సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అత్యున్నత లక్ష్యాల్లో ఒకటైన మహిళా సాధికారత ఈ నాలుగున్నరేళ్ల సుపరిపాలనలో కళ్ల ముందు కనిపిస్తోంది. వైఎస్ జగన్ ప్రభుత్వ ప్రోత్సాహంతో రాష్ట్రంలోని అక్కచెల్లెమ్మలు అన్ని రంగాల్లోనూ ముందడుగు వేస్తున్నారు. చిన్న వ్యాపారులు, సూక్ష్మ పరిశ్రమలకు కేంద్రం అందించే పీఎం స్వనిధి పథకాన్ని సద్వినియోగం చేసుకుని, కుటుంబాలను ఆర్థికంగా బలోపేతం చేసుకోవడంలోనూ రాష్ట్ర మహిళలు దేశంలోనే అగ్రస్థానంలో ఉన్నారు.
రాష్ట్రంలోని పీఎం స్వనిధి రుణ గ్రహీతల్లో 74 శాతం మహిళలే. పురుషులు 26 శాతం ఉన్నారు. జాతీయ స్థాయిలో 57 శాతం పురుషులు ఈ రుణాలు తీసుకుంటుండగా, మహిళలు 43 శాతమే ఉన్నారు. ఎస్‌బీఐ రీసెర్చి నివేదిక ఈ వాస్తవాలను వెల్లడించింది. ఈ రుణాలను చురుగ్గా సద్వినియోగం చేసుకోవడంలోనూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశంలోనే రెండో స్థానంలో ఉంది.
జాతీయ స్థాయిలో రుణాలను చురుగ్గా ఖర్చు చేస్తున్న లబ్దిదారులు 22 శాతం మంది కాగా, ఏపీలో వీరు 28 శాతమని ఎస్‌బీఐ రిసెర్చి నివేదిక తెలిపింది. తొలి స్థానంలో ఉన్న పంజాబ్ రాష్ట్రంలో 32 శాతం మంది చురుగ్గా వ్యయం చేస్తున్నట్లు పేర్కొంది. అతి తక్కువగా పశ్చిమ బెంగాల్‌లో 17 శాతం మంది, జార్ఖండ్‌లో 18 శాతం మందే చురుగ్గా వ్యయం చేస్తున్నట్లు నివేదిక పేర్కొంది.
లక్ష్యానికి మించి రుణాలు
తొలి దశలో రూ.10 వేల చొప్పున దేశవ్యాప్తంగా 50 లక్షల మందికి రుణాలివ్వాలని కేంద్రం నిర్ణయించినప్పటికీ, డిమాండ్ భారీగా ఉండడంతో 2023 డిసెంబర్ నాటికి 63 లక్షల మందికి ఇవ్వాలని నిర్ణయించింది. మొత్తం మూడు దశల్లో 88.5 లక్షల రుణాలివ్వాలని నిర్ణయించింది. అదేవిధంగా రాష్ట్రంలో తొలి దశలో 2,30,000 మందికి వర్తింపజేయాలని నిర్ణయించగా, ఇప్పుడు ఈ లక్ష్యాన్ని 3,15,000కు పెంచింది.
రెండో దశలో 1,34,200 మందికి, మూడో దశలో 18,900 మందికి రుణాలు లక్ష్యంగా నిర్దేశించింది. ఇప్పటి వరకు మూడు దశల్లో కలిపి రాష్ట్రంలో 4,02,718 దరఖాస్తులకు రూ.528.85 కోట్ల రుణాలు మంజూరు చేశారు. రాష్ట్రంలో ఈ రుణాలను 15 రోజుల్లోగా బ్యాంకులు మంజూరు చేస్తున్నాయి. దరఖాస్తుదారుల్లో సగటు వయస్సు 42 సంవత్సరాలుగా ఉంది.
ఇదీ పథకం..
దేశవ్యాప్తంగా పట్టణ ప్రాంతాల్లోని వీధి వ్యాపారులకు సాయం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం కోవిడ్ మహమ్మారి సమయంలో 2020 జూన్‌లో ‘ప్రధాన మంత్రి వీధి వ్యాపారుల ఆత్మ నిర్భర్ నిధి (పీఎం స్వనిధి)’ని ప్రవేశపెట్టింది. వీధి వ్యాపారులు, చిన్న వ్యాపారులకు ఈ రుణాలు అందజేస్తారు. ఈ పథకం కింద బ్యాంకుల ద్వారా తొలుత రూ.10 వేలు రుణ సాయం చేస్తారు. ఈ రుణాన్ని సకాలంలో చెల్లించిన వారికి వ్యాపారాభివృద్ధి కోసం రెండో దశలో రూ. 20 వేలు, మూడో దశలో రూ. 50 వేలు మంజూరు చేస్తారు. వీరికి కేంద్రం వడ్డీలో ఏడు శాతం రాయితీ కూడా ఇస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment