సాక్షి, విశాఖపట్నం: రాష్ట్రాన్ని ప్రగతి పథంలో పరుగులు తీయిస్తూ ఉపాధి కల్పనే లక్ష్యంగా విశాఖలో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్–2023 ఊహకు మించి అద్భుతంగా ఆరంభమైంది. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారిగా జరుగుతున్న సదస్సుకు అనూహ్య స్పందన లభించింది. పలువురు దిగ్గజ పారిశ్రామికవేత్తలు ఇందులో పాల్గొనడం హైలెట్‌గా నిలిచింది.
ముఖ్యంగా దక్షిణ భారత దేశంలో ఏ ఒక్క పెట్టుబడుల సదస్సుకు హాజరుకాని రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ 15 మంది బోర్డు డైరెక్టర్లు, వైస్ ప్రెసిడెంట్లతో కలసి విశాఖ సమ్మిట్‌లో పాల్గొనడం విశేషం. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి డైనమిక్ లీడర్‌షిప్‌పై ఈ సందర్భంగా పారిశ్రామికవేత్తలు ప్రశంసల జల్లు కురిపించారు. రాష్ట్రాభివృద్ధిలో తాము కూడా భాగస్వాములవుతామని ప్రకటించారు. పెట్టుబడులకు స్వర్గధామం లాంటి ఆంధ్రప్రదేశ్‌లో పరిశ్రమల స్థాపనకు ముందడుగు వేస్తున్నట్లు చెప్పారు.
ఆరోగ్య రంగం అద్భుతం..
– ప్రీతారెడ్డి, అపోలో హాస్పిటల్స్ గ్రూప్ వైస్ చైర్‌పర్సన్
సమృద్ధి అంటే మనం చూస్తున్నట్లుగా ప్రజల శ్రేయస్సు పరిపూర్ణంగా కనిపించడం. బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో మేలు చేసిందని ఈ భూమి తల్లి కుమార్తెగా చెబుతున్నా. వైద్యారోగ్య రంగంలో ఏపీ ప్రభుత్వం అమలు చేస్తున్న విధానాలు నిజంగా ప్రశంసనీయం. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ప్రవేశపెట్టిన ఆరోగ్య శ్రీ పథకం ఇతర దేశాలకూ విస్తరించింది.
ఆ పథకాన్ని సీఎం వైఎస్ జగన్ మరింత విస్తరింపజేశారు. ఆరోగ్యశ్రీ ఆఫ్రికాలోనూ అమలవుతుండటం గర్వకారణం. ఏపీ ప్రభుత్వంతో అపోలో గ్రూప్స్ భాగస్వామిగా ఉండటం సంతోషంగా ఉంది. అపోలో కార్యకలాపాలకు సీఎం జగన్ ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తోంది. మనమంతా చూస్తున్నట్లుగా ఏపీవైపు అన్ని పరిశ్రమలు కలసి వస్తున్నాయి. రాష్ట్రంలో అత్యుత్తమ ఆరోగ్య ప్రమాణాలు అందించేందుకు ఒక కుటుంబంగా సహకరిస్తామని హామీ ఇస్తున్నా.
రూ.5 వేల కోట్ల పెట్టుబడులు
– హరిమోహన్ బంగూర్, శ్రీ సిమెంట్
జీఎస్‌డీపీలో 11.43 శాతంతో అగ్రభాగంలో నిలిచిన ఆంధ్రప్రదేశ్ దేశ జీడీపీలో 5 శాతం వాటా సాధించినందుకు అభినందనలు తెలియచేస్తున్నా. సీఎం జగన్ కృషితో విద్య, సామాజిక, ఇంజనీరింగ్ రంగాల్లో పరిశ్రమల్ని ఆకర్షించే అద్భుతమైన వనరులున్న రాష్ట్రంగా ఏపీ అడుగులు వేస్తోంది. మౌలిక సదుపాయాలతో పాటు మానవ వనరులు పుష్కలంగా అందుబాటులో ఉన్న రాష్ట్రంగా ఏపీని తీర్చిదిద్ది పారిశ్రామిక వర్గాల్ని ఆకర్షిస్తున్నారు. దాదాపు 50 మిలియన్ టన్నుల సామర్థ్యంతో శ్రీసిమెంట్ ప్లాంట్ ఏర్పాటు చేశాం.
