రైతుకు దన్నుగా ఈ-ఫారం మార్కెట్‌ | AP: Sales of agricultural products through online marketing | Sakshi
Sakshi News home page

రైతుకు దన్నుగా ఈ-ఫారం మార్కెట్‌

Published Tue, Jan 10 2023 2:14 PM | Last Updated on Tue, Jan 10 2023 2:17 PM

AP: Sales of agricultural products through online marketing - Sakshi

రైతులకు లాభాలు చేకూర్చడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకుంటోంది. ఆరుగాలం కష్టపడి పండించిన పంటల్లో ప్రభుత్వ రంగ సంస్థలు 30 శాతం మాత్రమే కొనుగోలు చేయగలుగుతున్నాయి. మిగతా 70 శాతం సరుకు దళారులు, కమీషన్ల ఏజెంట్ల ద్వారా వ్యాపారులకు అమ్ముకుంటున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో రైతు ఉత్పత్తులు నూరు శాతం నేరుగా వ్యాపారులకే గిట్టుబాటు ధరకు విక్రయించునే విధంగా దేశంలో ఏ రాష్ట్రంలో అమలు చేయని విధంగా రాష్ట్ర ప్రభుత్వం మార్కెటింగ్‌ శాఖ ద్వారా ఈ–ఫారం మార్కెట్‌ మొబైల్‌ యాప్‌ను రూపొందించింది. దేశ వ్యాప్తంగా వ్యాపారులను అనుసంధానం చేసి నేరుగా రైతులు తమ ఉత్పత్తులను తాము నిర్ణయించిన ధరలకే విక్రయించుకునేట్లు మార్కెటింగ్‌శాఖ  మధ్యవర్తిగా వ్యవహరించనుంది. ఉత్పత్తులు విక్రయించిన మూడు రోజుల్లోనే రైతుల ఖాతాల్లోనే నగదు జమ చేయనుంది.

కందుకూరు(పీఎస్‌ఆర్‌ నెల్లూరు):  రైతులు పండించిన పంట ఉత్పత్తులను సులభంగా, ఎక్కడ అధిక ధర వస్తే అక్కడ విక్రయించుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం దన్నుగా నిలుస్తోంది. మార్కెటింగ్‌ శాఖ ఆధ్వర్యంలో ఆన్‌లైన్‌ మార్కెటింగ్‌ విధానాన్ని తీసుకొచ్చింది. ఇందు కోసం ‘ఈ–ఫారం మార్కెట్‌’ పేరుతో ఓ మొబైల్‌ యాప్‌ను రూపొందించి దేశంలోని 20 వేల మంది వ్యాపారులతో అనుసంధానం చేసింది. ఈ యాప్‌లో రైతులే నేరుగా తమ పంట ఉత్పత్తుల వివరాలను నమోదు చేసుకుని, ధరను కూడా నిర్ణయించుకునే అవకాశం కల్పించింది. మార్కెటింగ్‌ శాఖ ఆధ్వర్యంలో నడిచే ఈ ఆన్‌లైన్‌ మార్కెటింగ్‌ విధానం వల్ల రైతులకు విస్తృతమైన మార్కెట్‌ సదుపాయాలు అందుబాటులోకి వస్తాయని భావిస్తున్నారు.  

