
సాక్షి,అమరావతి: ఆడబిడ్డలపై అరాచకాలకు పాల్పడుతున్న మృగాళ్ళకు ఈ సమాజంలో స్థానం లేదని ఏపీ మహిళా కమిషన్ చైర్‌పర్సన్ వాసిరెడ్డి పద్మ అన్నారు. బుధవారం ఆమె తాడేపల్లిలో విలేకరులతో మాట్లాడారు. నెల్లూరు రూరల్ రామకోటినగర్‌లో యువతిపై అమానుషంగా దాడి చేసి, కర్రలతో కొడుతూ హింసించిన ఘటన సీఎం జగన్‌ని చాలా తీవ్రంగా కలచివేసిందన్నారు.
విశాఖలో ఇద్దరి బాలికలపై జరిగిన అఘాయిత్యంపై కూడా సీఎం జగన్ స్పందించారని చెప్పారు. ఈ రెండు ఘటనలపై సీఎం స్పందిస్తూ తక్షణం నిందితులను అదుపులోకి తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారని చెప్పారు. ఈ ఘటనలపై స్వయంగా బాధితుల పరిస్థితి తెలుసుకున్నానని, పోలీసు అధికారులతో మాట్లాడి, కమిషన్ సభ్యుల బృందాన్ని ఘటనాస్థలాలకు పంపించినట్లు చెప్పారు.