55 శాతం గ్రీన్ ఎనర్జీ వినియోగిస్తూ దేశంలోని సిమెంట్ ప్రాజెక్టుల్లో నంబర్ వన్‌గా ఉన్నాం. ప్లాంట్‌లు మరిన్ని ఏర్పాటు చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నాం. మా సామర్థ్యాన్ని విస్తరించేందుకు ఆంధ్రప్రదేశ్ అత్యుత్తమ ప్రాంతంగా భావిస్తున్నాం. రూ.3,000 కోట్లతో గుంటూరులో దేశంలోనే మొదటి గ్రీన్ సిమెంట్ ప్లాంట్ పనులు జరుగుతున్నాయి. రూ.5,000 కోట్ల పెట్టుబడులు పెట్టి 5 వేల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగానూ ఉపాధి అవకాశాలు కల్పిస్తాం. దీనివల్ల రాష్ట్ర ఖజానాకు ఏటా రూ.1,000 కోట్ల ఆదాయం సమకూరుతుందని భావిస్తున్నాం. ముఖ్యమంత్రి జగన్ నేతృత్వంలో మరిన్ని పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తిగా ఉన్నాం.
ప్రభుత్వ సహకారంతో 18 నెలల్లోనే పూర్తి
– సుమిత్ బిదానీ, కెనాఫ్ సంస్థ సీఈవో
పరిశ్రమల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తోందని చెప్పేందుకు మేమే నిదర్శనం. శ్రీసిటీలో పరిశ్రమ ఏర్పాటుకు 2019లో ఒప్పందం కుదుర్చుకున్నాం. దేశంలోనే అతిపెద్ద ప్లాంట్‌గా 40 మిలియన్ డాలర్ల ప్రాథమిక పెట్టుబడితో 24 ఎకరాల్లో నిర్మించాం. 200 మందికి నేరుగా ఉపాధి కల్పించాం. సీఎం జగన్ సహకారం, ప్రోత్సాహంతో పెట్టుబడుల ఒప్పందం జరిగిన 18 నెలల్లోనూ మా ప్రాజెక్టుని పూర్తి చేసి ఉత్పత్తి ప్రారంభించాం.
ఎలాంటి ఇబ్బందులు పడకుండా అన్ని అనుమతుల్ని తేలికగా పొందాం. శ్రీసిటీలో విద్యుత్ సరఫరా చాలా అద్భుతంగా ఉంది. ముడిపదార్థాలు, ఇతర వస్తువుల్ని దిగుమతి చేసుకునేందుకు పలు పోర్టులు 100 కి.మీ. లోపు ఉండటం, బహుళ రహదారుల అనుసంధాన వ్యవస్థ కూడా ఉపయోగపడుతోంది. రాష్ట్రంలో రోడ్డు కనెక్టివిటీ, విద్యుత్ సౌకర్యం ఎంతో మెరుగ్గా ఉన్నాయి. ఇన్వెస్టర్స్ సమ్మిట్ పారిశ్రామికవేత్తలకు బాగా ఉపయోగపడుతుంది.
భవిష్యత్తు విస్తరణ ఏపీలోనే
– సజ్జన్ భజాంకా, సెంచురీ ప్లై చైర్మన్
ఏపీలో 14 నెలల క్రితం మా కలల ప్రయాణం ప్రారంభమైంది. సీఎం జగన్‌ను మొదటిసారి కలసినప్పుడు మా ప్లాంట్ ఎలా ఎస్టాబ్లిష్ చేయాలనే ఆలోచనతో వెళ్లాం. ప్లాంట్ ఎక్కడ ఏర్పాటు చేయాలి? ఏ మోడల్స్ ఉత్పత్తి చేయాలి? నోడల్ ఆఫీసర్లు ఎవరు..? ఇలా అన్నీ ఒక్క మీటింగ్‌లోనే డిసైడ్ అయిపోయాయి. అన్నీ కుదిరితే 2024 కల్లా ప్లాంట్‌లో ఉత్పత్తులు ప్రారంభించగలమని అనుకున్నాం.
సీఎం ప్రోత్సాహంతో కేవలం రెండేళ్లలోనే 2021 డిసెంబర్‌లో ఆయన చేతుల మీదుగా ప్రారంభించడం ఇప్పటికీ ఆశ్చర్యంగానే ఉంది. ఏపీలో మా ప్రయాణం చాలా సౌకర్యవంతంగా, సులభంగా మారింది. ఇక్కడ వాతావరణం చూసిన తర్వాత ఇది మా రాష్ట్రం, మా ప్రాంతం అనే భావనకు వచ్చేశాం. ప్రతి ఒక్క అధికారి, రాజకీయ ప్రతినిధులు పూర్తి సహకారం అందిస్తున్నారు. మరో రెండు ప్లాంట్ల పనులు కూడా జోరుగా సాగుతున్నాయి. ఏపీని మా ఫస్ట్ చాయిస్‌గా మార్చేశారు.
