ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ప్రాజెక్టుల యాత్ర చేస్తూ మద్యం సరఫరా గురించి మాట్లాడుతున్నారు. కర్నూలు న్యాయరాజధాని ఎందుకు చేయలేదని అడుగుతున్నారు. తన హయాంలో ప్రాజెక్టులను పూర్తి చేసేసినట్లు కోతల మీద కోతలు కోస్తున్నారు.
వివిధ సంక్షేమ అభివృద్ది కార్యక్రమాల ద్వారా ప్రజలలో బాగా చొచ్చుకుపోయిన ముఖ్యమంత్రి జగన్ పైన, వైఎస్ ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపైన అధిక శాతం అభాండాలు మోపడమే లక్ష్యంగా ఆయన ఈ యాత్ర చేస్తున్నారు. ఒకప్పుడు చంద్రబాబు ఎన్నికల ముందు హడావుడిగా ప్రాజెక్టులు చేపడతానంటూ శంకుస్థాపనలు చేశారు.
ఆ తర్వాత వాటి ఊసే ఎత్తలేదు. అప్పట్లో ప్రతిపక్ష నేతగా ఉన్న వైఎస్ రాజశేఖరరెడ్డి ఆ ప్రాజెక్టులవద్దకు వెళ్లి పూలు పెట్టి నిరసన తెలిపారు. బహుశా దానిని దృష్టిలో ఉంచుకుని చంద్రబాబు ప్రస్తుతం ఆ పద్దతిలోనే పాట్లు పడుతున్నారు.
(చదవండి: సినిమాలు తీసి అప్పులు తీర్చాలనుకోవడం అమాయకత్వం)
ఉమ్మడి ఎపిలోకాని, విభజిత ఎపిలో కాని కలిపి పద్నాలుగేళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబుకు అసలు భారీ ప్రాజెక్టులపై నమ్మకం లేదు. అవి సత్వరమే పూర్తి కావని, వాటివల్ల రాజకీయ ప్రయోజనం రాదన్నది ఆయన సిద్దాంతం.
అందువల్లే తెలుగుదేశం నేతలు కోరినా పోలవరం, పులిచింతల, వెలిగొండ తదితర ప్రాజెక్టుల జోలికి వెళ్లలేదు. రాజశేఖరరెడ్డి వచ్చాకే ప్రాజెక్టులకు ప్రాధాన్యత వచ్చింది. ఆయన ప్రాజెక్టులను ప్రకటించడమే కాదు.. చకచకా చేపట్టారు. వాటిని అడ్డుకోవడానికి తెలుగుదేశం చేయని ప్రయత్నం లేదు.
అంతదాకా ఎందుకు! 2014 నుంచి 2019 వరకు అధికారంలో ఉన్నప్పుడు ఆయన స్వయంగా ఏ ప్రాజెక్టు ప్రారంభించారు? దేనిని పూర్తి చేశారు? ఏదో ఒకటి చెప్పడం తప్ప ఆయనకు నిజాయితీ లేదన్నది వాస్తవం. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తాను అధికారంలోకి రాగానే రాయలసీమ ఎత్తిపోతల పధకాన్ని చేపట్టినా, పోతిరెడ్డిపాడును విస్తరించాలని తలపెట్టినా చంద్రబాబు సహకరించారా?
వైఎస్ ఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పోతిరెడ్డిపాడును విస్తరించడానికి ప్లాన్ చేస్తే టిడిపి నేతలతో విజయవాడ ప్రకాశం బ్యారేజీపై దేవినేని ఉమా, కోడెల వంటి నేతలతో ధర్నాలు చేయించింది చంద్రబాబు కాదా? అది రాయలసీమకు మేలు చేయడానికా? ద్రోహం చేయడానికా?
పోతిరెడ్డిపాడు విస్తరిస్తే కోస్తాకు నీరు రావని ప్రచారం చేసింది టిడిపి నేతలు కాదా? అప్పుడేమో అలా వ్యవహరించి ఇప్పుడేమో రాయలసీమకు తానేదో పోడిచేశానని, జగన్ చేయడం లేదని అసత్య ప్రచారం చేయడానికి ఈ యాత్రను సంకల్పించారన్న సంగతి తెలుస్తూనే ఉంది.
(చదవండి: అలా చెప్పే ధైర్యం చంద్రబాబుకు ఉందా?: మంత్రి అంజాద్ బాషా)
కడప జిల్లాలో గండికోట రిజర్వాయిర్ లో 27 టిఎమ్.సిల నీటిని నిలబెట్టడానికి వైఎస్ చేసిన కృషిని జిల్లా ప్రజలు ఎన్నటికి మరవరు. చంద్రబాబు ఎంత చెప్పినా అవన్ని ఉబుసుపోక కబుర్లే అవుతాయన్న సంగతి అందరికి తెలుసు. పులివెందులకు గండికోట నుంచి నీరు తెస్తానని ప్రతిపక్షనేతగా ఉన్నప్పుడు వైఎస్ ఆర్ చెబితే ఎవరూ నమ్మలేదట.
అదెలా సాధ్యమని చాలా మంది భావించారట. కాని ఆయన ముఖ్యమంత్రి అవ్వగానే కొండను తొలిచి టన్నెల్ ను నిర్మించి నీరు రప్పించిన తీరు చూశాకా ఔరా! అని అనుకున్నామని పులివెందులలో ఒక జర్నలిస్టు మిత్రుడు చెప్పారు. చంద్రబాబు గురించి ఎవరైనా అలా చెబుతారేమో ఆలోచించండి.
ఆయనకు నిజంగా చిత్తశుద్ది ఉంటే పోలవరం ప్రాజెక్టును పక్కనబెట్టి పట్టిసీమ లిఫ్ట్ ప్రాజెక్టును టేకప్ చేసేవారా? విశేషం ఏమిటంటే ఆ లిఫ్ట్ ద్వారా వచ్చిన నీటిని వైఎస్ తవ్వించిన కాల్వ ద్వారానే కృష్ణానదికి తరలించవలసి వచ్చింది. ఆ కాల్వే లేకపోతే పట్టిసీమే లేదు.
అదే కాదు వైఎస్ ముందు చూపుతో పోలవరం కాల్వలు తవ్వించి ఉండకపోతే పోలవరం ఇప్పటికి కూడా మొదలయ్యేది కాదు. కేంద్రం చేపట్టవలసిన పోలవరం ప్రాజెక్టును చంద్రబాబు తీసుకుని మొత్తం ప్రాజెక్టును గందరగోళంలోకి నెట్టారు. లేకుంటే పునరావాసం తో సహా అన్ని వ్యయాల బాధ్యత కేంద్రానిది అయి ఉండేది.
నిజంగా చంద్రబాబుకు ప్రాజెక్టులపై చిత్తశుద్ది ఉంటే , నీటి పారుదల ప్రాజెక్టుల సందర్శనకు వెళ్లి మద్యం గురించి ప్రసంగాలు చేస్తారా? పైగా అందులోను అసత్యాలు! మంచి మద్యాన్ని తక్కువ రేటుకు సరఫరా చేస్తానని నలభై ఐదేళ్ల సీనియర్ నేత అయిన చంద్రబాబు ప్రచారం చేస్తున్నారంటే ఏమన్నా అర్ధం ఉందా? ఇంతకన్నా నీచం ఉంటుందా?
మద్యం తాగవద్దని చెప్పాల్సిన ఆయన తాగండి.. బాబూ.. తాగండి అని ప్రచారం చేస్తున్నారు. మద్యం వ్యాపారం మొత్తం ప్రభుత్వపరంగా నడుస్తుండడంతో ప్రైవేటు దందాకు అవకాశం లేకుండా పోయింది. చంద్రబాబు టైమ్ లో ఏమి జరిగేది. మద్యం సిండికేట్లు రాజ్యమేలేవి. నలభైఐదు వేల బెల్టు షాపులతో మద్యాన్ని ఇంటింటికి సరఫరా చేసేవారు.
దాని ప్రభావంతో ఆయన గత ఎన్నికలలో ఓటమి పాలైనా, ఇప్పటికీ అదే దిక్కుమాలిన నినాదం ఎత్తుకుని తిరుగుతున్నారు. మందుబాబుల ఓట్లతో గెలిచిపోతానని బాబు భ్రమ పడుతున్నట్లుగా ఉంది. కాని ఆయన ఉపన్యాసాలను మహిళలు చీత్కరించుకుంటారని తెలుసుకోలేకపోతున్నారు.
(చదవండి: నేను మూర్ఖుడిని.. ఎవర్నీ వదలను: నారా లోకేశ్)
కర్నూలు న్యాయ రాజధానిగా ఎందుకు చేయలేకపోయారని చంద్రబాబు ప్రశ్నించడం మిలియన్ డాలర్ జోక్ అయినా కావాలి.. మరో అవకాశవాదపు హేళన స్టేట్ మెంట్ అన్నా కావాలి. ఎందుకంటే కర్నూలులో హైకోర్టు రాకుండా అడ్డుపడుతున్నదే ఆయన అయితే.. దానిని నిస్సిగ్గుగా బుకాయించడం శోచనీయం అని చెప్పాలి.
అమరావతి గ్రామాలకు వెళ్లి ఆయన కర్నూలులో హైకోర్టు పెట్టాలని చెప్పగలరా? అక్కడేమో వ్యతిరేకిస్తారు. ఇక్కడేమో తానేదో అనుకూలం అన్నట్లుగా జగన్ ను ప్రశ్నిస్తారు. రాయలసీమ ప్రజలందరికి తెలుసు. ఎవరు కర్నూలుకు హైకోర్టు రాకుండా అడ్డుపడుతున్నది. తద్వారా రాయలసీమకు ద్రోహం చేస్తున్నది చంద్రబాబే అని న్యాయవాదులే కాకుండా అన్ని వర్గాల వారికి స్పష్టత ఉంది.
మరో ఆశ్చర్యకరమైన ప్రకటన చేశారు. ఆయన అధికారంలోకి వస్తే వైసిపివారి పని పడతారట. మురికి కాల్వలో వేసి తొక్కుతారట. ఇది ఒక నాయకుడు మాట్లాడవలసిన తీరేనా? ఇలాంటి నేతను ప్రజలు మళ్లీ ముఖ్యమంత్రిగా చేయడానికి సిద్దపడతారా?
తన ప్రత్యర్ధి పార్టీవారిని మురికి కాల్వలో తొక్కడం ఆయన దృష్టిలో ప్రజాస్వామ్యం అన్నమాట. ఏది ఏమైనా వైఎస్ జగన్ చేపట్టిన సంక్షేమ పథకాల గురించి జనం చర్చించుకోకుండా, వాటిని మర్చిపోయేలా చేసేందుకు చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ లు విపరీతంగా తంటాలు పడుతున్నారు. అదంతా కేవలం ఓటమి భయంతోనే అని అంతా గుర్తించాలి.
-కొమ్మినేని శ్రీనివాస రావు, ఏపీ మీడియా అకాడెమీ చైర్మన్
Comments
Please login to add a commentAdd a comment