సాక్షి, అమరావతి: దుర్భిక్ష రాయలసీమ, నెల్లూరు జిల్లాల్లో సాగునీటిని పారించి సుభిక్షం చేసే దిశగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మరో అడుగు ముందుకేశారు. గాలేరు–నగరి సుజల స్రవంతి పథకంలో అంతర్భాగమైన అవుకు రెండో సొరంగం (టన్నెల్) ఫాల్ట్ జోన్‌లో పనులు అసాధ్యమని నాడు చంద్రబాబు చేతులెత్తేయగా నేడు ముఖ్యమంత్రి జగన్ దాన్ని సుసాధ్యం చేస్తూ అత్యాధునిక పరిజ్ఞానం తో పూర్తి చేశారు. గాలేరు–నగరిలో అంతర్భాగమైన అవుకు రెండో టన్నెల్‌ను ముఖ్యమంత్రి జగన్ గురువారం జాతికి అంకితం చేయనున్నారు. తద్వారా ప్రస్తుత డిజైన్ మేరకు గాలేరు–నగరి వరద కాలువ ద్వారా 20 వేల క్యూసెక్కులను తరలించేందుకు మార్గం సుగమం చేశారు.
అవుకు సొరంగాల పనులకు వైఎస్సార్ హయాంలో రూ.340.53 కోట్లు వెచ్చించి సింహభాగం పూర్తి చేయగా 2014–19 మధ్య చంద్రబాబు సర్కారు రూ.81.55 కోట్లు మాత్రమే వ్యయం చేసి ఫాల్ట్ జోన్‌లో పనులు చేయకుండా చేతులెత్తేసింది. ముఖ్యమంత్రి జగన్ రూ.145.86 కోట్లు ఖర్చు చేసి టన్నెల్ 2 పనులను దిగ్విజయంగా పూర్తి చేశారు. మరోవైపు టన్నెల్ 3 పనుల కోసం ఇప్పటివరకు మరో రూ.934 కోట్లు వెచ్చించి దాదాపు తుదిదశకు తెచ్చారు. అవుకు వద్ద చేపట్టిన మూడో సొరంగం పనులు పూర్తయ్యే దశకు చేరుకున్నాయి. మొత్తం 5.801 కి.మీ. పొడవైన మూడో టన్నెల్‌లో ఇప్పటికే 4.526 కి.మీ. పొడవైన పనులను పూర్తి చేయడం గమనార్హం.
ఇక కేవలం 1.275 కి.మీ పనులు మాత్రమే మిగిలాయి. మొత్తం మూడు టన్నెళ్ల కోసం ఇప్పటిదాకా రూ.1,501.94 కోట్లు వ్యయం చేయగా వీటి ద్వారా 30 వేల క్యూసెక్కుల నీటిని తరలించే వెసులుబాటు కలగనుంది. పెన్నా డెల్టాకు జీవనాడులైన నెల్లూరు, సంగం బ్యారేజ్‌లను ఇప్పటికే పూర్తి చేసి గతేడాది సెప్టెంబరు 6న జాతికి అంకితం చేయగా కర్నూలు, నంద్యాల జిల్లాల్లో పశ్చిమ మండలాలకు తాగు, సాగునీటిని అందించే లక్ష్యంతో హంద్రీ–నీవా నుంచి 77 చెరువులను నింపే ఎత్తిపోతలను పూర్తి చేసి సెప్టెంబరు 19న సీఎం జగన్ జాతికి అంకితం చేసిన విషయం తెలిసిందే.
