ఏపీ ఈఏపీసెట్‌కు దరఖాస్తుల వెల్లువ | Sakshi
Sakshi News home page

ఏపీ ఈఏపీసెట్‌కు దరఖాస్తుల వెల్లువ

Published Tue, Apr 16 2024 6:01 AM

Applications for ap eapcet are due till 12 with delinquent fee - Sakshi

సోమవారం నాటికి 3.46 లక్షల మంది దరఖాస్తు

అపరాధ రుసుముతో 12 వరకు గడువు

దీంతో దరఖాస్తులు మరిన్ని పెరిగే అవకాశం

7 నుంచి వెబ్‌సైట్‌లో హాల్‌టికెట్లు 

మే 16 నుంచి 22 వరకు ప్రవేశ పరీక్షలు

జగనన్న విద్యా, వసతి దీవెనలతో ఉన్నత విద్యపై పెరుగుతున్న ఆసక్తి

వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ సంస్కరణల వల్లే అంటున్న విద్యావేత్తలు

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మా కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఏపీ ఈఏపీసెట్‌–2024కి దరఖాస్తులు వెల్లువెత్తుతున్నాయి. సోమవారం వరకు 3,46,324 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో ఇంజనీరింగ్‌ విభాగంలో 2,62,981 మంది, అగ్రికల్చర్, ఫార్మా విభాగంలో 82,258 మంది ఉన్నారు. ఇంజనీరింగ్, అగ్రికల్చర్‌–ఫార్మా విభాగాలకు కలిపి మరో 1,085 మంది దరఖాస్తు చేసుకున్నారు. రాష్ట్ర విభజన తర్వాత ఈ స్థాయిలో ఎప్పుడూ దరఖాస్తులు రాలేదు. గతేడాదితో పోలిస్తే ఇప్పటివరకు దాదాపు 8 వేలకు పైగా దరఖాస్తులు అదనంగా వచ్చాయి.

ఇంజనీరింగ్‌ విభాగంలో సుమారు 24 వేలకు పైగా అధికంగా దరఖాస్తులు అందాయి. రూ.500 అపరాధ రుసుముతో ఈ నెల 30 వరకు, రూ.1,000తో మే 5 వరకు, రూ.5 వేలతో మే 10 వరకు, రూ.10 వేలతో మే 12 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. దీంతో దరఖాస్తుల సంఖ్య మరింత పెరగొచ్చని చెబుతున్నారు. దరఖాస్తుల్లో తప్పుల సవరణలకు మే 4 నుంచి 6 వరకు గ్రీవెన్స్‌ను నిర్వహించనున్నారు. 

మే 16 నుంచి ఈఏపీసెట్‌
ఏపీ ఈఏపీసెట్‌ను మే 16 నుంచి నిర్వహించనున్నారు. అగ్రికల్చర్, ఫార్మసీ విభాగాల్లో మే 16, 17 తేదీల్లో, ఇంజనీరింగ్‌ విభాగంలో మే 18 నుంచి 22 వరకు ప్రవేశపరీక్షలు నిర్వహించడానికి ఉన్నత విద్యా మండలి ఏర్పాట్లు చేస్తోంది. సంబంధిత తేదీల్లో రోజూ ఉదయం 9 నుంచి 12 గంటల వరకు తొలి సెషన్, మధ్యాహ్నం 2.30 నుంచి 5.30 గంటల వరకు రెండో సెషన్‌ పరీక్షలను నిర్వహిస్తారు. హాల్‌టికెట్లను మే 7 నాటికి వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచుతారు.

ప్రభుత్వ చర్యలతోనే దరఖాస్తుల పెరుగుదల..
ఉన్నత విద్యారంగంలో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం తీసుకొచి్చన విప్లవాత్మక సంస్కరణలు, అనేక సంక్షేమ పథకాల వల్లే ఈఏపీసెట్‌కు దరఖాస్తులు పెరుగుతున్నాయని విద్యావేత్తలు చెబుతున్నారు. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు రూ.35 వేల వరకు మాత్రమే ఫీజురీయింబర్స్‌మెంట్‌ ఉండేది. అది కూడా అరకొరగా కొంతమందికే అందేది. వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జగనన్న విద్యాదీవెన పథకం ద్వారా కళాశాల ఫీజు ఎంత ఉన్నా పూర్తిగా ప్రభుత్వమే భరిస్తోంది.

అంతేకాకుండా విద్యార్థుల వసతి, భోజన ఖర్చుల కోసం జగనన్న వసతి దీవెన పథకం కింద రూ.20 వేల వరకు సహాయాన్ని అందిస్తోంది. మరోవైపు విద్యార్థులు అత్యున్నత నైపుణ్యాలు సంతరించుకునేలా పరిశ్రమల అనుసంధానంతో వారికి ఇంటర్న్‌షిప్, శిక్షణ కార్యక్రమాలను చేపడుతోంది. వీటన్నిటి ఫలితంగా గత విద్యా సంవత్సరంలో ఒక్క సాంకేతిక విద్యా రంగంలోనే 1.20 లక్షలకు పైగా విద్యార్థులు క్యాంపస్‌ ఇంటర్వూ్యల్లో అత్యుత్తమ ప్యాకేజీలతో ఉద్యోగాలకు ఎంపికయ్యారు.

ప్రైవేట్‌ వర్సిటీల్లోనూ పేదలకు సీట్లు..
గత రెండేళ్లుగా ఈఏపీసెట్‌కు విద్యార్థుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. ఓవైపు కళాశాలల ఫీజులు ఎంత ఉన్నా పూర్తిగా ప్రభుత్వమే ఫీజురీయింబర్స్‌మెంట్‌ కింద భరిస్తోంది. ఇంకోవైపు ప్ర­భుత్వ, ప్రైవేట్‌ ఇంజనీరింగ్‌ కళాశాలల్లోనే కా­కుండా విట్, ఎస్‌ఆర్‌ఎం లాంటి ప్రైవేట్‌ వర్సిటీల్లోని సీట్లను కూడా ఈఏపీసెట్‌లో ప్రతిభ చూపిన పేద విద్యార్థులకు ప్రభుత్వం కేటాయిస్తోంది. విట్, ఎస్‌ఆర్‌ఎంల్లో 35 శాతం సీట్లను ప్రభుత్వం తన కోటాలో భర్తీ చేస్తోంది. ఈ వర్సిటీల్లో చేరాలంటే ఒక్కో విద్యార్థి ఏడాదికి రూ.4 నుంచి రూ.5 లక్షల వరకు వెచ్చించాలి్సందే. అలాంటిది పేద విద్యార్థులపై నయాపైసా భారం లేకుండా ప్రభుత్వమే ఈ సంస్థల్లోనూ ఫీజులు భరిస్తోంది. దీంతో ఈఏపీసెట్‌కు పెద్ద ఎత్తున దరఖాస్తులు అందుతున్నాయి.

Advertisement
 
Advertisement
 
Advertisement