సాక్షి, అమరావతి: అమరావతి రాజధాని నగరాన్ని, రాజధాని ప్రాంతాన్ని ఆరు నెలల్లో అభివృద్ధి చేయడం తమకు, సీఆర్‌డీఏకు అసాధ్యమని.. ఇందుకు ఏళ్ల సమయం పడుతుందని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు నివేదించింది. రాజధాని ప్రాంత పురోగతి, అభివృద్ధి అన్నది అస్పష్టమైనదని, అది ఓ నిరంతర ప్రక్రియలా కొనసాగుతూ ఉంటుందని తెలిపింది. నిర్ణీత కాల వ్యవధిలోపు రాజధాని ప్రాంత అభివృద్ధిని పూర్తిచేస్తామని చెప్పడం సాధ్యం కాదని పేర్కొంది. రాజధాని నగరం, ఆ ప్రాంతం అభివృద్ధికి తీర్పులో నిర్దేశించిన నిర్ణీత కాల వ్యవధులను తొలగించాలని హైకోర్టును రాష్ట్ర ప్రభుత్వం కోరింది. లేదా తీర్పులో భూ యజమానులకు ఇవ్వాల్సిన ప్లాట్లను ఆరు నెలల్లో అభివృద్ధిచేసి ఇచ్చే ప్రక్రియ గడువును ఐదేళ్లకు పెంచాలని అభ్యర్థించింది.
చదవండి: AP: కొత్త జిల్లాల స్వరూపమిదే.. పెద్ద జిల్లా ఏదంటే?
అంతేకాక.. భూ యజమానులకు తిరిగి ఇవ్వాల్సిన ప్లాట్ల అభివృద్ధిని మాత్రమే చేపట్టేందుకు తమను, సీఆర్‌డీఏను అనుమతించాలని కోరింది. రాష్ట్రంలో ప్రస్తుతం అనేక సంక్షేమాభివృద్ధి కార్యక్రమాలను అమలుచేస్తున్నామని.. ఈ నేపథ్యంలో నిధుల లభ్యత, ఇతర ప్రాధాన్యతలు, ఇబ్బందులను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుందని తెలిపింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ సమీర్‌శర్మ హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేశారు. భూసమీకరణలో భూములిచ్చిన యజమానులకు తిరిగి ఇవ్వాల్సిన ప్లాట్ల అభివృద్ధి ప్రక్రియకు సంబంధించిన వివరాలకు మాత్రమే ప్రస్తుత ఈ అఫిడవిట్‌ను పరిమితం చేస్తున్నట్లు ఆయన తన అఫిడవిట్‌లో తెలిపారు.
అఫిడవిట్ ఎందుకంటే..
రాజధాని అమరావతి వ్యవహారంలో ఇటీవల హైకోర్టు తీర్పునిస్తూ, రాజధాని నగరాన్ని, రాజధాని ప్రాంతాన్ని ఆరు నెలల్లో అభివృద్ధి చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని, సీఆర్‌డీఏను ఆదేశించిన విషయం తెలిసిందే. అలాగే, రాజధాని ప్రాంతంలో రోడ్లు, తాగునీరు, డ్రైనేజీ, విద్యుత్ తదితర మౌలిక సదుపాయాలను నెలరోజుల్లో పూర్తిచేయాలని ఆదేశించింది. ల్యాండ్ పూలింగ్ కింద భూములిచి్చన యజమానులకు ప్లాట్లను అన్ని మౌలిక వసతులతో నివాసయోగ్యమైన రీతిలో అభివృద్ధిచేసి మూడు నెలల్లో అప్పగించాలని కూడా ఆదేశించింది. అంతేకాక.. రాజధాని అభివృద్ధికి సంబంధించిన పురోగతితో ఎప్పటికప్పుడు అఫిడవిట్‌లు వేయాలని ప్రభుత్వాన్ని, సీఆర్‌డీఏను ఆదేశించింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం, సీఆర్‌డీఏ తరఫున సమీర్‌శర్మ శుక్రవారం అఫిడవిట్‌ను దాఖలు చేశారు.
ఆ అభిప్రాయం రాకూడదనే..
రాజధాని అభివృద్ధికి తీసుకుంటున్న చర్యలు.. కాంట్రాక్టర్లకు, బ్యాంకులకు, ల్యాండ్ పూలింగ్ కింద భూములిచ్చిన యజమానులకు రాసిన లేఖలు.. నిధుల కోసం కేంద్రానికి, నీతి ఆయోగ్‌కు రాసిన లేఖలు వంటి పలు డాక్యుమెంట్లను జతచేస్తూ 190 పేజీల అఫిడవిట్‌ను సీఎస్ కోర్టు ముందుంచారు. ఇందులో.. రాజధాని విషయంలో గతనెల 3న ఇచ్చిన తీర్పు పర్యవసానాలను, న్యాయపరమైన మార్గాలను పరిశీలిస్తున్నామని సమీర్‌శర్మ పేర్కొన్నారు. న్యాయపరమైన ప్రత్యామ్నాయాలను ఉపయోగించుకునే ముందు ఈ తీర్పు అమలులో ఉన్న ఇబ్బందులను, ఆచరణ సాధ్యంకాని పరిస్థితులను వివరించేందుకే ఈ అఫిడవిట్ దాఖలు చేస్తున్నామన్నారు. కోర్టు ఆదేశాలను ఉల్లంఘించారన్న అభిప్రాయం రాకూడదన్న ఉద్దేశంతోనే ఈ అఫిడవిట్‌ను సదుద్దేశంతో దాఖలు చేస్తున్నామని వివరించారు. సమీర్‌శర్మ కౌంటర్‌లోని ముఖ్యాంశాలు ఏమిటంటే..
కనీసం 60 నెలలు పడుతుంది
♦ట్రంక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ (భూ యజమానులకు తిరిగి ఇవ్వాల్సిన ప్లాట్ల అభివృద్ధి) కోసం కనీసం 60 నెలల గడువు అవసరం.
♦కాంట్రాక్టుల గడువు పెంపు, అనుమతులకు సంబంధించిన ప్రతిపాదనల సమర్పణ, అనుమతుల మంజూరు, అనుబంధ ఒప్పందాలకు రెండు నెలల సమయం పడుతుంది.
♦పరిశీలనలు, సర్వే, డిజైన్ల పూర్తికి నాలుగు నెలలు.. మనుషులు, యంత్రాల సమీకరణకు రెండు నెలలు.. పనులన్నీ మొదలు కావడానికి 8 నెలల సమయం పడుతుంది.
♦రోడ్ల నిర్మాణానికి 16 నెలలు.. నీటి సరఫరా, డ్రైనేజీ, విద్యుత్ సౌకర్యం వంటి మౌలిక సదుపాయాల కల్పనకు 36 నెలల సమయం పడుతుంది.
♦వీటన్నింటినీ పూర్తిచేసేందుకు అవసరమైన నిధుల సేకరణ పురోగతి వివరాలను ఎప్పటికప్పుడు అఫిడవిట్ల ద్వారా తెలియజేస్తాం.
కేంద్రం ఇచ్చింది రూ.1,500 కోట్లే..
ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ టవర్లు, ఐఏఎస్ టవర్లలో పనులు తిరిగి ప్రారంభించాం. 31.11.2022 వరకు పనుల గడువును పొడిగించాం. పనులు చేస్తున్న ఏజెన్సీకి చెల్లించాల్సిన బిల్లులన్నీ చెల్లించాం. ఎన్‌జీఓ అపార్ట్‌మెంట్స్, గెజిటెడ్ ఆఫీసర్లు టైప్–1, టైప్–2 అపార్ట్‌మెంట్స్, గ్రూప్–డి అపార్ట్‌మెంట్స్‌లో మిగిలిన పనులు సమయానుకూలంగా మొదలవుతాయని ఆశిస్తున్నాం. కాంట్రాక్టర్ ఇటీవలే పనుల పూర్తికి గడువు పెంచాలని అభ్యరి్థంచారు. రాజధాని నగర నిర్మాణం కోసం కేంద్రం రూ.1,500 కోట్లు ఇచ్చింది. రాష్ట్రం రూ.3,024 కోట్లు ఇవ్వగా, రుణాల కింద రూ.5,107 కోట్లు తీసుకున్నాం.
మొత్తం పనుల అంచనా విలువ రూ.42,170 కోట్లు. మొదలైన పనుల విలువ రూ.41,678 కోట్లు. కన్సల్టెన్సీ చార్జీలు రూ.322 కోట్లు.. తిరిగి చెల్లించిన రుణాలు రూ.1,756 కోట్లు, భూ సమీకరణ, భూ సేకరణ వ్యయం రూ.1,989 కోట్లు. ఇక సీఆర్‌డీఏ తన వద్ద ఉన్న భూములు అమ్ముకోవచ్చు. అలా అమ్మడం ద్వారా వచి్చన నిధులే సీఆర్‌డీఏకు ప్రధాన ఆరి్థక వనరు. ఇక ప్రభుత్వ గృహ నిర్మాణ ప్రాజెక్టుకు మూడు బ్యాంకుల కన్సార్టియం రూ.2,060 కోట్లు మంజూరు చేసింది. ఇందులో రూ.1,862 కోట్లు ఇప్పటికే విడుదల చేసింది. మిగిలిన రూ.198 కోట్ల విడుదలకూ అంగీకరించింది. యూనియన్ బ్యాంకు రూ.93 కోట్లు విడుదల చేయగా, మిగిలిన రూ.105 కోట్లను బ్యాంక్ ఆఫ్ బరోడా, ఇండియన్ బ్యాంకులు త్వరలో విడుదల చేయనున్నాయి.
మిగిలిన పనులకు రూ.42వేల కోట్లు ఖర్చు
రాజధాని ప్రాంతంలో మిగిలిన పలు పనుల పూర్తికి రూ.42,231 కోట్ల వ్యయం అవుతుందని అంచనా. ఈ విషయంలో నిధుల సమీకరణకు ఆయా ఆర్థిక సంస్థలతో చర్చలు ప్రాథమిక దశలో ఉన్నాయి. ప్రాజెక్టు నిర్మాణ వ్యయం మొదటి దశ కింద రాష్ట్ర ప్రభుత్వం అందించాల్సిన ఆర్థిక సాయం మొత్తం రూ.51,687 కోట్లు. ఇందులో 2015–19 వరకు ఇచ్చింది రూ.1,377 కోట్లు. 2020–22 మధ్య ఇచ్చింది రూ.1,646 కోట్లు. సీఆర్‌డీఏ సేకరించిన రుణం రూ.5,122 కోట్లు.
ల్యాండ్ పూలింగ్ కింద మౌలిక సదుపాయాల కల్పనకు, రాజధాని నగర అభివృద్ధికి మాస్టర్‌ప్లాన్‌ను దశల వారీగా అమలుచేస్తాం. మాస్టర్‌ప్లాన్ దశల వారీ అభివృద్ధికి అవసరమైన రూ.3 వేల కోట్ల రుణ సేకరణకు సీఆర్‌డీఏకి గ్యారెంటీగా కూడా ఉన్నాం. అయితే, సీఆర్‌డీఏ నిధులను సమీకరించలేకపోయింది. ఈ నేపథ్యంలో.. గ్యారెంటీ కాలాన్ని పొడిగించాలని కోరింది. దీనిపై త్వరలోనే ఉత్తర్వులు విడుదల చేయనున్నాం. కాంట్రాక్టర్లతో, ఆర్థిక సంస్థలతో, కేంద్ర ప్రభుత్వంతో నిధుల గురించి మాట్లాడి నిధుల కొరతను ఓ కొలిక్కి తీసుకురావడానికి తగినంత సమయం పడుతుంది.
ప్లాట్ల రిజిస్ట్రేషన్‌కు లేఖలు పంపాం
ఇక 22,276 రిటర్నబుల్ ప్లాట్లలో 17,357 ప్లాట్లను రిజిస్టర్ చేయాల్సి ఉంది. మిగిలిన 4,919 ప్లాట్లలో 1,598 ప్లాట్ల విషయంలో కేసులు నమోదై ఉన్నాయి. అసైన్డ్ భూముల చట్ట నిబంధనల ఉల్లంఘన, ఎస్సీ, ఎస్టీలకు ఇచ్చిన అసైన్డ్ భూముల ఆక్రమణ, రికార్డుల తారుమారు, ఖజానాకు భారీ నష్టం తదితర అంశాలపై కేసులు నమోదు చేశాం. ఈ 17,357 ప్లాట్లను రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని భూ యజమానులకు లేఖలు పంపాం. కానీ, ఇప్పటివరకు 231 నివాస, 107 వాణిజ్య ప్లాట్లు రిజిస్టర్ అయ్యాయి. ఈ ప్రక్రియ పూర్తికావడానికి నెలల సమయం పడుతుంది.
ఏపీ సీఆర్‌డీఏ చట్టంలోని సెక్షన్–58లో ఆయా పనుల పూర్తికి నిర్ధిష్ట కాల వ్యవధులను నిర్ధేశించారు. ఒకవేళ ఆ కాల వ్యవధిలోపు పనులు పూర్తికాకుంటే, వాటన్నింటి విషయంలో ఏపీసీఆర్‌డీఏ తిరిగి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ల్యాండ్ పూలింగ్ స్కీం (ఎల్‌పీఎస్) నిబంధనల ప్రకారం.. తుది నోటిఫికేషన్ జారీ అయిన నాటి నుంచి మూడేళ్లలో మౌలిక సదుపాయాలన్నింటినీ పూర్తిచేసి ప్లాట్లను అప్పగించాల్సి ఉంటుంది. ఎల్‌పీఎస్ నిబంధనల్లో నిర్ధేశించిన గడువును 2024 జనవరి వరకు పొడిగిస్తూ 2020లోనే సీఆర్‌డీఏ నిర్ణయం తీసుకుంది.
రాజధానికి, మౌలిక సదుపాయాలకు రూ.1.09 లక్షల కోట్లు
ఏపీ పునరి్వభజన చట్ట నిబంధనల ప్రకారం.. రాజ్‌భవన్, హైకోర్టు, సచివాలయం, అసెంబ్లీ, శాసన మండలి తదితర భవనాల నిర్మాణానికి కేంద్రం ఆరి్థక సాయం చేయాల్సి ఉంటుంది. ఇప్పటివరకు రూ.1,500 కోట్లు ఇచ్చింది. వీటి కోసం రాష్ట్రం ఇప్పటివరకు రూ.1,632 కోట్లు ఖర్చుచేసింది. రాష్ట్ర ప్రభుత్వం రూ.3,023 కోట్లను గ్రాంట్‌గా ఇచి్చంది. గతంలో ఇచి్చన అంచనా మొత్తాలు ఇప్పుడు పెరిగే అవకాశముంది. రాజధాని అభివృద్ధి, మౌలిక సదుపాయాల కోసం రూ.1.09 లక్షల కోట్లు కోరుతూ 2018లో కేంద్రానికి లేఖ రాశాం. ఇందులో భాగంగా రూ.62,625 కోట్లకు డిపీఆర్‌లు కూడా సమర్పించాం. కేంద్రం ఇటీవల వీటి విషయంలో కొన్ని స్పష్టతలు కోరింది. ఆ పనిలో రాష్ట్రం ఉంది.
ఒప్పందాల పునరుద్ధరణకు సమయం పడుతుంది
రాజధాని నగర అభివృద్ధికి అవసరమైన నిధుల సమీకరణలో ఉన్నాం. అందులో భాగంగా గత నెల 23న పలు బ్యాంకులతో సమావేశం నిర్వహించాం. అవి పలు వివరాలు కోరాయి. వాటిని సమర్పించే పనిలో సీఆర్‌డీఏ ఉంది. రోడ్ల పనులను తిరిగి ప్రారంభించాల్సి ఉంది. అయితే, ఇందుకు అవసరమైన భూములు న్యాయ వివాదాల్లో ఉన్నాయి. కాంట్రాక్టర్లతో ఒప్పందాలను పునరుద్ధరించాల్సి ఉంటుంది. ఇందుకు కొంత సమయం పడుతుంది. కాంట్రాక్టర్లు యంత్రాలు, మనుషులను సమకూర్చుకోవాల్సి ఉంటుంది. ఇందుకు సైతం సమయం పడుతుంది. వీలైనంత త్వరగా పనుల ప్రారంభానికి అనుమతులిచ్చేందుకు చర్యలు తీసుకుంటాం.
Comments
Please login to add a commentAdd a comment