2.60 లక్షలకు సాగునీరు.. 20 లక్షల మందికి తాగునీరు
శ్రీశైలానికి వరద వచ్చే సమయంలో రోజుకు 20 వేల క్యూసెక్కుల చొప్పున 30 రోజుల్లో 38 టీఎంసీలను తరలించి ఉమ్మడి కడప, చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో 2.60 లక్షల ఎకరాలకు సాగునీరు, 640 గ్రామాల్లో 20 లక్షల మందికి తాగునీటిని అందించే దివంగత వైఎస్సార్ 2005లో గాలేరు–నగరి సుజల స్రవంతిని చేపట్టారు. గోరకల్లు రిజర్వాయర్ నుంచి 20 వేల క్యూసెక్కుల సామర్థ్యంతో 57.7 కి.మీ. పొడవున వరద కాలువ, దీనికి కొనసాగింపుగా అవుకు రిజర్వాయర్ వద్ద కొండలో 5.7 కి.మీ. పొడవున 16 మీటర్ల వ్యాసంతో ఒక సొరంగం తవ్వకం పనులు చేపట్టారు.
మట్టి పొరలు బలహీనంగా ఉన్నందున పెద్ద సొరంగం తవ్వితే కుప్పకూలే ప్రమాదం ఉందని కేంద్ర భూగర్భ శాస్త్రవేత్తలు నాడు ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. దీంతో ఒక సొరంగం స్థానంలో 11 మీటర్ల వ్యాసంతో 5.7 కి.మీ. పొడవున, పది వేల క్యూసెక్కుల సామర్థ్యంతో రెండు చిన్న సొరంగాల తవ్వకం పనులు చేపట్టారు. వైఎస్సార్ హయాంలోనే వరద కాలువ తవ్వకంతోపాటు రెండు సొరంగాలలో చాలా వరకు పనులు పూర్తయ్యాయి.
చేతులెత్తేసిన చంద్రబాబు సర్కారు..
అవుకులో 2010 నాటికి ఎడమ వైపు సొరంగంలో 350 మీటర్లు, కుడి వైపు సొరంగంలో 180 మీటర్ల పొడవున ఫాల్ట్ జోన్‌లో పనులు మాత్రమే మిగిలాయి. ఫాల్ట్ జోన్‌లో పనులు చేయలేక టీడీపీ సర్కార్ చేతులెత్తేసింది. కుడి వైపు సొరంగంలో ఫాల్ట్ జోన్ ప్రాంతంలో తవ్వకుండా దానికి ఒక వైపు 7 మీటర్ల వ్యాసం, 5 వేల క్యూసెక్కుల సామర్థ్యంతో 394 మీటర్ల మేర ఒక లూప్‌ను 2017లో, 507 మీటర్ల పొడవున మరో లూప్‌ను 2018లో తవ్వి కుడి సొరంగంతో అనుసంధానం చేశారు. వాటి ద్వారా ఐదారు వేల క్యూసెక్కులు తరలించి చేతులు దులుపుకొన్నారు. సీఎం వైఎస్ జగన్ అధికారంలోకి రాగానే ఫాల్ట్ జోన్‌లో పనులు అత్యా«దునిక పద్ధతుల ద్వారా చేపట్టి ప్రాధాన్యతగా పూర్తి చేయాలని జలవనరుల శాఖను ఆదేశించారు.
సీమకు చంద్రబాబు ద్రోహం
గాలేరు–నగరి సుజల స్రవంతి పథకం రాయలసీమ, నెల్లూరు ప్రజల చిరకాల స్వప్నం. ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు 1996లోలోక్‌సభ ఎన్నికల గండం గట్టెక్కేందుకు గండికోట వద్ద గాలేరు–నగరికి శంకుస్థాపన చేశారు. తరువాత తట్టెడు మట్టి కూడా ఎత్తలేదు. 1999 సార్వత్రిక ఎన్నికలకు ముందు వామికొండ వద్ద గాలేరు–నగరికి రెండో సారి శంకుస్థాపన చేశారు.
అధికారంలోకి వచ్చాక ఎలాంటి పనులు చేపట్టలేదు. 1995 నుంచి 2004 వరకూ అధికారంలో ఉన్న చంద్రబాబు సీమ ప్రజలకు తీరని ద్రోహం చేసినట్లు స్పష్టమవుతోంది. విభజన తర్వాత 2014లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు గాలేరు–నగరిలో మిగిలిన పనులను పూర్తి చేయకుండా పాత కాంట్రాక్టర్లపై 60–సీ నిబంధన కింద వేటు వేశారు. జీవో 22, జీవో 63లను వర్తింపజేసి మిగతా పనుల అంచనా వ్యయాన్ని పెంచి సీఎం రమేష్ నేతృత్వంలోని కాంట్రాక్టర్లకు అప్పగించి కమీషన్లు వసూలు చేసుకున్నారు.
వైఎస్సార్ హయాంలో పూర్తయిన గండికోట రిజర్వాయర్ పూర్తి నిల్వ సామర్థ్యం 26.85 టీఎంసీలు కాగా చంద్రబాబు నిర్వాసితులకు పునరావాసం కల్పించకుండా 2019 ఎన్నికలకు ముందు నాలుగైదు టీఎంసీలు నిల్వ చేసి తానే గాలేరు–నగరిని పూర్తి చేసినట్లు నమ్మించేందుకు ప్రయత్నించారు. దీన్ని గుర్తించిన ప్రజలు 2019 ఎన్నికల్లో టీడీపీకి తగిన బుద్ధి చెప్పారు.
సుభిక్షం చేసిన వైఎస్సార్
దివంగత వైఎస్సార్ కృష్ణా జలాలను రాయలసీమకు మళ్లించి సుభిక్షం చేసేందుకు పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సామర్థ్యాన్ని 9 వేల నుంచి 44 వేల క్యూసెక్కులకు పెంచడంతోపాటు గాలేరు–నగరిని చేపట్టారు. తెలుగుగంగ పనులను వేగవంతం చేశారు. హంద్రీ–నీవాను చేపట్టారు. గాలేరు–నగరి పనులకు రూ.4,982.69 కోట్లు ఖర్చు చేసి వరద కాలువతోపాటు గండికోట, వామికొండ, సర్వారాయసాగర్, పైడిపాలెం రిజర్వాయర్ల పనులను చాలావరకు పూర్తి చేశారు.
పక్షం రోజుల్లోనే గండికోట దాహార్తి తీర్చేలా
హిమాలయాలలో రహదారులు, సైనికుల అవసరాల కోసం సొరంగాల తవ్వకాలకు అనుసరిస్తున్న పాలీ యురిథేన్ ఫోమ్ గ్రౌటింగ్ విధానాన్ని అధ్యయనం చేసిన జలవనరుల శాఖ అధికారులు ఆ నిపుణులను రాష్ట్రానికి రప్పించారు. అవుకు రెండో సొరంగంలో 165 మీటర్ల ఫాల్ట్ జోన్‌లో తవ్వకం పనులు చేపట్టి పాలీయురిథేన్ ఫోమ్ గ్రౌటింగ్ విధానంలో విజయవంతంగా పూర్తి చేశారు.
ఇప్పటికే పూర్తైన మొదటి సొరంగం ద్వారా పది వేల క్యూసెక్కులు, తాజాగా పూర్తయిన రెండో సొరంగం ద్వారా మరో పది వేల క్యూసెక్కులు కలిపి ప్రస్తుత డిజైన్ మేరకు 20 వేల క్యూసెక్కులను గాలేరు–నగరి వరద కాలువ ద్వారా తరలించేలా మార్గం సుగమం చేశారు. దీంతో శ్రీశైలానికి వరద వచ్చే 15 రోజుల్లోనే గండికోట జలాశయాన్ని నింపవచ్చునని అధికారులు చెబుతున్నారు.
చిత్తశుద్ధితో సీఎం జగన్ అడుగులు
శ్రీశైలానికి వరద వచ్చే రోజుల్లోనే గాలేరు–నగరిపై ఆధారపడ్డ ప్రాజెక్టులను నింపేలా వరద కాలువ సామర్థ్యాన్ని 30 వేల క్యూసెక్కులకు పెంచే పనులను సీఎం జగన్ చేపట్టారు. ఆ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. గాలేరు–నగరిలో మిగిలిన పనులను కూడా పూర్తి చేసి సీమను సస్యశ్యామలం చేసే దిశగా చిత్తశుద్ధితో వేగంగా అడుగులు వేస్తున్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే నిర్వాసితులకు రూ.వెయ్యి కోట్లతో పునరావాసం కల్పించడం ద్వారా గండికోటలో 2019లోనే 26.85 టీఎంసీలను నిల్వ చేయడం గమనార్హం. వరుసగా 2020, 2021, 2022లోనూ 26.85 టీఎంసీల చొప్పున గండికోటలో నిల్వ చేశారు.
వామికొండ, సర్వారాయసాగర్, పైడిపాలెం రిజర్వాయర్లలోనూ పూర్తి స్థాయిలో నీటిని నిల్వ చేశారు. నాడు చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌లో నిర్వాసితులకు పునరావాసం కల్పించకపోవడం వల్ల పది టీఎంసీలకుగానూ నాలుగు టీఎంసీలను మాత్రమే టీడీపీ సర్కారు నిల్వ చేసింది. సీఎం జగన్ రూ.250 కోట్లు వెచ్చించి నిర్వాసితులకు పునరావాసం కల్పించడం ద్వారా చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌లో 2019 నుంచి నాలుగేళ్లుగా పదికి పది టీఎంసీలను నిల్వ చేసి ఆయకట్టుకు నీళ్లందిస్తూ వస్తున్నారు.
♦ బనకచర్ల క్రాస్ రెగ్యులేటర్ నుంచి వెలిగోడు రిజర్వాయర్ వరకూ ఉన్న లింక్ కెనాల్, వెలిగోడు నుంచి బ్రహ్మంసాగర్ వరకు తెలుగుగంగ కెనాల్‌కు లైనింగ్ చేయకపోవడం వల్ల సామర్థ్యం మేరకు నీరు ప్రవహించడం లేదు. దాంతో వెలిగోడు, బ్రహ్మంసాగర్‌కు సకాలంలో నీళ్లు చేరక ఆయకట్టు రైతులు ఇబ్బంది పడుతున్నారు. దీన్ని గుర్తించిన సీఎం జగన్ రూ.500 కోట్లతో ఆ కాలువలకు లైనింగ్ చేయించారు. ఫలితంగా 2019 నుంచి ఏటా వెలిగోడు రిజర్వాయర్‌ను సకాలంలో నింపుతున్నారు.
♦ బ్రహ్మంసాగర్ మట్టికట్ట లీకేజీలకు అడ్డుకట్ట వేయకపోవడం వల్ల 17.74 టీఎంసీలకుగానూ 2018 వరకూ నాలుగు టీఎంసీలను మాత్రమే నిల్వ చేశారు. సీఎం జగన్ అధికారంలోకి వచ్చాక రూ.వంద కోట్లతో డయాఫ్రమ్ వాల్ ద్వారా లీకేజీలకు అడ్డుకట్ట వేశారు. దీంతో 2020 నుంచి 17.74 టీఎంసీలను నిల్వ చేస్తూ ఆయకట్టుకు పూర్తి స్థాయిలో నీటిని అందిస్తున్నారు.
సీమ చరిత్రలో మేలిమలుపు
ముఖ్యమంత్రి జగన్ మార్గ నిర్దేశాల మేరకు అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తూ అత్యాధునిక పరిజ్ఞానంతో అవుకు రెండో సొరంగాన్ని పూర్తి చేశాం. ప్రస్తుత డిజైన్ మేరకు గాలేరు–నగరి వరద కాలువ ద్వారా 20 వేల క్యూసెక్కులు తరలించేందుకు మార్గం సుగమమైంది. దీంతో గాలేరు–నగరి తొలి దశ పూర్తైంది. శ్రీశైలానికి వరద రాగానే గండికోట, వామికొండ, సర్వారాయసాగర్, పైడిపాలెం, చిత్రావతి రిజర్వాయర్లను సత్వరమే నింపి సకాలంలో ఆయకట్టుకు నీటిని అందించి రైతులకు లబ్ధి చేకూర్చేలా అన్ని అడ్డంకులను సీఎం జగన్ తొలగించారు. సీమ చరిత్రలో ఇదో మేలిమలుపు. – శశిభూషణ్‌కుమార్, జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శి
ప్రణాళికాబద్ధంగా పూర్తి
సంక్షేమం, అభివృద్ధిని సమతుల్యం చేస్తూ సీఎం జగన్ రాష్ట్రాన్ని ప్రగతిపథంలో నిలిపారు. ముఖ్యమంత్రి రూపొందించిన ప్రణాళిక మేరకు సాగునీటి ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేస్తున్నాం. ఇప్పటికే సంగం బ్యారేజ్, నెల్లూరు బ్యారేజ్‌లను పూర్తి చేసి సీఎం జగన్ జాతికి అంకితం చేశారు. కర్నూలు, నంద్యాల జిల్లాల్లో హంద్రీ–నీవా నుంచి 77 చెరువులను నింపే ఎత్తిపోతలను పూర్తి చేసి ప్రారంభించారు. ఇప్పుడు గాలేరు–నగరిలో అత్యంత కీలకమైన అవుకు సొరంగాన్ని జాతికి అంకితం చేస్తున్నారు. – సి.నారాయణరెడ్డి, ఇంజనీర్–ఇన్–చీఫ్, జలవనరుల శాఖ
అసాధ్యాన్ని సుసాధ్యం చేశారు
దివంగత వైఎస్సార్ అవుకు చెరువును రిజర్వాయర్‌గా మార్చారు. 20 వేల క్యూసెక్కులను తరలించేందుకు రెండు టన్నెళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. మట్టి వదులుగా ఉండటంతో పనులకు ఆటంకం కలిగింది. ఆ తరువాత టీడీపీ పాలకులు విఫలం కావటంతో పనులు నిలిచిపోయాయి. సీఎం జగన్ పనులను వేగంగా పూర్తి చేసి రైతులకు సాగు నీరు అందిస్తున్నారు. అసాధ్యమైన పనిని సుసాధ్యం చేసి చూపించారు. – అరవ రూమభూపాల్ రైతు శింగనపల్లె
ఏటా రెండు పంటలు..
గతంలో నీరు సరిగా అందక ఏడాదికి ఒక్క పంట మాత్రమే పండించాం. సీఎం జగన్ పుణ్యమా అని రెండో టన్నెల్ పనులు పూర్తి కావడంతో అవుకు రిజర్వాయర్ నీటితో కళకళలాడనుంది. భూగర్భ జలాలు కూడా సమృద్ధిగా పెరుగుతాయి. ఇక ఏటా రెండు పంటలు పండించుకుంటాం. ఒక ఏడాది వర్షాలు పడకపోయినా అవుకు రిజర్వాయర్ ద్వారా పంటలు పండించుకునే అవకాశం ఉంది. సీఎం జగన్‌కు రైతులంతా రుణపడి ఉంటారు. – దొర్నిపాటి నాగరాజు, రైతు, అవుకు
కల నెరవేరింది
రెండో టన్నెల్ నుంచి అవుకు రిజర్వాయర్‌లోకి నీళ్లు రావడం కలగానే మిగిలిపోతుందనుకున్నాం. సీఎం జగన్ అవుకు టన్నెళ్లు పూర్తి చేసి 20 వేల క్యూసెక్కుల నీటిని వదలనుండటం ఎంతో సంతోషంగా ఉంది. రైతుల కల నెరవేరుతోంది. – వెలుగు సీతారామయ్య రైతు, అవుకు
Comments
Please login to add a commentAdd a comment