న దానిపై నిర్ధిష్ట ఆధారాలున్నాయి.

వాటిని హైకోర్టు ముందు ఉంచడం జరిగింది. అన్నీ అంశాలపై ఏపీ సీఐడీ, ఈడీ దర్యాప్తు చేస్తున్నాయి. ఈ మొత్తం వ్యవహారంలో నిధుల మళ్లింపు జరగలేదని తేల్చడం ద్వారా హైకోర్టు ఘోర తప్పిదానికి పాల్పడింది. స్కిల్‌ కుంభకోణానికి సంబంధించి సీమెన్స్‌ కంపెనీ అంతర్గతంగా నిర్వహించిన విచారణను, దాని తాలుకు నివేదికను హైకోర్టు ఏ మాత్రం పరిగణనలోకి తీసుకోలేదు. అసలు ఆ నివేదికలో ఏమీ లేదని తేల్చేసింది’ అని వివరించింది.

స్పష్టంగా నగదు జాడలు
‘ప్రాజెక్టు విలువ రూ.36 కోట్లు అని చంద్రబాబు తదితరులు చెబుతున్నారు. అలా అయితే గత ప్రభుత్వం రూ.370 కోట్లు ఎందుకు విడుదల చేసినట్లు? మిగిలిన రూ.280 కోట్లు దారి మళ్లినట్లే. ఎంవోయూ, జీవో ప్రకారం అందచేయాల్సిన సాంకేతికతను సీమెన్స్, డిజైన్‌ టెక్‌లు అందించలేదన్నది వాస్తవం. అయితే సీఐడీ ఈ అంశాన్ని లేవనెత్తలేదని హైకోర్టు తన తీర్పులో చెప్పింది. వాస్తవానికి రిమాండ్‌లోనూ, హైకోర్టు వాదనల్లోనూ ఈ అంశాన్ని లేవనెత్తాం. ఫోరెన్సిక్‌ ఆడిట్‌ను ప్రతికూల కోణంలో చూడటం ద్వారా హైకోర్టు తన పరిధి దాటి వ్యవహరించినట్లయింది.

స్కిల్‌ డెవలప్‌మెంట్‌ ప్రాజెక్టు మొత్తం విజయమైందని, దీని ద్వారా 2.13 లక్షల మంది విద్యార్థులు శిక్షణ పొందినట్లు తేల్చింది. ఇలా చెప్పడం ద్వారా హైకోర్టు తప్పు చేసింది. హైకోర్టు చెప్పింది ఎంత మాత్రం వాస్తవం కాదు. అధికారులు లేవనెత్తిన అభ్యంతరాలను తోసిపుచ్చే అధికారం చంద్రబాబుకు ఉందని హైకోర్టు తేల్చింది. ఒకవేళ అలాంటిది ఉందని అనుకున్నా, చంద్రబాబు తన, షెల్‌ కంపెనీల స్వీయ లబ్ధి కోసం దురుద్దేశపూర్వకంగా ఆ అధికారాన్ని ఉపయోగించారు.

ఈ విషయాన్ని హైకోర్టు తన తీర్పులో పూర్తిగా విస్మరించింది. ఈ కుంభకోణానికి సంబంధించి సీమెన్స్, డిజైన్‌టెక్‌ ఉద్యోగులు ఇచ్చిన వాంగ్మూలాలను హైకోర్టు పరిగణనలోకి తీసుకోలేదు. ఈ ప్రాజెక్టులో రాజకీయ జోక్యం ఉందని, ప్రాజెక్టు అమలుకు అడ్డువచ్చిన వారిని 24 గంటల్లో బదిలీ చేశారన్న వాంగ్మూలాలను పట్టించుకోలేద’ని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది.

క్లీన్‌ చిట్‌ ఇచ్చే ప్రయత్నం!
‘సీమెన్స్, డిజైన్‌టెక్‌ నుంచి రావాల్సిన 90 శాతం నిధులు రాలేదని, అందువల్ల ప్రభుత్వం చెల్లించాల్సిన 10 శాతం నిధులను చెల్లించడం సరికాదన్న అప్పటి ఆర్థిక శాఖ కార్యదర్శి అభ్యంతరాలను చంద్రబాబు పట్టించుకోని విషయాన్ని హైకోర్టు పూర్తిగా విస్మరించింది. అవినీతి నిరోధక చట్టం మౌలిక సూత్రాల నుంచి, పబ్లిక్‌ సర్వెంట్‌ అధికారం దుర్వినియోగం వంటి వాటి నుంచి హైకోర్టు దూరంగా వెళ్లింది.

చంద్రబాబు సాక్షులను ప్రభావితం చేసే విషయంపై హైకోర్టు వ్యక్తం చేసిన అభిప్రాయాలు ఎంత మాత్రం హేతుబద్దమైనవి కావు. తన పీఏ పెండ్యాల శ్రీనివాస్‌ విదేశాలకు పారిపోవడం, కీలక నిందితులు సీఐడీ ముందుకు రాకపోవడం వంటి వాటి విషయంలో చంద్రబాబు పాత్ర ఉన్న విషయాన్ని హైకోర్టు పట్టించుకోలేదు. చంద్రబాబు రాజకీయంగా చాలా పలుకుబడి కలిగిన వ్యక్తి. దర్యాప్తును ప్రభావితం చేయడం, సాక్షులను భయభ్రాంతులకు గురి చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.

దర్యాప్తుకు విఘాతం కలిగేలా కొందరు నిందితులు మీడియా స్టేట్‌మెంట్లు ఇస్తున్నారు. తెలుగుదేశం పార్టీ వర్గాలు దర్యాప్తునకు సహకరించడం లేదు. చంద్రబాబుకు బెయిల్‌ కోసం కాకుండా క్లీన్‌ చిట్‌ ఇచ్చే అంశంగా పరిగణించి ఆదేశాలు ఇచ్చినట్లు ఉంది. వీటన్నింటిరీత్యా చంద్రబాబు జుడీషియల్‌ రిమాండ్‌లో ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది’ అని రాష్ట్ర ప్రభుత్వం తన పిటిషన్‌లో వివరించింది.

క్వశ్చన్‌ ఆఫ్‌ లా..
హైకోర్టు తీర్పులో పలు అంశాలపై అనుమానాలున్నాయని రాష్ట్ర ప్రభుత్వం పిటిషన్‌లో పేర్కొంది. ‘క్వశ్చన్‌ ఆఫ్‌ లా’కి సంబంధించి పలు ప్రశ్నలను సుప్రీంకోర్టు ఎదుట ఉంచింది. హైకోర్టు కసరత్తులో న్యాయపరమైన విధానం లోపించిందా? దర్యాప్తులో సేకరించిన సాక్ష్యాధారాలు, నిందితుడి నేరానికి సంబంధించిన అంశాలపై హైకోర్టు వ్యాఖ్యలు న్యాయపరమైన అంశాలకు విరుద్ధంగా ఉన్నాయా? బెయిల్‌పై పిటిషనర్ల వాదనలు లేనప్పుడు హైకోర్టు విస్తృతమైన తీర్పు ఇవ్వగలదా? పీసీ చట్టం 1988 ప్రకారం అధికారిక నిర్ణయాల విషయంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తిని నిర్దోషిగా భావించొచ్చా? అధికారం, అధికార వినియోగం, అధికారిక పరిధి లేకపోవడం, అధికార సామర్థ్యాన్ని దుర్వినియోగం చేయడం, ఇతరులకు సొమ్ము రూపంలో లబ్ధి చేకూర్చడం తదితరాలపై హైకోర్టు నిర్ణయం సరైనదేనా?’ అనే ప్రశ్నలను సుప్రీంకోర్టు ముందుంచింది.

నిరంజన్‌సింగ్‌ వర్సెస్‌ ప్రభాకర్‌ రాజారామ్, సుమిత్‌ శుభాచంద్ర గంగ్వాల్‌ వర్సెస్‌ మహారాష్ట్ర కేసుల్లో తీర్పులతోపాటు స్కిల్‌ స్కామ్‌ కేసులో సాక్ష్యాధారాలను వివరించే అంశాన్ని హైకోర్టు పదేపదే తిరస్కరించిందని పేర్కొంది.  సంగీతబెన్‌ వర్సెస్‌ గుజరాత్‌ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలు ప్రస్తావిస్తూ ప్రస్తుత కేసులో హైకోర్టు ఆయా అంశాలను పరిశీలించకుండా బెయిల్‌ కేసును మినీ ట్రయల్‌గా మార్చిందని, ట్రయల్‌ కోర్టు పనితీరును విస్మరించిందని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. ఈ ఒక్క కేసు పరిశీలనతోనే హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను పక్కన పెట్టవచ్చని నివేదించింది.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement