ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో సిజేరియన్ ప్రసవాల సంఖ్యను తగ్గించి, సహజ ప్రసవాల సంఖ్య పెంచేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది. వైద్య ప్రమాణాల ప్రకారం మొత్తం ప్రసవాల్లో 15 శాతానికి మించి సిజేరియన్‌లు ఉండకూడదు. అయితే రాష్ట్రంలో ప్రభుత్వ ఆస్పత్రుల్లో జరుగుతున్న ప్రసవాల్లో 33%, ప్రైవేట్ ఆస్పత్రుల్లో 50.78% సిజేరియన్‌లు ఉంటున్నాయి. ఈ దృష్ట్యా సిజేరియన్ ప్రసవాలకు అడ్డుకట్ట వేయడం, మాతృ, శిశు మరణాలు తగ్గించడం వంటి కార్యకలాపాలపై వైద్య, ఆరోగ్య శాఖ దృష్టి సారించింది. ప్రభుత్వ ఆస్పత్రుల్లో పనిచేస్తున్న స్టాఫ్ నర్సులకు ‘నర్స్ ప్రాక్టీషనర్ ఇన్ మిడ్‌వైఫరి (ఎన్‌పీఎం)’ కోర్సును ప్రారంభిస్తోంది.
60 మంది ఎంపిక
మిడ్‌వైఫరీ శిక్షణ కోసం రాష్ట్ర వ్యాప్తంగా 60 మందిని స్టాఫ్ నర్సులను ఎంపిక చేశారు. బ్యాచ్‌కు 30 మంది చొప్పున రెండు బ్యాచ్‌లుగా గుంటూరు, తిరుపతిల్లో వీరికి శిక్షణ ఇస్తారు. 18 నెలల శిక్షణా కాలంలో ఏడాదిపాటు థియరీ, ఆరు నెలలు ప్రాక్టికల్స్ ఉంటాయి. గర్భధారణ జరిగినప్పటి నుంచి మహిళకు అవసరమైన వైద్య సహాయం, గర్భిణులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, నవజాత శిశువుకు సేవలు, హైరిస్క్‌లో ఉన్న గర్భిణులను ఏ విధంగా గుర్తించాలి వంటి అంశాలపై శిక్షణ ఇస్తారు. అనంతరం వీరందరినీ అత్యధికంగా ప్రసవాలు జరిగే 10 ఆస్పత్రుల్లో నియమిస్తారు. తొలి బ్యాచ్‌కు ఈ నెల 17 నుంచి శిక్షణ ప్రారంభించనున్నారు. నర్సులకు శిక్షణ ఇవ్వడం కోసం హైదరాబాద్ ఫెర్నాండేజ్ ఫౌండేషన్‌లో ఆరుగురికి ప్రత్యేక శిక్షణ ఇప్పించారు. కార్యక్రమానికి యూనిసెఫ్ కూడా తోడ్పడుతోంది.
ముఖ్య ఉద్దేశం
వైద్యులకు ప్రత్యామ్నాయంగా మాతా, శిశు సంరక్షణ, ప్రసూతి సేవలు అందించడంలో నర్సులను స్పెషలిస్ట్‌లుగా మార్చడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. ఆరోగ్య పరిస్థితి మెరుగ్గా ఉండి సహజ ప్రసవానికి ఆస్కారం ఉన్న సమయంలో నర్సులు సేవలు అందిస్తారు. హైరిస్క్ గర్భిణులపై గైనకాలజిస్ట్‌లు దృష్టి సారిస్తారు. అభివృద్ధి చెందిన దేశాల్లో ఈ విధానం అమలులో ఉంటుంది.
2 వేల మందికి శిక్షణ
నర్సుల్లో నైపుణ్యాలు పెంపొందించడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. రాష్ట్రంలో 1,500 నుంచి 2 వేల మంది నర్సులకు శిక్షణ ఇవ్వాల్సి ఉంటుంది.దశల వారీగా అందరికీ శిక్షణ ఇస్తాం.
– కాటమనేని భాస్కర్, కమిషనర్, వైద్య, ఆరోగ్య శాఖ
Comments
Please login to add a commentAdd a comment