సాక్షి, అమరావతి: నవరత్నాల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమాభివృద్ధి కార్యక్రమాలు గిరిజనులకు ఎనలేని మేలుచేస్తున్నాయి. వ్యవసాయం, సంక్షేమం, విద్య, వైద్యం, విద్యుత్, మౌలిక వసతుల వంటి అంశాలపైనా ప్రభుత్వం దృష్టి కేంద్రీకరించింది. ఇటీవల వెలగపూడి సచివాలయంలో జరిగిన గిరిజన ఉప ప్రణాళిక సమీక్షలోనూ ఇదే విషయంపై దృష్టి కేంద్రీకరించింది. మరోవైపు.. గిరిజన (ఎస్టీ) సంక్షేమం, అభివృద్ధి కోసం ప్రభుత్వం 2020–21లో రూ.5,177.54 కోట్లు కేటాయించగా దానికి మరో రూ.953.70 కోట్లు (18.42%) కలిపి 2021–22కు రూ.6,131.24 కోట్లు కేటాయించింది. వీటిని సద్వినియోగం చేయడానికి ప్రభుత్వ యంత్రాంగం తన దూకుడును పెంచింది. ఇందులో భాగంగా 7 అంశాలపై దృష్టి సారించింది.
ఏడు కీలక అంశాలివే..
►ఎన్నికల ప్రణాళికలో పొందుపరిచినట్లుగా ‘నవరత్నాలు’ పథకాలను పక్కాగా అమలు జరిగేలా చూసి ఎక్కువమంది ఎస్టీలకు మేలు జరిగేలా ప్రణాళిక.
►ఎస్టీలు చేసే వ్యవసాయం, ఉద్యానవన, ఇతర రకాల సాగుకు దోహదం చేసే యాంత్రీకరణ, సబ్సిడీ రుణాలు అందించేందుకు కృషి.
►గిరిజన మహిళలు, పిల్లల సంక్షేమానికి అవసరమైన చర్యలు.
►విద్యా ప్రమాణాలు, మౌలిక వసతులు పెంచేలా నాడు–నేడు అమలు.
►గిరిజనుల వైద్యానికి అత్యధిక ప్రాధాన్యతనిచ్చి వారికి దశలవారీగా మెరుగైన వైద్య సేవలను అందుబాటులోకి తెచ్చేందుకు చర్యలు.
►200 యూనిట్లలోపు వినియోగించే ఎస్టీలకు విద్యుత్ చార్జీల మినహాయింపు.
►గిరిజన ప్రాంతాల్లో మెరుగైన మౌలిక వసతులు కల్పించేందుకు రోడ్లు, మంచినీరు, పక్కా ఇళ్లు వంటివి ప్రాధాన్యత క్రమంలో నిర్మాణం.
గిరిజనుల జీవనం మెరుగుపరిచేలా..
అడవుల్లో జీవించే గిరిజనులు సైతం సాధారణ పౌరుల్లాగే మెరుగైన జీవనం గడపాలన్నదే ప్రభుత్వ ధ్యేయం. అందుకే వారి అభివృద్ధి, సంక్షేమంతోపాటు మౌలిక వసతులను కల్పించేందుకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నాం. రాష్ట్రంలో 16,156 గిరిజన ప్రాంతాల వారికి సంక్షేమ, అభివృద్ధి ఫలాలు అందించేలా చర్యలు చేపడుతున్నాం. ఎస్టీ ఉప ప్రణాళిక అమలులోనూ మంచి ఫలితాలు సాధిస్తున్నాం. – పాముల పుష్పశ్రీవాణి, ఉపముఖ్యమంత్రి
Comments
Please login to add a commentAdd a comment