బొమ్మలు గీయడమంటే ఆయనకు వెన్నతో పెట్టిన విద్య.. అచ్చు గుద్దినట్లు సహజత్వం ఒట్టిపడేలా చిత్రాలు తీర్చిదిద్దడంలో ఆయన దిట్ట. చిన్నప్పటి నుంచి త్రలేఖనంపై మక్కువ కలిగిన ప్రసాదరావు కష్టపడి ఆర్ట్స్ టీచర్ ఉద్యోగం సంపాదించాడు. తన లాగే చిత్ర లేఖనంలో ఆసక్తి ఉన్న విద్యార్థులను గుర్తించి వారిని మరింత ప్రోత్సహించి మేటిగా రాణించేందుకు కృషి చేస్తున్నారు.
కొనకనమిట్ల(ప్రకాశం జిల్లా): కొనకనమిట్ల మండలం వెలిగొండ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకుల పాఠశాలలో ఆర్ట్స్ టీచర్‌గా పనిచేస్తున్న కొమ్ము ప్రసాదరావు విభిన్న శైలి. సామాజిక స్పృహపై అరుదైన చిత్రాలు వేస్తూ జాతీయ స్థాయిలో అవార్డులు అందుకున్నారు. సామాజిక స్పృహ కలిగించే చిత్రాలపై విద్యార్థులకు శిక్షణ ఇస్తూ ఉత్తమంగా తీర్చిదిద్దుతున్నారు.
ప్రసంసించే చిత్రాలు..
సామాజిక రుగ్మతలు, దేశ, రాష్ట్ర నాయకులు, పర్యావరణ కాలుష్యం, మంచినీటి సమస్య, పరిసరాల పరిశుభ్రత, విజృంభిస్తున్న అంటువ్యాధులు, బాల కార్మిక నిర్మూలనం వంటి అంశాలపై చిత్ర లేఖనం ద్వారా నలుగురికి అవగాహన కల్పించేందుకు ప్రయత్నిస్తున్నారు. రైతు భరోసాతో జై కిసాన్ అంటూ రైతు శ్రమను గుర్తించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రైతుల మోములో ఆనందహేలలు నింపుతున్న దృశ్యాన్ని కళ్లకు కట్టినట్లు కొమ్ము ప్రసాదరావు తీర్చిదిద్దారు.
గ్రామీణ ప్రజల్లో చైతన్యం తెచ్చేలా చిత్రాలు వేసి ప్రదర్శిస్తున్నారు. నీటి వృథా, స్వచ్ఛ భారత్, కాలుష్య నివారణ, పర్యావరణ పరిరక్షణ, పరిసరాల పరిశుభ్రత అంశాలతో పాటు కరోనా మహమ్మారిపై విద్యార్థులు గీసిన చిత్రాలు ఆకట్టుకుంటున్నాయి. భూగర్భజలాల ఆవశ్యకత, కాలుష్య కారకాలు, చెట్ల పెంపకం వల్ల కలిగే లాభాలు, కందకాలు తీయడం ద్వారా నీటి వృథాను అరికట్టవచ్చనే విషయాలపై చిత్రాలు వేస్తూ రాష్ట్ర, జాతీయస్థాయిలో చిత్రలేఖనం పోటీలకు ఎంపిక కావటంతో పాటు ఉత్తమ చిత్రాలకు అవార్డులు, బహుమతులు సాధించారు.
ఆర్టు అకాడమీలో ప్రశంసలు..
ఆర్టు అకాడమీ నిర్వహిస్తున్న పెయింటింగ్ ప్రదర్శనల్లో పాల్గొంటూ ప్రముఖుల మన్ననలు పొందుతున్నారు. ఈ నెల 8వ తేదీన ఒంగోలులో ‘సృష్టి ఆర్ట్ అకాడమీ’ వారు నిర్వహించిన పెయింటింగ్ ప్రదర్శనలో పలు రాష్ట్రాల నుంచి 87 మంది ప్రముఖ ఆర్టిస్టులు పాల్గొని చిత్రాలు ప్రదర్శించారు. వారిలో ప్రసాదరావు ప్రదర్శించిన చిత్రాలు ఆకట్టుకున్నాయి.
ముఖ్య అతిథులుగా పాల్గొన్న ఒంగోలు నగర మేయర్ గంగాడ సుజాత, దృశ్య కళల అకాడమీ చైర్మన్ సత్యశైలజ, అమృత హాస్పిటల్ వైద్యులు కేశవ, ప్రఖ్యాత చిత్ర కళాకారులు కళాసాగర్ చేతుల మీదుగా ప్రత్యేక అవార్డు పొందటంతో పాటు ఘనంగా సన్మానించారు. తమ పాఠశాల ఆర్ట్స్ టీచర్ అద్భుతంగా సందేశాత్మక చిత్రాలను పెయింటింగ్ ద్వారా రూపొందించి జాతీయ యిలో ప్రదర్శించి అవార్డులు సొంతం చేసుకోవటం అభినందనీయమని గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ కోటేశ్వరరావు అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment