AP Police Recruitment Board Notification to Fill 6511 Posts - Sakshi
Sakshi News home page

Andhra Pradesh: పోలీసు ఉద్యోగార్థులకు గుడ్‌న్యూస్‌.. 6,511 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌

Published Tue, Nov 29 2022 6:24 AM | Last Updated on Tue, Nov 29 2022 12:58 PM

AP Police Recruitment Board Notification for filling up 6511 posts - Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం పోలీసు ఉద్యోగార్థులకు తీపి కబురు చెప్పింది. 6,511 పోలీసు ఉద్యోగాల భర్తీ ప్రక్రియ చేపట్టింది. వాటిలో 411 ఎస్‌ఐ పోస్టులు, 6,100 కానిస్టేబుల్‌ పోస్టులు ఉన్నాయి. ఈ మేరకు ఏపీ పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు సోమవారం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఎస్‌ఐ పోస్టుల్లో 315 సివిల్‌ (పురుషులు, మహిళల కేటగిరీలు), 96 ఏపీఎస్పీ (పురుషులు) పోస్టులు ఉన్నాయి. 6,100 కానిస్టేబుల్‌ పోస్టుల్లో 3,580 సివిల్, 2,520 ఏపీఎస్పీ పోస్టులు ఉన్నాయి. ఎస్‌ఐ పోస్టుకు రెండు విభాగాల్లో (సివిల్, ఏపీఎస్పీ) దరఖాస్తు చేసేవారికి ఒక దరఖాస్తు సరిపోతుంది.

కానిస్టేబుల్‌ పోస్టుకు రెండు విభాగాల్లో (సివిల్, ఏపీఎస్పీ) దరఖాస్తు చేసేవారికి ఒక దరఖాస్తు సరిపోతుంది. ఎస్‌ఐ, కానిస్టేబుల్‌ పోస్టులకు వేర్వేరుగా ప్రిలిమినరీ రాతపరీక్ష, శరీరదారుఢ్య పరీక్షలు, ఫైనల్‌ రాతపరీక్షలు నిర్వహించి అభ్యర్థులను ఎంపిక చేస్తారు. పోస్టుల భర్తీలో రిజర్వేషన్‌ నిబంధనలను పాటిస్తారు. హోంగార్డులకు తొలిసారిగా కానిస్టేబుల్‌ పోస్టుల్లో రిజర్వేషన్‌ కల్పించడం విశేషం. సివిల్‌ కానిస్టేబుల్‌ పోస్టుల్లో 8 శాతం నుంచి 15 శాతం, ఏపీఎస్పీ కానిస్టేబుల్‌ పోస్టుల్లో 10 శాతం నుంచి 25 శాతం హోంగార్డులకు రిజర్వేషన్‌ కల్పించారు. 


► అభ్యర్థుల అర్హతలు, వయో పరిమితి మినహాయింపులు, దరఖాస్తు ఫీజు, రాతపరీక్షల విధానం, శరీరదారుఢ్య పరీక్షల ప్రమాణాలు, ఇతర వివరాల కోసం ఏపీ పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు వెబ్‌సైట్‌ https:// slprb.ap.gov.in చూడాలని బోర్డు సూచించింది.
► అభ్యర్థులు ఏమైనా సందేహాలుంటే రాష్ట్ర పోలీసు రిక్రూట్‌మెంట్‌ బోర్డు కార్యాలయాన్ని ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటలలోపు సంప్రదించవచ్చని తెలిపింది. సంప్రదించాల్సిన ఫోన్‌ నంబర్‌: 9441450639 

పూర్తి పారదర్శకంగా పోలీసు నియామక ప్రక్రియ నిర్వహిస్తాం 
పోలీసు ఉద్యోగాల భర్తీప్రక్రియను పూర్తి పారదర్శకంగా, నిబంధనలకు అనుగుణంగా నిర్వహిస్తాం. 2023 జూన్‌ చివరినాటికి ఎంపిక ప్రక్రియ పూర్తిచేసి అభ్యర్థులకు శిక్షణ ప్రారంభించాలని నిర్ణయించాం. దీంతో 2024 ఫిబ్రవరి నాటికి పోలీసు శాఖలో పోస్టింగులు ఇవ్వొచ్చు. ఏటా ఇదేరీతిలో పోలీసు ఉద్యోగాలు భర్తీచేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. 
– కె.వి.రాజేంద్రనాథ్‌రెడ్డి, డీజీపీ

నోటిఫికేషన్‌ ప్రకారం పోస్టుల భర్తీ ప్రక్రియ ఇలా.. 
ఎస్‌ఐ ఉద్యోగాలు
– మొత్తం పోస్టులు: 411
– ఎస్‌ఐ సివిల్‌: 315
– ఎస్‌ఐ ఏపీఎస్పీ: 96
– దరఖాస్తులు: 2022 డిసెంబర్‌ 14 నుంచి 2023 జనవరి 18 వరకు ఆన్‌లైన్‌లో స్వీకరిస్తారు. 
– హాల్‌టికెట్లు: రాతపరీక్ష కోసం అభ్యర్థులు 2023 ఫిబ్రవరి 5వ తేదీ నుంచి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. 
– ప్రిలిమినరీ రాతపరీక్ష: 2023 ఫిబ్రవరి 19న నిర్వహిస్తారు. 

పేపర్‌–1: ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు. 
అర్థమెటిక్, రీజనింగ్, మెంటల్‌ ఎబిలిటీకి సంబంధించిన ప్రశ్నలతో ఆబ్జెక్టివ్‌ విధానంలో 100 మార్కులకు రాతపరీక్ష నిర్వహిస్తారు. 
పేపర్‌–2: మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు. 
జనరల్‌ స్టడీస్‌ సబ్జెక్ట్‌లో ఆబ్జెక్టివ్‌ విధానంలో 100 మార్కులకు రాతపరీక్ష నిర్వహిస్తారు. 
– శరీరదారుఢ్య పరీక్షలు: ప్రిలిమినరీ రాతపరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు శరీరదారుఢ్య పరీక్షలు నిర్వహిస్తారు. 
– ఫైనల్‌ రాతపరీక్ష: శరీరదారుఢ్య పరీక్షల్లో అర్హత సాధించిన వారికి ఫైనల్‌ రాతపరీక్ష నిర్వహిస్తారు. అందులో నాలుగు పేపర్లు ఉంటాయి. 
పేపర్‌–1: ఇంగ్లిష్‌ (డిస్క్రిప్టివ్‌ విధానంలో)
పేపర్‌–2: తెలుగు/ఉర్దూ (డిస్క్రిప్టివ్‌ విధానంలో) 
పేపర్‌–3: అర్థమెటిక్‌ (ఆబ్జెక్టివ్‌ విధానంలో)
పేపర్‌–4:  జనరల్‌ స్టడీస్‌ (ఆబ్జెక్టివ్‌ విధానంలో)
ఎస్‌ఐ సివిల్‌ పోస్టులకు: పేపర్‌–1, పేపర్‌–2ల్లో అర్హత మార్కులు సాధించిన అభ్యర్థులు పేపర్‌–3 (గరిష్టంగా 200 మార్కులు), పేపర్‌–4 (గరిష్టంగా 200 మార్కులు) మొత్తం 400 మార్కులకుగాను సాధించిన మార్కుల ప్రాతిపదికన తుది ఎంపిక నిర్వహించి పోస్టులు భర్తీచేస్తారు. 
ఎస్‌ఐ ఏపీఎస్పీ పోస్టులకు: పేపర్‌–1, పేపర్‌–2ల్లో అర్హత మార్కులు సాధించిన అభ్యర్థులు పేపర్‌–3 (గరిష్టంగా 100 మార్కులు), పేపర్‌–4 (గరిష్టంగా 100 మార్కులు), శరీరదారుఢ్య పరీక్ష (100 మార్కులు) కలిపి మొత్తం 300 మార్కులకుగాను సాధించిన మార్కుల ప్రాతిపదికన తుది ఎంపిక నిర్వహించి పోస్టులు భర్తీచేస్తారు. 

