
సాక్షి, నెల్లూరు : దేశంలోని సామాన్య ప్రజల అభివృద్ధి కోసం భారత మాజీ ప్రధానమంత్రి దివంగత నేత అటల్ బిహారీ వాజ్‌పేయీ ఎన్నో సంస్కరణలు చేపట్టారని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. మొదటిసారి పార్లమెంట్‌లో అడుగుపెట్టిన నాటి నుంచి ప్రజల హక్కులు.. దేశాభివృద్ధి కోసం మాట్లాడేవారని గుర్తుచేశారు. అటల్ తీసుకుని వచ్చిన సంస్కరణలతో దేశానికి ప్రపంచంలో ఎంతో గుర్తింపు వచ్చిందని అభిప్రాయపడ్డారు. సుదీర్ఘ పార్లమెంట్ అనుభవం గడించిన ప్రధాని వాజ్‌పేయీదని, ఆయన చరిత్రను ప్రతి యువకుడు అధ్యయనం చేయాలని సూచించారు. అటల్, అద్వానీ లాంటి ఇద్దరు గొప్ప నేతల మధ్య తాను కూర్చోవడం అదృష్టంగా భావిస్తున్నా అని పేర్కొన్నారు. న్యూక్లియర్ పరీక్షల అనంతరం పార్లమెంట్‌లో ఒక్క ఓటు తేడాతో రాజీనామా చేశారని గుర్తుచేశారు. శనివారం నెల్లూరులో పర్యటించిన వెంకయ్య నాయుడు స్థానికంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ప్రసంగించారు. వందేమాతరం అంటూ నినాదాలు చేస్తే జాతీయవాదం కాదని, దేశహితమే జాతీయ వాదమని వ్యాఖ్యానించారు.
‘చర్చలు జరపడం ద్వారా అనేక సమస్యలను పరిష్కరించవచ్చని మన రాజ్యాంగం చెబుతోంది. ప్రస్తుత నాయకులు హామీలు ఇస్తున్నారు కానీ, వాటిని అమలు చేయడం మరుస్తున్నారు. కొంతమంది రాజకీయ నాయకుల తీరుపై ప్రజల్లో నమ్మకం పోతుంది. కొన్ని ప్రాంతాల్లో రాజకీయ నాయకులు శారీరక దాడులకు పాల్పుడటం దురదృష్టకరం. ప్రభుత్వం ప్రతిపాదించినా.. ప్రతిపక్షాలు వ్యతిరేఖించినా.. ఏం చేయాలన్నది చట్టసభకు వదిలేయాలి. పార్టీ ఫిరాయింపులు రాజ్యాంగంను అపహాస్యం చేస్తున్నాయి. ఫిరాయింపులపై మూడు నెలల్లో నిర్ణయం తీసుకోవాలని పార్లమెంట్‌లోనే చెప్పాను. దీనిపై రాజకీయ పార్టీలు నిర్ణయం తీసుకోవాలి. అదిపెద్ద ప్రజాస్వామ్య దేశం మనది.. ఆ విలువలు కాపాడుకోవాల్సిన అవసరం మనపై ఉంది. తాత్కాలిక ఉపయోగం కంటే దీర్ఘకాలిక అవసరాల కోసం రాజకీయాలు చేయాలి.’ అని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment