
సాక్షి, అమరావతి : రాజధాని వికేంద్రీకరణ బిల్లుపై ఆంధ్రప్రదేశ్ స్పీకర్ తమ్మినేని సీతారాం కీలక వ్యాఖ్యలు చేశారు. ఏడాదిలో 52 బిల్లులు పాస్ చేసినట్లు ఆయన తెలిపారు . శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. చారిత్రక రిజర్వేషన్లు, సంక్షేమానికి చెందిన బిల్లులు పాస్ చేసినట్లు వెల్లడించారు. వికేంద్రీకరణ బిల్లుపై 11 గంటలపాటు సుదీర్ఘ చర్చ జరిగిందన్నారు. చర్చలో అధికార పక్షం 4 గంటలు, ప్రతిపక్షం 2.17 గంటలు మాట్లాడినట్లు పేర్కొన్నారు. ప్రతిపక్షానికి ఉన్న బలం కంటే ఎక్కువ సమయమే కేటాయించినట్లు తెలిపారు. అయినప్పటికీ అసెంబ్లీలో చర్చ సరిగా జరగలేదని ప్రతిపక్షం విమర్శించడం సరికాదని హితవు పలికారు. (‘వ్యక్తిగత అభిప్రాయాలతో పార్టీకి సంబంధం లేదు’)
న్యాయ సమ్మతంగా ప్రతిపక్షానికి ఎక్కువ సమయం ఇచ్చామని స్పీకర్ తెలిపారు. మంత్రులను మండలికి రాకూడదని వ్యాఖ్యానించడం ఎంతవరకు సమంజసం అని ఆయన ప్రశ్నించారు. న్యాయస్థానాల్లో కొందరు తప్పుడు సమాచారం ఇస్తున్నారని, సెలక్ట్ కమిటీలో పెండింగ్ ఉందని కోర్టులో చెప్తున్నారని మండిపడ్డారు. అసలు సెలక్ట్ కమిటీ ఏర్పాటు కానప్పుడు పెండింగ్‌లో ఎలా ఉంటుందని ప్రశ్నించారు. కోర్టులను తప్పుదోవ పట్టించేలా తప్పుడు సమాచారం ఇస్తున్నారన్నారు. సెలక్ట్ కమిటీకి పంపాలంటే కచ్చితంగా ఓటింగ్ జరగాలని, ఓటింగ్ జరగనప్పుడు సెలక్ట్ కమిటీ ఎలా ఏర్పాటవుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. (వైఎస్సార్‌సీపీ మేనిఫెస్టోలోనే వికేంద్రీకరణ )
‘చంద్రబాబు అసెంబ్లీలో సెలక్ట్ కమిటీ పంపమని ఎందుకు అడగలేదు? శాసన మండలిలో అడగడం వెనుక ఉద్దేశమేంటి? 1997లో శాసనసభ వ్యవహారాల్లో కోర్టులు జోక్యం చేసుకోరాదని యనమల రూలింగ్ ఇచ్చారు. యనమల ఇచ్చిన రూలింగ్ ఇప్పటికీ అమలులో ఉంది. అదే యనమల ఇప్పుడు ఎలా విభేదిస్తారు? శాసనసభ నిర్ణయాలపై ఎందుకు కోర్టుకు వెళ్తున్నారు? యనమల ఆరోజు ఇచ్చిన రూలింగ్‌ను ఇప్పుడు ఏం చేయమంటారో చెప్పాలి? నిన్న కోర్టులో కేంద్రం చాలా స్పష్టంగా చెప్పింది. శాసనసభ వ్యవహారాలపై కోర్టులు జోక్యం చేసుకోరాదని స్పష్టం చేసింది. సీఎం వైఎస్ జగన్ మ్యానిఫెస్టోలో చాలా వివరంగా చెప్పారు. రాజధానిని ఫ్రీజోన్‌గా చేస్తానని, నిజమైన వికేంద్రీకరణ లక్ష్యంగా, మూడు ప్రాంతాలను సమగ్రంగా అభివృద్ధి చేస్తామని వైఎస్ జగన్ చెప్పారు’. అని స్పీకర్ స్పష్టం చేశారు. (‘ఆయన కుట్రలన్నీ ముందే ఊహించాం’)
Comments
Please login to add a commentAdd a comment