పోలీస్‌ కానిస్టేబుల్‌ ఉద్యోగాలు
► మొత్తం పోస్టులు: 6,100
► కానిస్టేబుల్‌ సివిల్‌: 3,580 (పురుషులు, మహిళలు)
► కానిస్టేబుల్‌ ఏపీఎస్పీ: 2,520 (పురుషులు)
► దరఖాస్తులు: 2022 నవంబరు 30 నుంచి 2022 డిసెంబర్‌ 28 వరకు ఆన్‌లైన్‌లో స్వీకరిస్తారు. 
► హాల్‌ టికెట్లు: రాతపరీక్ష కోసం అభ్యర్థులు 2023 జనవరి 9వ తేదీ నుంచి హాల్‌టికెట్లను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. 
► ప్రిలిమినరీ రాతపరీక్ష: 2023 జనవరి 22న ఒక పేపర్‌ ఉంటుంది. ఇంగ్లిష్, అర్థమెటిక్, రీజనింగ్, మెంటల్‌ ఎబిలిటీ, జనరల్‌ సైన్స్, భారతదేశ చరిత్ర, భారతీయ సంస్కృతి, భారత జాతీయోద్యమం, భారత జాగ్రఫీ, రాజనీతిశాస్త్రం, అర్థశాస్త్రం, కరెంట్‌ అఫైర్స్‌ సబ్జెక్టుల్లో 200 మార్కులకు ఆబ్జెక్టివ్‌ విధానంలో రాతపరీక్ష నిర్వహిస్తారు. 
► శరీరదారుఢ్య పరీక్షలు: రాతపరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు శరీరదారుఢ్య పరీక్షలు నిర్వహిస్తారు. 
కానిస్టేబుల్‌ సివిల్‌ అభ్యర్థులకు 1,600 మీటర్ల పరుగుతోపాటు 100 మీటర్ల పరుగుగానీ లాంగ్‌జంప్‌లో గానీ పరీక్షిస్తారు. 
కానిస్టేబుల్‌ ఏపీఎస్పీ అభ్యర్థులకు 1,600 మీటర్ల పరుగుతోపాటు 100 మీటర్ల పరుగు, లాంగ్‌జంప్‌ విభాగాల్లో పరీక్షిస్తారు. 
► ఫైనల్‌ రాతపరీక్ష:  శరీరదారుఢ్య పరీక్షల్లో ఎంపికైన అభ్యర్థులకు ఫైనల్‌ రాతపరీక్ష నిర్వహిస్తారు. ఇంగ్లిష్, అర్థమెటిక్, రీజనింగ్, మెంటల్‌ ఎబిలిటీ, జనరల్‌ సైన్స్, భారతదేశ చరిత్ర, భారతీయ సంస్కృతి, భారత జాతీయోద్యమ చరిత్ర, ఇండియన్‌ జాగ్రఫీ, రాజనీతిశాస్త్రం, అర్థశాస్త్రం, కరెంట్‌ అఫైర్స్‌ సబ్జెక్టుల్లో 200 మార్కులకు ఆబ్జెక్టివ్‌ విధానంలో పరీక్ష ఉంటుంది. 
► కానిస్టేబుల్‌ సివిల్‌ పోస్టులకు ఫైనల్‌ రాతపరీక్ష (గరిష్టంగా 200 మార్కులు)లో సాధించిన మార్కుల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. 
► కానిస్టేబుల్‌ ఏపీఎస్పీ పోస్టులకు ఫైనల్‌ రాతపరీక్ష (గరిష్టంగా 100 మార్కులు), శరీరదారుఢ్య పరీక్ష (గరిష్టంగా 100 మార్కులు)ల్లో సాధించిన మార్కులు కలిపి మొత్తం 200 మార్కులకు సాధించిన మార్కుల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.   

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement