ఏపీ ప్రభుత్వం అధికార దుర్వినియోగం చేస్తోందన్న ఈనాడు
ఏబీసీ నుంచి గణాంకాలు తెప్పించిన ఢిల్లీ హైకోర్టు
వెనక్కి తగ్గిన ఈనాడు... అనుబంధ పిటిషన్ ఉపసంహరణ
‘సాక్షి’ సర్క్యులేషన్ గణాంకాల ప్రచురణకు ధర్మాసనం అనుమతి
సాక్షి, అమరావతి: ‘సాక్షి’ దినపత్రిక తన సర్కులేషన్ పెంచుకునేందుకు అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందంటూ ‘ఈనాడు’ అడ్డగోలుగా చేస్తూ వచ్చిన ఆరోపణలు అసత్యమని ఢిల్లీ హైకోర్టు సాక్షిగా తేలిపోయాయి. వలంటీర్లు విస్తృత సర్క్యులేషన్ కలిగిన ఏ దినపత్రికనైనా కొనుగోలు చేయవచ్చంటూ ప్రభుత్వం జీవో జారీ చేయగా దీనివల్ల సాక్షి సర్క్యులేషన్ ఆమాంతం పెరిగిపోయిందంటూ ఈనాడు ప్రమాణపూర్వకంగా చెప్పిన మాటలు, శుద్ధ అబద్ధమని ఆడిట్ బ్యూరో ఆఫ్ సర్కులేషన్ (ఏబీసీ) ఢిల్లీ హైకోర్టుకు సమర్పించిన గణాంకాలు వెల్లడించాయి.
ప్రభుత్వ జీవో వల్ల సాక్షి నిజంగానే లబ్ధి పొంది ఉంటే ఆ పత్రిక సర్క్యులేషన్ మిమ్మల్ని దాటిపోయి ఉండాలి కదా? మరి ఏబీసీ గణాంకాలు మరో రకంగా ఉన్నాయి కదా? అంటూ హైకోర్టు ధర్మాసనం సూటిగా సంధించిన ప్రశ్నలకు ఈనాడు వద్ద సమాధానమే లేకుండా పోయింది. సాక్షి సర్క్యులేషన్ విషయంలో తన ఆరోపణల్లో నిజం లేదని తేలడంతో చేసేదేమీ లేక ఈనాడు వెనక్కి తగ్గింది. హైకోర్టు సైతం సాక్షి సర్క్యులేషన్ గణాంకాలను ప్రచురించేందుకు అనుమతినిచ్చింది.
దీంతో చేసేదేమీ లేక సాక్షి సర్క్యులేషన్ గణాంకాలను ప్రచురించకుండా ఏబీసీని నిరోధించాలంటూ దాఖలు చేసిన అనుబంధ వ్యాజ్యాన్ని ఈనాడు ఉపసంహరించుకుంది. విస్తృత సర్క్యులేషన్ ఉన్న ఏ దినపత్రికనైనా కొనుక్కునేందుకు వలంటీర్లకు అనుమతినిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవోను సవాలు చేస్తూ ఈనాడు దాఖలు చేసిన ప్రధాన వ్యాజ్యంలో తదుపరి విచారణను ఏప్రిల్ 25కి వాయిదా వేసింది. ఈ మేరకు ఢిల్లీ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్ మన్మోహన్, న్యాయమూర్తి జస్టిస్ మన్మీత్ ప్రతీమ్ సింగ్ ఆరోరా ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది.
Comments
Please login to add a commentAdd a comment