సాక్షి, అమరావతి: శాసనసభ నియోజకవర్గాల అభివృద్ధి పనుల కోసం ముఖ్యమంత్రి అభివృద్ధి నిధి నుంచి ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గానికి రూ.రెండు కోట్ల చొప్పున రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. మొత్తం 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు రూ.350 కోట్లను విడుదల చేస్తూ ప్రణాళికా శాఖ కార్యదర్శి విజయ్‌కుమార్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గానికి సాధారణ పద్దు కింద రూ.154.78 లక్షలు, ఎస్సీ ఉప ప్రణాళిక కింద రూ.34.16 లక్షలు, ఎస్టీ ఉప ప్రణాళిక కింద రూ.11.06 లక్షల చొప్పున మొత్తం రూ.రెండు కోట్లను కేటాయించినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
ఎమ్మెల్యేలు 25 శాతం నిధులను అంటే రూ.50 లక్షలను గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సరఫరా పనులకు వినియోగించాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. ఏదైనా నియోజకవర్గంలో తాగునీటి సరఫరా పనులు అవసరం లేని పక్షంలో జిల్లా ఇన్‌చార్జి మంత్రిని సంప్రదించి ఇతర ప్రాధాన్యత పనులకు కలెక్టర్లు పరిపాలన అనుమతులు ఇవ్వాలని సూచించారు.
ప్రతి నియోజకవర్గంలో గ్రామాల్లో చేపట్టే పనులను ముందుగా సంబంధిత ఎమ్మెల్యేతో పాటు జిల్లా ఇన్‌చార్జి మంత్రితో సంప్రదించి వారి అనుమతితోనే చేపట్టాలని, అందుకు అనుగుణంగా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. ఏదైనా పని చేపట్టడానికి ప్రభుత్వంతో సంప్రదించాల్సి వస్తే జిల్లా ఇన్‌చార్జి మంత్రితో చర్చించి పరిపాలన అనుమతులను మంజూరు చేయాలని కలెక్టర్లకు సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తున్న పనులకు నియోజకవర్గ అభివృద్ధి నిధులను ఎమ్మెల్యేలు వినియోగించాలని పేర్కొన్నారు. ఎస్సీ నియోజకవర్గాల్లో నూరు శాతం నిధుల పనులకు ఎస్సీ ఉప ప్రణాళిక కింద, ఎస్టీ నియోజకవర్గాల్లో నూరు శాతం నిధుల పనులకు ఎస్టీ ఉప ప్రణాళిక కింద మంజూరు చేయాలని, ఈ విషయంలో ఎటువంటి ఉల్లంఘనలకు పాల్పడరాదని స్పష్టం చేశారు. మిగతా నియోజకవర్గాల్లో ఎస్సీ ఉప ప్రణాళిక కింద 17.08 శాతం నిధులను, ఎస్టీ ఉప ప్రణాళిక కింద 5.33 శాతం నిధులను వ్యయం చేయాలని పేర్కొన్నారు.
సీఎం అభివృద్ధి నిధి కింద అనుమతించే పనుల జాబితా
∙గ్రామీణ ప్రాంతాల్లో తాగునీరు కల్పించడంలో భాగంగా చేపట్టే నిర్మాణ పనులు.
∙సాగునీటి ట్యాంకుల నిర్మాణం. ∙ట్యాంకులు, చెరువుల్లో మేటలను తొలగించడం.
∙భూగర్భ జలాలను పెంచేందుకు చేపట్టే నిర్మాణాలు. ∙మురుగు కాల్వల నిర్మాణం.
∙అవసరమైన కల్వర్టులు, వంతెనల నిర్మాణం. ∙గ్రామీణ, పట్టణ ప్రాంతాల అనుసంధాన రోడ్ల నిర్మాణం.
∙ఫుట్‌పాత్‌ల నిర్మాణం. ∙ప్రభుత్వ స్కూళ్లలో తాగు నీరు, మరుగుదొడ్ల నిర్మాణం. ∙స్మశాన వాటికలకు ప్రహరీ గోడల నిర్మాణం. ∙కమ్యూనిటీ హాల్స్. ∙గ్రామ పంచాయతీ భవనాలు, రీడింగ్ రూమ్స్, ప్రజలకు ఉపయోగకరమైన ఇతర భవనాలు. ∙పాఠశాలలు, గ్రామ పంచాయతీ భవనాలు లాంటి ప్రభుత్వ ఆస్తుల రక్షణకు ప్రహరీ గోడలు. ∙ఇప్పటికే ఉన్న ఆయకట్టులో బోదెలు లాంటి పంట కాల్వల అభివృద్ధి.
∙వ్యవసాయ ఉత్పత్తులు భద్రపర్చుకోవడానికి నిల్వ కేంద్రాలు.
∙ప్రజా, పశు వైద్య రక్షణకు సంబంధించిన వ్యయం. ∙చారిత్రక, వారసత్వ కట్టడాల పునరుద్ధరణ. ∙రోడ్లు నిర్మాణ సమయంలో విద్యుత్ లైన్ల తరలింపు.
Comments
Please login to add a commentAdd a comment