రూ.10 వేల కోట్లకు కియా పెట్టుబడులు
– కబ్ డాంగ్‌లీ, కియా మోటర్స్
రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో ప్రపంచ స్థాయి ఆటోమొబైల్ ప్లాంట్ నిర్మించాం. పరిశ్రమలకు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న మద్దతు మరువలేనిది. ఇండియన్ ఆటోమొబైల్ రంగంలో కియా ఇండియా లీడింగ్ కంపెనీగా మారడం వెనుక రాష్ట్ర ప్రభుత్వ ప్రోత్సాహం ఎంతో ఉంది. 2023 చివరి నాటికల్లా ఈవీ–6 తయారు చేస్తాం.
ఏపీలో 2027 నాటికల్లా కియా పెట్టుబడులు రూ.10 వేల కోట్లకు చేరుకోనున్నాయి. నిరంతర విద్యుత్, స్కిల్డ్ మానవ వనరులు, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, కనెక్టివిటీ అందించారు. కోవిడ్ సమయంలో మా ఉద్యోగులు, ముడి సరుకులను తరలించడంలో సీఎం జగన్ ప్రభుత్వం అందించిన సహకారానికి కృతజ్ఞతలు. రాష్ట్రంలోని సుదీర్ఘ తీరం వెంట పెట్టుబడులు పెట్టేందుకు ఉన్న అపార అవకాశాల్ని వినియోగించుకోవాలని పారిశ్రామికవేత్తలను కోరుతున్నా.
ప్రభుత్వ సహకారానికి సాహో
– మసహిరో యమగుచీ, టోరే ఇండస్ట్రీస్ ఇండియా లిమిటెడ్ ఎండీ
శ్రీసిటీలో ప్లాంట్ ఏర్పాటు సమయంలో సీఎం జగన్ సహకారం మరువలేనిది. అనుమతులన్నీ అతి తక్కువ సమయంలోనే మంజూరు చేశారు. ఫస్ట్ ఫేజ్‌లో 2019లోనే ఉత్పత్తులు ప్రారంభించాం. రెండో ఫేజ్‌లో రూ.200 కోట్ల పెట్టుబడులతో ప్లాంట్‌ను అభివృద్ధి చేసి ఉత్పత్తుల్ని ఈ ఏడాది మొదలు పెట్టాం.
ఆర్గానిక్ కెమిస్ట్రీ, బయో, నానోటెక్నాలజీ, పాలిమర్ కెమిస్ట్రీ కోర్ టెక్నాలజీతో ప్రారంభిస్తున్నాం. శ్రీసిటీలో హైక్వాలిటీ ఉత్పత్తులు ఉత్పత్తి చేస్తున్నాం. 132 కేవీ విద్యుత్ లైన్‌ని ప్రత్యేకంగా మాకోసం అందించారు. రాష్ట్రంలో ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ పాలసీ అద్భుతంగా అమలు చేస్తున్నారు.
స్టార్టప్, గ్రీన్ ఎనర్జీపై ఆసక్తి..
– మార్టిన్ ఎబర్‌హార్డ్, టెస్లా కో ఫౌండర్
టెస్లా ప్రారంభించినప్పుడు ఎవరికీ ఎలక్ట్రిక్ కార్లు తయారు చేస్తారనే ఆలోచన లేదు. ఈ రోజు ప్రతి దిగ్గజ కార్ల కంపెనీకి ఈవీ కార్ల గురించి తెలుసు. ప్రపంచవ్యాప్తంగా ఈవీ స్టార్టప్ కంపెనీలకు గొప్ప ఎకో సిస్టమ్ ఉంది. ఏపీలో స్టార్టప్స్‌తో పాటు గ్రీన్‌ఎనర్జీ ఉత్పత్తి గురించి తెలుసుకోవాలన్న ఆసక్తితో సదస్సుకు హాజరయ్యా.
ఈవీ విప్లవం ప్రపంచ వ్యాప్తంగా మొదలైంది. గ్రీన్ రివల్యూషన్‌కి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇక్కడికి వచ్చిన ప్రతి స్టార్టప్ కంపెనీ, ఔత్సాహిక పారిశ్రామికవేత్తకు ఒక్కటే చెబుతున్నా.. ఓడిపోయామని వదలొద్దు.. విజయం సాధించే వరకూ అడుగులు వేస్తూనే ఉండాలి.
Comments
Please login to add a commentAdd a comment