ఉత్తమ ధరను కల్పించడమే లక్ష్యం
రైతులు ఆరుగాలం పండించిన పంటలకు ఉత్తమ ధరను కల్పించడమే లక్ష్యంగా ఈ–ఫారం మార్కెట్‌ మొబైల్‌ యాప్‌ను ప్రభుత్వం రూపొందించింది. గూగుల్‌ ప్లే స్టోర్‌ నుంచి ప్రతి రైతు ఈ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకుని తన మొబైల్‌ నంబర్‌తో వివరాలను నమోదు చేసి రిజిస్టర్‌ చేసుకోవచ్చు. ఈ యాప్‌లో రైతు తన వద్ద ఏ పంట ఉత్పత్తి  ఎంత ఉంది, ఎంత ధరకు విక్రయించుకోవాలని భావిస్తున్నాడో ధరను నిర్ణయించుకోవచ్చు. ఓ రైతు వద్ద మినుములు ఉన్నాయనుకుంటే.. అవి ఎన్ని క్వింటాళ్లు ఉన్నాయి, ఏ క్వాలిటీతో ఉన్నాయి, క్వింటా ఏ ధర ఎంత అనే వివరాలు యాప్‌లో నమోదు చేస్తే సరిపోతుంది. రైతు నమోదు చేసిన ఈ వివరాలను పరిశీలించిన వ్యాపారులు తమకు కావాల్సిన వారు నేరుగా ఆ రైతు వివరాలతో అనుసంధానం అవుతాడు. ఎంత మొత్తం కొంటారు, ఏ రేటుకు కొనుగోలు చేస్తామనే వివరాలు వ్యాపారులు నమోదు చేయాల్సి ఉంటుంది. ఇదే యాప్‌లో మధ్యవర్తులుగా అనుసంధానమై ఉన్న మార్కెటింగ్‌ శాఖ అధికారులు ఇటు వ్యాపారితో, అటు రైతుతో మాట్లాడి విక్రయాలు జరిగే విధంగా చర్యలు తీసుకుంటారు. రైతు, వ్యాపారి ఇద్దరి మధ్య అంగీకారం కుదిరిన తర్వాత ఉత్పత్తులను తీసుకెళ్లేందుకు మార్కెటింగ్‌శాఖ అనుమతిస్తుంది. వ్యాపారే నేరుగా రైతు వద్దకు వచ్చి ఉత్పత్తులు చెప్పిన రేటుకు కొనుగోలు చేసి తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఇక్కడ ట్రాన్స్‌పోర్టు, హమాలీ ఖర్చులను సైతం పూర్తిగా వ్యాపారే భరించాల్సి ఉంటుంది. రైతుకు ఎటువంటి సంబంధం ఉండదు.  

మూడు రోజుల్లో నగదు జమ
వ్యవసాయ ఉత్పత్తుల విక్రయించిన మూడు రోజుల్లో రైతు ఖాతాకు నేరుగా డబ్బులు జమ చేసే విధంగా మార్కెటింగ్‌శాఖ అధికారులు చర్యలు తీసుకుంటారు. దీనికి పూర్తి బాధ్యత మార్కెటింగ్‌శాఖ వహిస్తోంది. ప్రస్తుతం పంట చేతికొచ్చిన తర్వాత రైతు నేరుగా కల్లాల్లోనే దళారులు, కమీషన్‌ ఏజెంట్‌ల ద్వారా విక్రయాలు సాగిస్తున్నారు. 15 నుంచి 20 రోజుల తర్వాత కానీ  డబ్బులు చెల్లించే పరిస్థితి లేదు. ఇదే క్రమంలో తరుగు, తాలు పేరుతో దోపిడీకి పాల్పడుతున్నారు. ఈ పరిస్థితికి చెక్‌ పెడుతూ మార్కెటింగ్‌ శాఖ అధికారులు సరుకు నాణ్యతను సర్టిఫై చేయడంతో పాటు వ్యాపారులతో ధరలు మాట్లాడి ఒప్పించే బాధ్యత  తీసుకుంటున్నారు. అయితే రైతులు తమ ఉత్పత్తులను క్వాలిటీ ఉండేలా చూసుకోవడం ఒక్కటే చేయాలని, క్వాలిటీ ఎంత బాగుంటే అంత మంచి ధర వస్తుందని చెబుతున్నారు. రైతులు తొందరపడి తక్కువ ధరలకు దళారులకు విక్రయించుకోకుండా ఈ–ఫారం మార్కెట్‌ విధానంలో అత్యంత సులభంగా విక్రయించుకోవచ్చునని సూచిస్తున్నారు.

జిల్లాలో ఈ ఉత్పత్తులకు అవకాశం
జిల్లా నుంచి ఇప్పటికే పలు రకాల ఉత్పత్తులను ఈ విధానంలో మార్కెటింగ్‌ శాఖ అధికారులు విక్రయాలు చేశారు. దాదాపు రూ. 35 కోట్ల లావాదేవీల వరకు జరిగాయి. వేరుశనగ, బియ్యం, కూరగాయలు, పచ్చి మిర్చి, పత్తి వంటివి తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాల వ్యాపారులకు విక్రయాలు చేశారు. కందుకూరు, ఉదయగిరి, రాపూరు, ఆత్మకూరు వంటి ప్రాంతాల్లో అన్ని రకాల పంటలు పండుతాయని, మిగిలిన చోట్ల ధాన్యం ఎక్కువగా పండుతుందని మార్కెటింగ్‌ శాఖ అధికారులు తేల్చారు. డిమాండ్‌ ఉన్న రాష్ట్రాల్లో జిల్లా నుంచి ఉత్పత్తులను విక్రయించే అవకాశాలున్నాయని చెబుతున్నారు. ప్రధానంగా తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి వ్యాపారులు ఈ–ఫారం మార్కెట్‌ విధానంలో ఉత్పత్తులు కొనుగోలు చేసేందుకు ముందుకు వస్తున్నారని చెప్పారు. శనగ, వేరుశనగ, మినుము, ఉద్యాన ఉత్పత్తులు, ధాన్యం, బియ్యం ఇలా ఏ పంట ఉత్పత్తి ఉన్నా నేరుగా యాప్‌లో నమోదు చేసుకోవచ్చునని సూచిస్తున్నారు. పండిన ఉత్పత్తుల్లో ప్రభుత్వరంగ సంస్థలైన మార్క్‌ఫెడ్, నాఫెడ్, సివిల్‌సప్లయిస్‌ వంటి సంస్థలు కేవలం 30 శాతం ఉత్పత్తులను మాత్రమే కొనుగోలు చేస్తున్నాయని, మిగిలిన 70 శాతం ఉత్పత్తులను రైతులు దళారుల ద్వారా విక్రయిస్తున్నట్లు మార్కెటింగ్‌ శాఖ గుర్తించింది. దీన్ని దృష్టిలో ఉంచుకునే మెరుగైన మార్కెటింగ్‌ అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతోనే ప్రభుత్వం ఈ నూతన విధానానికి శ్రీకారం చుట్టిందని అధికారులు పేర్కొంటున్నారు.  

విస్తృత మార్కెటింగ్‌ సదుపాయం
ఈ–ఫారం మార్కెట్‌ రైతులకు చాలా ఉపయోగకరంగా ఉంది. నాణ్యమైన ధరలకు తమ ఉత్పత్తులను నేరుగా విక్రయించుకోవచ్చు. దేశంలోని వ్యాపారులంతా ఉన్న నేపథ్యంలో డిమాండ్‌ పెరుగుతోంది. అప్పుడు అధిక ధరలు వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పటి వరకు జరిగిన విక్రయాల్లో రైతులకు చాలా మేలు జరిగింది. వేరుశనగ, కూరగాయలు వంటి తెలంగాణకు అధికంగా పంపించాం. 
– శ్రీనివాసులు, ఏఎంసీ కార్యదర్శి, కందుకూరు 

రైతు గిట్టుబాటు ధర పొందవచ్చు
ఈ–ఫారం మార్కెట్‌ వల్ల రైతులకు వ్యాపార అవకాశాలు బాగున్నాయి. ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ విధానం రైతులకు బాగా ఉపయోగపడుతోంది. పండించిన పంటను నేరుగా రైతులే అమ్ముకునేందుకు అవకాశం ఉన్న ఈ విధానంపై రైతులకు పూర్తిగా అవగాహన కల్పిస్తే బాగుంటుంది. అధికారులు ఆ విధంగా చర్యలు తీసుకోవాలి. 
– జె.శ్రీనివాసులు, రైతు, గుడ్లూరు 

అన్ని రకాల పంటలు అమ్ముకోవచ్చు 
ప్రభుత్వం తీసుకువచ్చిన ఆన్‌లైన్‌ మార్కెట్‌ విధానం రైతులకు ఉపయోగపడుతుంది. రైతులు నేరుగా తమ పంటలకు ధర నిర్ణయించుకుని అమ్ముకునే అవకాశం ఉంది. అన్ని రకాల రైతులు ఈ పంటలను ఈ–యాప్‌లో నమోదు చేసుకుని అమ్ముకోవచ్చు. రైతులంతా ఈ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకుంటే మంచిది.  
– పి.మాధవ, రైతు, ఓగూరు  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement